Published : 17/11/2021 20:03 IST

హంగరీ భామల సౌందర్యం వెనుక..!

అందాన్ని నిర్వచించాలంటే.. ఒక్కసారి హంగరీ అమ్మాయిల్ని చూపిస్తే చాలని అనడంలో అతిశయోక్తి లేదు. నిజంగానే వారిని చూస్తుంటే దివి నుంచి దిగొచ్చిన దేవకన్యలే ఈ దేశంలో ఉండిపోయారేమో అనిపించకమానదు. అంతటి సౌందర్యం, సోయగం తమ సొంతం చేసుకోవడానికి సహజసిద్ధమైన పద్ధతులు తప్ప వేరే ఎటువంటి మ్యాజిక్‌ లేదంటున్నారు హంగరీ ముద్దుగుమ్మలు. ఈ క్రమంలో వారు తమ సౌందర్య పోషణకు వాడే పద్ధతులు చూస్తే ఇంతేనా.. చాలా సింపుల్‌గా ఉన్నాయే! అనిపించకమానదు. కానీ అలాంటి సింపుల్‌ అండ్‌ స్వీట్‌ బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌తోనే మచ్చలేని చందమామల్ని తలపిస్తోన్న ఈ అందాల రాశుల వెనుకున్న ఆ సౌందర్య రహస్యాలేంటో మనమూ తెలుసుకుని పాటించేద్దామా మరి..!

టొమాటోతో ట్యాన్‌కి టాటా..!

అది ఎండా కాలమైనా.. చలి కాలమైనా.. సూర్యుని నుండి వెలువడే హానికారక అతినీలలోహిత కిరణాల వల్ల చర్మం నల్లబడడం, సహజ తేమను కోల్పోయి నిర్జీవంగా మారడం.. వంటివి మామూలే. మరి, ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎంతో ఖరీదైన క్రీములు అసలు అవసరం లేదని, కేవలం టొమాటోలుంటే చాలంటున్నారు హంగరీ బ్యూటీస్‌. అందుకోసం టొమాటోను కట్‌ చేసి అందులోని గింజలుండే భాగాన్ని స్పూన్‌తో ఓ గిన్నెలోకి తీసుకోవాలి. దానికి కొద్ది మోతాదులో పంచదార, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేసి ఓ పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. టొమాటోలోని పోషకాలు మొటిమలు, జిడ్డును దూరం చేస్తాయి. ఇక అందులో కలిపిన పంచదార చర్మానికి స్క్రబ్‌లా పనిచేసి చర్మంపై పేరుకుపోయిన మృతకణాల్ని తొలగిస్తుంది. నిమ్మరసం సూర్యరశ్మి వల్ల చర్మం కోల్పోయిన కాంతిని తిరిగి ఇనుమడించేలా చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం! మీ ఇంట్లో టొమాటోలుంటే వెంటనే ఈ సులభమైన, సహజసిద్ధమైన చిట్కాతో సన్‌ట్యాన్‌కి చెక్‌ పెట్టేయండి మరి!

క్యారట్‌ నూనెతో మచ్చలు మాయం!

ఎంత చక్కనైన ఆకృతి కలిగిన ముఖమైనా.. మచ్చలు ఏర్పడితే అందవిహీనంగా కనిపిస్తుంది. ఇక వాటిని కనిపించకుండా చేయడానికి మనం పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. మేకప్‌, ఫేషియల్స్‌ అంటూ.. ఎన్నెన్నో బ్యూటీ టెక్నిక్స్‌ పాటిస్తాం.. కానీ ఫలితం తాత్కాలికమే! మరి, అలాకాకుండా ఇలాంటి మొండి మచ్చల నుండి మీ ముఖానికి శాశ్వత విముక్తి కలిగించాలంటే.. క్యారట్‌ నూనెను వాడితే సరిపోతుందంటున్నారు హంగరీ మగువలు. ఈ క్యారెట్‌ నూనెను నేరుగా మచ్చలపై అప్లై చేసి రాత్రంతా ఉంచుకుని.. ఉదయాన్నే నీటిలో ముంచిన గుడ్డతో ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ఒకవేళ మీకు రాత్రి పెట్టుకోవడం కుదరకపోతే.. మీరు రాసుకునే సీరమ్‌, మాయిశ్చరైజర్‌ వంటి వాటిలో ఈ నూనెను కొన్ని చుక్కలు కలిపి వాడినా చక్కటి ఫలితం ఉంటుంది. ఈ క్యారట్‌ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్‌, విటమిన్‌ ‘ఎ’.. వంటి పోషకాలు నల్ల మచ్చల్ని తొలగించడంలో చురుగ్గా పనిచేస్తాయి. హంగరీ భామలు గత కొన్ని శతాబ్దాలుగా ఈ చిట్కాను పాటిస్తూ మచ్చలేని చందమామలుగా మెరిసిపోతున్నారు.

‘థర్మల్‌ వాటర్‌ బాత్‌’తో నవయవ్వనంగా!

అందమంటే కేవలం ముఖారవిందం ఇనుమడిస్తే చాలనుకుంటారు చాలామంది. కానీ నఖశిఖపర్యంతం అందంగా మెరిసినప్పుడే సౌందర్యం సంపూర్ణమవుతుంది. మరి అటువంటి అందాన్ని ‘థర్మల్‌ వాటర్‌ బాత్‌’తో పొందుతున్నామంటున్నారీ హంగరీ సుందరీమణులు. ఇందుకోసం ఆ దేశంలోని చాలా చోట్ల సహజసిద్ధంగా ఏర్పడిన థర్మల్‌ పూల్స్‌ ఉంటాయి. వర్షం నీరు సహజసిద్ధంగా వేడెక్కి ఏర్పడిన ఈ థర్మల్‌ పూల్స్‌లోని నీరు వేడిగా, చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేసే ఎన్నో ఖనిజాలతో మిళితమై ఉంటుంది. ఈ నీటిలో స్నానం చేయడం వల్ల అందులోని ఖనిజాలు పలు చర్మ సమస్యల్ని తొలగించి నఖశిఖపర్యంతం మేనును మెరిపిస్తాయని వారు నమ్ముతారు. ఈ పద్ధతి ఇప్పటిది కాదు.. దాదాపు 2000 సంవత్సరాల నుండి వారు తమ సౌందర్య పోషణలో భాగంగా దీన్ని పాటిస్తూ అటు శరీరాన్ని ఉత్తేజితం చేసుకుంటూనే.. ఇటు అందానికీ మెరుగులు దిద్దుతున్నారు. అలాగే ఈ ప్రక్రియ ద్వారా చర్మంపై ఏర్పడే ముడతలు, గీతలు వంటివి తగ్గి నవయవ్వనంగా మెరిసిపోవచ్చనేది వారి నమ్మకం. చర్మంపై ఏర్పడే దద్దుర్లు తగ్గి చర్మంలో సహజ తేమను నిలిపి ఉంచే గుణాలు కూడా ఈ నీటిలో ఉన్నాయి. ఇలా హంగరీలో ప్రాచుర్యం పొందిన ఈ థర్మల్‌ బాత్‌ టెక్నిక్‌ కాలక్రమేణా ఇతర దేశాలకూ విస్తరించింది. ఈ క్రమంలో మన దేశంలోనూ ప్రవేశించిన ఈ ట్రెండ్‌ని ప్రస్తుతం ప్రముఖ పట్టణాల్లోని కొన్ని స్పాలు అందుబాటులోకి తీసుకొచ్చాయి.

ఈ ‘మట్టి’తో మెరిసే అందం!

మట్టి.. చాలా చర్మ సమస్యలకు చక్కని పరిష్కారం అని మనం చాలాసార్లు వినే ఉంటాం. అంతేనా సౌందర్య పోషణలో కూడా మనం దీన్ని భాగం చేసుకుంటూ ఉంటాం. అటువంటి ఒక బ్యూటీ పద్ధతినే హంగరీ భామలు కూడా పాటిస్తూ తమ అందాన్ని ద్విగుణీకృతం చేసుకుంటున్నారు. హంగరీ దేశంలో ప్రత్యేకంగా దొరికే మూర్‌ మట్టిలోనే వారి సౌందర్య రహస్యం దాగుంది. అక్కడ ప్రత్యేకంగా లభించే ఈ మట్టి క్యాల్షియం, మెగ్నీషియం కార్బోనేట్స్‌.. వంటి ఎన్నో ఖనిజాల మిళితం. అవి చర్మ గ్రంథుల్లోని మురికిని లోలోపలి నుంచి శుభ్రం చేయడంతో పాటు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. ఈ మట్టికి కొన్ని సేజ్‌ మొక్క ఆకుల్ని కలిపి మిశ్రమంలా తయారుచేసుకుని ముఖానికి అప్లై చేసి ఓ 15-20 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్‌ మాస్క్‌ వయసు పైబడుతున్న కొద్దీ వచ్చే ముడతలను తగ్గిస్తుంది. చర్మంలో తేమను నిలిపి ఉంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మొక్కలతో కురులకు పోషణ!

అందమైన పొడవాటి కురులు తమ సొంతం కావాలనేది ప్రతి ఒక్క అమ్మాయి కల. కానీ రోజురోజుకీ పెరుగుతోన్న కాలుష్యం, దుమ్ము-ధూళి.. ఆ కలను కలగానే మిగిలిపోయేలా చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు తమ జుట్టును కాపాడుకోవడానికి పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో పాటించే ఏ సౌందర్య పద్ధతైనా తాత్కాలికంగా ఉపశమనం కలిగించేదే కానీ శాశ్వత పరిష్కారం చూపేవి చాలా తక్కువే అని చెప్పుకోవాలి. అందుకే హంగరీ మగువలు తమ కురుల పోషణ కోసం పాటిస్తున్న ఈ చిట్కాను ఓసారి పాటించి చూడండి. అందుకోసం వారు అక్కడ ఎక్కువగా పెరిగే హార్స్‌ర్యాడిష్‌ అనే మొక్క వేర్లను ఉపయోగిస్తున్నారు. వాటి వేర్లను మెత్తగా రుబ్బి దాన్ని మాడుకు పట్టించి ఓ 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ మొక్కలోని గ్లూకోసినోలేట్స్‌ అనే సల్ఫర్‌ సమ్మేళనాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అలాగే ఆవనూనెను తరచూ కుదుళ్లు, జుట్టుకు పట్టించడం ద్వారా కూడా జుట్టు పెరుగుతుందని అనుభపూర్వకంగా చెబుతున్నారీ భామలు. పరిమళ భరితంగా ఉండే ధవనం మొక్క నుండి సేకరించిన నూనెలో చుండ్రును నివారించే గుణాలుంటాయి. అలాగే ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయంటున్నారీ హంగరీ ఏంజెల్స్‌.

చూశారుగా..! సింపుల్‌ అండ్‌ స్వీట్‌ బ్యూటీ చిట్కాలతోనే హంగరీ భామలు ఎంత అందంగా మెరిసిపోతున్నారో! ఇలా వారు పాటించే సౌందర్య చిట్కాల్లో చాలా వరకు మన వంటింట్లో లభించే పదార్థాలే ఉన్నాయి. కాబట్టి మనమూ ఈ ముద్దుగుమ్మల సౌందర్య రహస్యాల్ని పాటిస్తూ నఖశిఖపర్యంతం అందంగా, యవ్వనంగా మెరిసిపోవచ్చు.. ఏమంటారు?


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని