Updated : 17/01/2022 20:36 IST

నెరిసిన జుట్టు నల్లగా మారాలంటే ఏం చేయాలి?

హాయ్ మేడం.. నా వయసు 32సం||. నా జుట్టు చాలా పొడవుగా, లావుగా ఉంటుంది. కానీ నెరిసిపోయింది. ఇది వంశపారంపర్యంగా వచ్చిన సమస్య. దీంతో నా వయసు ఎక్కువగా కనిపిస్తోంది. జుట్టుకి రంగు వేస్తే పాడవుతుందనే ఉద్దేశంతో నేను హెన్నా పెట్టుకొంటున్నాను. దానివల్ల జుట్టు ఎరుపు రంగులోకి మారిపోయింది. అందరూ తలకు రంగు వేయమని చెబుతున్నారు. కానీ వాటిలోని రసాయనాల వల్ల జుట్టు పాడవుతుందేమోనని ఆలోచిస్తున్నాను. జుట్టు నల్లగా మారడానికి బ్లాక్‌హెన్నా ఉపయోగించచ్చా? ప్రస్తుతం ఎరుపు రంగులో ఉన్న నా జుట్టుకి రంగు వేయడం వల్ల చూడటానికి బాగుంటుందా? హెయిర్ డై కాకుండా జుట్టుని నల్లగా మార్చుకోవడానికి సహజసిద్ధమైన పద్ధతులేమైనా ఉన్నాయా? ఆ చిట్కాలేంటో చెప్పండి.

జ. ఇప్పటికిప్పుడు జుట్టు నలుపు రంగులోకి మారిపోవాలంటే డై తప్ప వేరే మార్గం లేదు. అయితే వాటిలోని రసాయనాల కారణంగా కురులకు కొంత మేర నష్టం కూడా జరుగుతుంది. కాస్త సమయం వెచ్చించి నెమ్మదిగా ప్రయత్నిస్తే సహజసిద్ధంగానే కేశాలను తిరిగి నలుపు రంగులోకి మార్చుకోవచ్చు.

ఉసిరి పొడి - 1 కప్పు

పెరుగు - 2 కప్పులు

హెన్నా పెట్టుకోవడానికి ముందు రోజు రాత్రి ఈ రెండింటినీ ఇనుప కడాయిలో నానబెట్టి పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయానికి ఇది నలుపు రంగు పేస్ట్‌లా తయారవుతుంది. ఇప్పుడు గుంటగలగరాకులను తీసుకుని మెత్తని ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న పేస్ట్‌లో ఒక చెంచా కాఫీ పొడి, సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న గుంటగలగరాకు ముద్ద వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసుకోవాలి. 45 నిమిషాల పాటు ఆరనిచ్చి, తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు ప్యాక్ వేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల రెండు లేదా మూడు నెలలకు జుట్టు రంగులో మార్పు కనిపిస్తుంది.

దీంతోపాటు తరచూ జుట్టుకి నూనె రాసే అలవాటు ఉన్నవారు కొబ్బరినూనె, ఆముదం సమపాళ్లలో తీసుకొని కురులకు అప్త్లె చేసుకోవడం మంచిది.

గమనిక: ఈ ప్యాక్‌ను ఆయిలీ హెయిర్ మీద పెట్టుకోకూడదు. తలస్నానం చేసి, ఆరిన తర్వాత మాత్రమే ఈ ప్యాక్ అప్త్లె చేసుకోవాలి. అప్పుడే ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి.


Advertisement

మరిన్ని