ఒడిశా అమ్మాయి... హైదరాబాద్‌ ఫుడ్‌ వ్లాగర్‌!

ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చిందామె. మామూలుగానే ఫుడీ. ఆ రుచులను తను ఆస్వాదించడమేనా... అందరికీ పరిచయం చేద్దామనుకుంది. ఏడేళ్లలో హైదరాబాద్‌ టాప్‌ ఫుడ్‌వ్లాగర్లలో ఒకరిగా మారడమే కాదు, అవార్డులనూ అందుకుంది కిరణ్‌ సాహూ!

Updated : 10 Jul 2024 13:22 IST

ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చిందామె. మామూలుగానే ఫుడీ. ఆ రుచులను తను ఆస్వాదించడమేనా... అందరికీ పరిచయం చేద్దామనుకుంది. ఏడేళ్లలో హైదరాబాద్‌ టాప్‌ ఫుడ్‌వ్లాగర్లలో ఒకరిగా మారడమే కాదు, అవార్డులనూ అందుకుంది కిరణ్‌ సాహూ!

ఏదైనా కొత్త వంటకం రుచి చూస్తే... దాని గురించి నలుగురితో పంచుకునే వరకూ నిద్రపోదు కిరణ్‌. అమ్మ ఏది వండినా ముందు రుచి చూపేదీ ఈమెకే. చిన్నవయసు నుంచే ‘బాగుంది, బాలేదు’ అని చెప్పి ఊరుకునేది కాదు. దానిలో ఏం తగ్గింది, రుచిని పెంచడానికి ఇంకా ఏం చేయాలో కూడా చెప్పేసేదట మరి. వంటలపై అంత ఆసక్తి. అయితే అప్పటివరకూ భిన్న రుచుల్ని ఆస్వాదించడం వరకే! ఉద్యోగంలో చేరాకే ఫుడ్‌వ్లాగింగ్‌పై ఆసక్తి కలిగింది. ఈమెది ఒడిశా. ఎంబీఏ పూర్తిచేశాక ఐటీ ప్రొఫెషనల్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం సంపాదించింది. కొత్త ప్రాంతం... కొత్త సంస్కృతి... అంతకుమించి కొత్త రుచులు... ఇవన్నీ ఆమెను ఆకట్టుకున్నాయి. వీటన్నింటినీ అందరికీ పరిచయం చేయాలనుకుంది. చిన్నచిన్న వీడియోలను తీసి, ‘సలామ్‌ నమస్తే హైదరాబాద్‌’ పేరుతో యూట్యూబ్‌లో, ‘ఫుడ్‌ హుడ్‌’ పేరుతో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసేది. కొత్త వంటకాలు, తక్కువ ఖర్చుకే విందు, ఏ వంటకం ఎక్కడ ఫేమస్‌... వంటి వివరాలందిస్తూ త్వరగానే అభిమానులను ఆకట్టుకుంది. ‘సౌత్‌ ఇండియా ఐకాన్‌’, ఆర్‌టీఐబీఏ సహా పలు అవార్డులు అందుకుంది. ఇన్‌స్టాలో అఫీషియల్‌ హోదాని దక్కించుకోవడమే కాదు, హైదరాబాద్‌ టాప్‌ 10 ఫుడ్‌ వ్లాగర్లలో ఒకరిగానూ నిలిచింది.

‘ఫుడ్‌వ్లాగర్‌ అనగానే చాలామంది రోజుకో కొత్త ప్రదేశం తిరగొచ్చు, కొత్త వంటలు ప్రయత్నిస్తూ హాయిగా సంపాదించుకోవచ్చు అనుకుంటారు. కానీ... ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి మరీ సమాచారం ఇవ్వాలి. రోజూ ఇలా బయట తింటే ఆరోగ్యం పాడవుతుంది. పైగా ఉద్యోగం చేస్తూ దీన్నో వ్యాపకంగా చేస్తున్నా. రెండూ సమన్వయం చేయడం కష్టమే కానీ... ఇష్టమైన పని కదా... రిస్క్‌ చేసినా పర్లేదు అనిపిస్తుంది. పైగా కొత్త విషయాలను నలుగురికీ తెలియజేయడం, వారి నుంచి ప్రశంసలు వస్తోంటే అదో సంతృప్తి’ అంటోంది కిరణ్‌. రుచి గురించి చెప్పడమే కాదు, ఆ వంటకాల పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకుంటుంది. హిందీ, ఇంగ్లిష్‌లతోపాటు నేర్చుకుని మరీ తెలుగులోనూ రివ్యూలిస్తోంది. కాబట్టే, తెలుగువారికీ త్వరగా దగ్గరైందీమె. అన్నట్టూ... వ్లాగింగ్‌లో సేవనూ జోడిస్తోంది. రివ్యూ కోసం చాలారకాల ఆహారాలను తెప్పిస్తుంది కదా... ఎంగిలి కాకుండా జాగ్రత్తలు తీసుకొని మిగిలినదాన్ని పేదలకు పంచుతుంది. మరోవైపు ‘బ్లూ బటర్‌ఫ్లై’ అనే సంస్థను స్థాపించి, ఆసక్తి ఉన్నవారికి వ్లాగింగ్‌లో శిక్షణనిస్తోంది. 17 సంస్థలకు వ్లాగర్లను అందిస్తోంది. ఆసక్తి, కష్టపడే మనస్తత్వం ఉంటే ప్రాంతం, భాష ఎప్పుడూ అడ్డు కాదంటోన్న కిరణ్‌... యువతకు ఆదర్శమే కదూ!

సంకబుడ్డి అనూష, ఈటీవీ

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్