అతనితో రెండో పెళ్లి.. అమ్మ వద్దంటోంది..!
హాయ్ మేడం. నాకు చిన్న వయసులోనే పెళ్లైంది. మాది మేనరికం. అయితే కొంత కాలం తర్వాత అతనికున్న అలవాట్లు, డబ్బు పిచ్చి వల్ల విడాకులు తీసుకున్నాను. ఇది జరిగి ఆరేళ్లవుతోంది. ఈ మధ్యలో నేను ఉద్యోగం....
హాయ్ మేడం. నాకు చిన్న వయసులోనే పెళ్లైంది. మాది మేనరికం. అయితే కొంత కాలం తర్వాత అతనికున్న అలవాట్లు, డబ్బు పిచ్చి వల్ల విడాకులు తీసుకున్నాను. ఇది జరిగి ఆరేళ్లవుతోంది. ఈ మధ్యలో నేను ఉద్యోగం మారాను. దానిలో నా మ్యారిటల్ స్టేటస్‌ను సింగిల్ అని పెట్టాను. రెండు సంవత్సరాల తర్వాత నా సహోద్యోగి నా వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చారు. తను వేరే మతానికి చెందిన వారు. తనంటే నాకు కూడా ఇష్టమే.. అందుకే నా గతం గురించి అతనికి చెప్పాను. ఇదే విషయాన్ని నా తల్లిదండ్రులతో పంచుకుంటే మొదట్లో ఒప్పుకోలేదు.. కానీ తర్వాత నా ఒత్తిడితో ఒప్పుకున్నారు. వాళ్ల ఇంట్లో వాళ్ల నాన్నగారు ఒప్పుకున్నారు.. కానీ వాళ్లమ్మ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇతను పెద్ద కొడుకని, వాళ్ల పరువు పోతుందని అన్నారు. అయితే తను మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేసైనా ఇంట్లో ఒప్పిద్దాం అంటున్నాడు. కానీ, మా అమ్మ మాత్రం ‘తనకు ఇది మొదటి పెళ్లి.. నువ్వు వాళ్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడం మంచిది కాదు.. నువ్వు తన లైఫ్ నుంచి తప్పుకో’ అంటోంది. తను మాత్రం నేను ఒప్పిస్తాను.. వెయిట్ చేయమని అంటున్నాడు. ఒక పక్క తనంటే ఇష్టం.. మరో పక్క నా వల్ల వాళ్ల ఇంట్లో గొడవలు ఎందుకని అనిపిస్తోంది. ఏం చేయాలి? - ఓ సోదరి
జ. మీరు ఇప్పటికే జీవితంలో ఒకసారి దెబ్బతిన్నారని తెలుస్తోంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ముందూ వెనకా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. మీ గతం.. మీరు చేసుకోవాలనుకుంటున్న వ్యక్తికి, అతని తల్లిదండ్రులకు తెలుసు. అయితే అతను వారి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి కొంత సమయం కావాలంటున్నాడని చెబుతున్నారు. మీ అమ్మగారు ఈ పెళ్లి వల్ల జరిగే నష్టాల గురించి ఆలోచిస్తున్నారు. కానీ, తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టాలుంటాయని అర్థం చేసుకోండి.
ఒకసారి జీవితంలో బాగా తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నా.. కొన్ని కొన్ని విషయాలను మీరు ముందే తెలుసుకోలేకపోయారు. అలాంటప్పుడు బయటి వ్యక్తి గురించి కొన్ని భయాలు ఉండడం సహజమే కదా.. మతాల అంతరాలు, కుటుంబాల్లో అవగాహనా లోపం వల్ల మీ ఇద్దరి మధ్య పొరపొచ్ఛాలు దొర్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ సమానంగా ఉంటుంది. అలాగే మీ అమ్మగారికి, మీ కుటుంబ సభ్యులకు, వాళ్ల కుటుంబ సభ్యులకు మధ్య ఒక అవగాహన వచ్చేలా మీరిద్దరూ చొరవ తీసుకునే ప్రయత్నం చేయండి. అలా చేయడం వల్ల వాళ్ల మధ్య ఏమైనా అపోహలు ఉంటే వాటిని తొలగించుకునే అవకాశం ఉంటుంది. ఇలా అన్ని విధాలుగా ఆలోచించి, దీర్ఘకాలిక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.