డెలివరీ తర్వాత జుట్టు బాగా రాలుతోంది.. ఏం చేయాలి?

హాయ్‌ మేడమ్.. నాకు ఆరు నెలల పాప ఉంది. డెలివరీ తర్వాత ఇప్పటి వరకు నా చర్మ, జుట్టు సంరక్షణ గురించి నేను అస్సలు పట్టించుకోలేదు. అయితే గత నెల నుంచి నా జుట్టు బాగా రాలుతోంది. నా ముఖం కూడా నిర్జీవంగా మారిపోయింది. పెదవుల చివర నల్లగా.....

Updated : 21 Oct 2022 21:20 IST

హాయ్‌ మేడమ్.. నాకు ఆరు నెలల పాప ఉంది. డెలివరీ తర్వాత ఇప్పటి వరకు నా చర్మ, జుట్టు సంరక్షణ గురించి నేను అస్సలు పట్టించుకోలేదు. అయితే గత నెల నుంచి నా జుట్టు బాగా రాలుతోంది. నా ముఖం కూడా నిర్జీవంగా మారిపోయింది. పెదవుల చివర నల్లగా మారింది. ఈ సౌందర్య సమస్యలన్నింటికీ చక్కటి పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి

జుట్టు సంరక్షణ కోసం:

గుడ్డు - ఒకటి

పెరుగు - ఒక కప్పు

నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు

కొబ్బరినూనె - 4 టేబుల్‌ స్పూన్లు

ఈ నాలుగింటినీ ఒక బాటిల్‌లో వేసి షేక్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ‘ప్రొటీన్‌ మాస్క్’ అంటారు. దీన్ని మొదట జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఆపై మిగిలిన మిశ్రమాన్ని జుట్టంతా అప్లై చేసుకోవచ్చు. ఇలా ప్యాక్‌ వేసుకున్న తర్వాత జుట్టుని ముడి వేసుకుంటే మిశ్రమం కిందికి జారిపోకుండా ఉంటుంది. కనీసం 30 నిమిషాల పాటు మాస్క్‌ను అలాగే ఉంచుకోవాలి. ఆపై మొదట సాధారణ నీటితో శుభ్రం చేసుకొని.. ఆ తర్వాత షాంపూతో తల రుద్దుకోవాలి. ఈ విధంగా కనీసం వారానికి మూడుసార్లు చేస్తే రెండు, మూడు నెలల్లో చక్కటి ఫలితం కనిపిస్తుంది. దీనితో పాటు ఐరన్‌ ఎక్కువగా ఉండే తోటకూర, బీట్‌రూట్‌, క్యారట్‌, బెల్లం.. వంటివన్నీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మరింత మెరుగైన ఫలితం పొందచ్చు.

ఈ ప్యాక్‌లో నిమ్మరసం కూడా ఉపయోగిస్తున్నాం కాబట్టి గుడ్డు వల్ల వాసన వస్తుందనే అనుమానం అక్కర్లేదు. అదేవిధంగా- నిమ్మరసం నేరుగా కాకుండా మిశ్రమంలో భాగంగా అప్లై చేస్తున్నాం కాబట్టి జుట్టు తెల్లబడుతుందనే భయం కూడా అవసరం లేదు.

మోము సౌందర్యం కోసం...

ఓట్స్‌ పౌడర్‌ - ఒక టేబుల్‌ స్పూన్

బార్లీ పౌడర్‌ - ఒక టేబుల్‌ స్పూన్

కాచి చల్లార్చిన పాలు - నాలుగు టేబుల్‌ స్పూన్లు

మొదట ఈ మూడింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని మెడపై కూడా అప్లై చేయచ్చు. ప్యాక్‌ పెట్టుకున్న తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు నుంచి మూడుసార్లు చేయాలి. అలాగే దీనితో పాటు రోజుకు 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి.

అందమైన అధరాలు ఇలా!

మొదట నాలుగు గులాబీ రేకల్ని తీసుకొని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత దానికి అంతే మొత్తంలో కాచి చల్లార్చిన పాలను జత చేయండి. ఈ మిశ్రమాన్ని పెదవులపై ఎక్కడ నల్లగా ఉందో అక్కడ రాయాలి. అలా 20 నిమిషాల పాటు ఉంచుకొని ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 5 సార్లు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్