Published : 14/04/2022 19:28 IST

మండే ఎండల్లో.. పెళ్లి కళ ఇలా..!

ఎండలు మండిపోతున్నాయి. కూలర్లు, ఏసీలు ఉన్నా అవి ఎండ వేడిని దూరం చేయలేకపోతున్నాయి.. సాధారణంగా మన పరిస్థితే ఇలా ఉంటే ఇక పెళ్లి కూతుళ్ల సంగతేంటి? అసలే ఉక్కపోత.. ఆపై పట్టుచీర, భారీ నగలు, పూలజడ.. వీటికి తోడు కెమెరా లైట్ల వేడి.. ఇలా చెమట నుంచి తప్పించుకోవడం వధువుకు దాదాపుగా అసాధ్యమనే చెప్పుకోవాలి. చెమట పడితే ఫర్వాలేదు.. కానీ అది ఎక్కువై మన మేకప్‌ని పాడు చేస్తే మాత్రం అందంగా కనిపించాల్సిన వేడుకలో డల్‌గా, అందవిహీనంగా కనిపిస్తాం.. అందుకే ఎండాకాలంలో పెళ్త్లెతే మేకప్ వేసుకునే ముందు, ఆ తర్వాత కొన్ని చిట్కాలు పాటించాలి. తద్వారా మేకప్ చెరిగిపోకుండా జాగ్రత్తపడచ్చు.. అందంగా మెరిసిపోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం రండి..

ముందు నుంచే..

పెళ్లిలో కుందనపు బొమ్మలా అందంగా కనిపించాలని కొద్ది రోజుల ముందు నుంచే ప్రత్యేకంగా సిద్ధమవుతుంటారు కొందరు కాబోయే నవవధువులు.. రకరకాల బ్యూటీ ట్రీట్‌మెంట్లు చేయించుకొని మెరిసిపోయేలా కనిపించాలని తాపత్రయ పడుతుంటారు. ఎండాకాలంలో ఈ పద్ధతి చాలా మంచిది. దీనివల్ల మేకప్ తక్కువగా ఉపయోగించి ఎక్కువ అందంగా కనిపించే వీలుంటుంది. కేవలం బ్యూటీ ట్రీట్‌మెంట్లే కాదు.. పోషకాహారం ద్వారా కూడా చర్మపు మెరుపును పెంచుకోవచ్చు. ఎక్కువగా నీళ్లు తాగడం ద్వారా మేని మృదుత్వాన్ని కాపాడుకోవచ్చు. ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల కూడా తక్కువ మేకప్‌తోనే అందంగా కనిపించే వీలుంటుంది. అంతేకాదు.. పెళ్లి సమయంలో చల్లని నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చెమట పట్టకుండా జాగ్రత్తపడచ్చు.

ఐస్ థెరపీతో..

చర్మానికి మేకప్ వేసేటప్పుడు చర్మం ఉష్ణోగ్రతను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే చర్మం ఎంత వేడిగా ఉందన్న దాన్ని బట్టే మేకప్ వేసుకున్న తర్వాత మనం ఎంత అందంగా కనిపిస్తామన్న విషయం ఆధారపడి ఉంటుంది. అందుకే మేకప్ చేసుకునే ముందు ఓ ఐస్ ముక్కతో చర్మాన్ని బాగా రుద్ది ఆపై మేకప్ వేసుకోవడం ప్రారంభించాలి. ఐస్ ముక్కతో రుద్దడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఆపై మేకప్ వేసుకోవడం వల్ల అది చర్మానికి సరిగ్గా పట్టుకుంటుంది. అదే చర్మ రంధ్రాలు తెరిచి ఉండగానే మేకప్ వేస్తే అది వాటి లోపలికి వెళ్లిపోయి గుంటలుగా కనిపించే అవకాశం ఉంది. అంతేకాదు.. దీనివల్ల మొటిమలు కూడా రావచ్చు.

సిద్ధంగా ఉంచుకోండి..

పెళ్లి సమయంలో చెమట పట్టకుండా, ఒకవేళ పట్టినా లుక్ పాడవకుండా ఉండడానికి తగిన సామగ్రిని వెంట ఉంచుకోవాలి. దీనికోసం ఒక ఫేషియల్ మిస్ట్‌ని మీ వెంట ఉంచుకొని కాస్త వేడిగా అనిపించినప్పుడు లేదా.. కాస్త గ్యాప్ ఇస్తూ మధ్యమధ్యలో స్ప్రే చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ముఖానికి చెమట పట్టకుండా జాగ్రత్తపడచ్చు. ఇది మేకప్‌ని కూడా డ్రై కాకుండా కాపాడి మోము తాజాగా కనిపించేలా చేస్తుంది. దీంతో పాటు ఓ బేబీ వైప్స్ డబ్బాను కూడా వెంటే ఉంచుకోవాలి. వీటితో అప్పుడప్పుడూ టచప్ చేసుకోవడం వల్ల మేకప్ చెరిగిపోయినట్లుగా అనిపించదు. ఒకవేళ ఎక్కడైనా మేకప్ చెరిగిపోతున్నట్లుగా అనిపిస్తే దాన్ని సరి చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.

సహజసిద్ధమైన మేకప్

సాధారణంగా పెళ్లి వేళలో అందంగా కనిపించడానికి మేకప్ హెవీగా వేసుకుంటుంటారు. కానీ ఎండాకాలంలో ఎంత తక్కువ మేకప్ ఉపయోగిస్తే అంత మంచిది. ఆయిల్ బేస్‌డ్ మేకప్ కాకుండా వాటర్ బేస్‌డ్ తరహావి ఉపయోగించడం వల్ల చెమట పట్టినా పెద్దగా ఇబ్బంది పడకుండా ఉండచ్చు. అలాగే ప్రైమర్, BB క్రీమ్‌ని తప్పకుండా ఉపయోగించాలి. దీనివల్ల మేకప్ చెరిగిపోకుండా ఎక్కువ సమయం నిలిచి ఉండే వీలుంటుంది. అలాగే ఈ కాలంలో డార్క్ షేడ్స్‌ని మేకప్‌లో ఉపయోగించడం సరికాదు.. దీని బదులు సహజసిద్ధంగా చర్మం రంగుకు దగ్గర్లో ఉండే రంగులను ఎంచుకుంటే కాస్త మేకప్ చెరిగిపోయినా ఎబ్బెట్టుగా కనిపించే వీలుండదు. డార్క్ ఐ షాడో, స్మోకీ ఐస్, బ్రాంజర్ లాంటివి ఉపయోగించకపోవడం మంచిది. మేకప్‌లో భాగంగా మినరల్ పౌడర్‌ని ఎక్కువగా ఉపయోగించాలి. అది చెమటను ఇట్టే పీల్చుకొని అందమైన లుక్‌ని అలాగే నిలిపి ఉంచడంలో సాయం చేస్తుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని