Updated : 07/12/2022 13:09 IST

అక్కను వేధిస్తున్నాడు.. నా పెళ్లి చెడగొట్టాడు..!

మేము ముగ్గురం అమ్మాయిలం. మా అక్కలిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. నాకు సంబంధాలు చూస్తున్నారు. ఒక సంబంధం ఎంగేజ్‌మెంట్‌ వరకు వచ్చి ఆగిపోయింది. వాళ్లకు మా చిన్న బావే చెడుగా చెప్పాడని తెలిసింది. పెళ్లై మూడేళ్లవుతున్నా ఇప్పటికీ అతను అక్కను వేధిస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి పని చేయడం వల్ల చాలా బాధగా ఉంది. ఈ విషయం గురించి అతనినే నేరుగా అడిగేద్దామనుకుంటే మా అక్క వద్దంది. తనను హింసిస్తాడని, అతన్ని ఏమీ అనొద్దని మమ్మల్ని బతిమాలుతోంది. అతనికి ఎలా బుద్ధి చెప్పాలో తెలియడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. మీ అక్కను అతను మూడేళ్లుగా వేధిస్తున్నాడని చెబుతున్నారు. కాబట్టి, ముందు మీరు మీ అక్క సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేయడం మంచిదేమో ఆలోచించండి. ఇందుకోసం తనలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయండి. మూడేళ్లుగా అతను మీ అక్కను వేధిస్తున్నా మీ కుటుంబ సభ్యులెవరూ జోక్యం చేసుకోకపోవడంతో అతను అలుసుగా తీసుకున్నాడేమో ఆలోచించండి. తనకు ఏదైనా హాని జరిగితే ఒక కుటుంబంగా తనకు మీరున్నారనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేయండి. వేధింపుల గురించి పెద్దవాళ్లతో కూర్చొని పరిష్కరించుకోవచ్చేమో ఆలోచించండి. ఈక్రమంలో అతనికి వార్నింగ్‌ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించండి. ఇలా చేయడం వల్ల అతను తన ప్రవర్తన మార్చుకుని మీ అక్కతో సఖ్యతగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే భవిష్యత్తులో మీ కుటుంబ అంశాల్లో జోక్యం చేసుకోవడానికి కూడా అతను ధైర్యం చేయకపోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి