Published : 23/04/2022 16:50 IST

వాళ్లపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

ఓ రైతు నుంచి 2021లో 82 సెంట్ల భూమి (సర్వే నం. 35/2ఏ2) కొన్నాం. అతడి ఈసీ ప్రకారం సర్వే నం. 35/2ఏలో 80 సెంట్లు, సర్వే నం. 35/2బీలో 13 సెంట్లుగా నమోదైంది. తర్వాత దాన్ని సర్వే నం.35/2ఏ2గా మార్చారు. మొత్తం ఒక ఎకరం, 93 సెంట్లకు పట్టా పాస్‌బుక్‌ ఉంది. అందులో ఎకరం వేరేవాళ్లకు నాలుగేళ్ల కిందట అమ్మేశారు. మిగిలిన 93 సెంట్లలో 82 సెంట్లు మేం కొనుక్కున్నాం. పట్టా పాసు బుక్‌ కోసం దరఖాస్తు చేసినప్పుడు మొత్తం స్థలంలో మూడు సెంట్లు వేరేవాళ్లదిగా తేలిందని, మాకు పాసుబుక్‌ ఇవ్వడం లేదు. ఈ విషయంలో మేం తహశీల్దారు, అమ్మిన వ్యక్తిపై ఏవిధంగా చర్యలు తీసుకోవాలి? - లత, హైదరాబాద్

జ. మీరు కొన్నప్పుడు సేల్‌ డీడ్‌లో సరిహద్దులు ఎలా రాసుకొన్నారు? సాధారణంగా సర్వే చేసినప్పుడు సరిహద్దులు స్పష్టంగా రాసుకుని, కొనుక్కునేవాళ్లు.. వాళ్ల భూమిని సర్వే చేయించుకుని దాని సరిహద్దులను షెడ్యూల్‌లో నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. మీరు సేల్‌ డీడ్‌లో సర్వే నంబరు 35/2ఏ2లో 82 సెంట్లు కొన్నట్లుగా రాసుకున్నప్పుడు ఏదైనా తేడా వచ్చినా, మీకు అన్యాక్రాంత భూమిని అమ్మినట్లుగా తెలిసినా దానికి అమ్మిన వాళ్ల దగ్గర నుంచి ఇండెమినిటీ/బాధ్యత వహించాలని రాసుకుంటారు. సర్వే నంబర్లు సరిగా ఉన్నాయా అని చూసుకోవాల్సింది మీరే. మీకు సమస్య మూడు సెంట్ల భూమితో వచ్చింది. మీరు ముందుగా మళ్లీ రెక్టిఫికేషన్ డీడ్‌ (సవరణ) రాసుకుని ఇంతకు ముందు అమ్మిన స్థలం సర్వే నంబరు 35/2ఏ2లో 82 సెంట్లుగా చెప్పారు. ఇప్పుడది సర్వే నంబరు 35/2ఏ2లో 77 సెంట్లు, సర్వే నంబరు 35/2బీలో 5 సెంట్లు భూమిగా చూపించి రిజిస్టర్‌ చేయించుకోండి.

కచ్చితంగా మీకు అమ్మిన పొలం సరిహద్దులతో సహా మీకు అప్పజెప్పాల్సిన బాధ్యత మీకు అమ్మిన వ్యక్తిదే. సర్వే నంబరు మారితే దేనిలో ఎంతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. కాబట్టి వేరేవాళ్లకు ఒక ఎకరం, మీకు 82 సెంట్లు అమ్మగా మిగిలిన 11 సెంట్లు అతడిదే అయ్యుండాలి. ఈ విషయంలో తహశీల్దారుతో ఏదైనా గొడవ వస్తే అతడు కోర్టులో తేల్చుకోవాలి.

మీకు అమ్మిన వ్యక్తి ముందర మీ సమస్య పరిష్కరించుకోవాలి. అతని సమస్యను కలెక్టర్‌కి అప్లికేషన్ పెట్టి పరిష్కరించుకోమనండి. మీ సమస్యకి అతనే మళ్లీ సర్వే నంబర్లు రెక్టిఫికేషన్ డీడ్‌ రాసి రిజిస్టర్‌ చేస్తే దాన్ని కూడా తహశీల్దారు అంగీకరించకపోతే అప్పుడు మీరు కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. సర్వే చేయకుండా, మీకు అమ్మిన భూమి ఎక్కడుందో తెలియకుండా.. విచారణ ముందుకు సాగదు. ప్రయత్నించి చూడండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని