Published : 30/12/2022 14:14 IST

ఒత్తిడి వల్ల దద్దుర్లు వస్తాయా?

నా వయసు 40 సంవత్సరాలు. ఒత్తిడికి లోనైనప్పుడు నా ముఖమంతా దద్దుర్లు వస్తున్నాయి. వచ్చిన చోటే మళ్లీ మళ్లీ వస్తున్నాయి. మళ్లీ వాటంతట అవే తగ్గిపోతున్నాయి. ఒత్తిడి వల్లే దద్దుర్లు వస్తున్నాయా? ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు. - ఓ సోదరి.

జ. మీరు ఒత్తిడికి లోనైనప్పుడు దద్దుర్లు వస్తున్నాయంటున్నారు. సాధారణంగా దద్దుర్ల సమస్య ఉన్నప్పుడు శరీరమంతటా వస్తుంటాయి. కానీ, మీరు ముఖం మీద మాత్రమే వస్తున్నాయని చెబుతున్నారు. కాబట్టి, మీ సమస్యను రెండు విధాలుగా చూడచ్చు.
ఒకటి దద్దుర్లు అలర్జీ వల్ల వస్తున్నాయా? అన్న విషయాన్ని పరిశీలించాలి. ఒకవేళ అలర్జీ అని నిర్ధారించుకుంటే అది ఏరకమైన అలర్జీయో తెలుసుకోవాలి.

రెండోది రొజేషియా అనే సమస్య వల్ల కూడా దద్దుర్లు వస్తుంటాయి. ఈ సమస్య ఉన్నవారిలో చెంపలు, ముక్కు, నుదుటి భాగం ఎర్రగా మారడం, మొటిమలు రావడం, చర్మం వాచిపోయినట్లు అనిపించడం జరుగుతుంటుంది. ఇలాంటివారు ఎండలోకి వెళ్లినప్పుడు, ఒత్తిడికి లోనైనప్పుడు, స్పైసీ ఫుడ్‌ తీసుకున్నప్పుడు ఈ సమస్య మళ్లీ మళ్లీ వస్తుంటుంది. ఈ సమస్య ఉన్నవారు మైల్డ్‌ సోప్ ఉపయోగించాలి. దీనివల్ల చర్మం ఎర్రగా మారడం తగ్గుతుంది. అలాగే మాయిశ్చరైజర్ల ఎంపిక విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారే అవకాశం ఉంటుంది.

కాబట్టి, ముందుగా మీ సమస్యకు కారణం అలర్జీనా? రొజేషియానా? అన్న విషయాన్ని తెలుసుకుని ఆ తర్వాత దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.

ఇక ఒత్తిడికి లోనైనప్పుడు ఈ సమస్య వస్తోందని చెబుతున్నారు. కాబట్టి, దానికి తగిన పరిష్కారాన్ని అన్వేషించాలి. ఇందుకోసం యోగా, ధ్యానం చేయడాన్ని జీవనశైలిలో భాగం చేసుకోవాలి. మందులు వాడడం ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కానీ, శరీరానికి అది అంత మంచిది కాదు. కాబట్టి, సాధ్యమైనంత వరకు సమస్యను సహజసిద్ధంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని