Published : 20/01/2023 15:36 IST

పబ్‌కు రానని చెప్పలేకపోతున్నా..!

(Representational Image)

నేను ఉన్నత చదువుల కోసం సిటీకి వచ్చాను. ఇక్కడి విద్యార్థులతో స్నేహం పెరిగింది. దాంతో వారు ఒకసారి పబ్‌కు రమ్మని ఆహ్వానించడంతో అక్కడికి వెళ్లా. ఆ తర్వాత నుంచి తరచూ పబ్‌కు వెళుతున్నాం. అయితే పబ్‌కు వెళ్లినప్పుడు అమ్మానాన్నలు గుర్తొస్తే చాలా గిల్టీగా అనిపిస్తోంది. ఇప్పుడు మా స్నేహితులతో పబ్‌కు రానని చెప్పలేకపోతున్నాను. అలా చెబితే ఏమనుకుంటారోనని భయంగా ఉంది. నన్ను చులకనగా చూస్తారని ఆందోళనగా ఉంది. ఈ గందరగోళం వల్ల చదువుపైనా దృష్టి పెట్టలేకపోతున్నా. చాలా కంగారు, దిగాలుగా అనిపిస్తోంది. కానీ ఎంత ప్రయత్నించినా వారికి ‘నో’ చెప్పలేకపోతున్నా. నాలోని ఈ భయం పోయేదెలా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారని అర్థమవుతోంది. అయితే మీరు చేసే పని మీ తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పగలుగుతారో, లేదో అనే దాన్ని బట్టే.. మీరు చేసే పని సరైందో, లేదో మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ దిశగా ఓసారి ఆలోచించుకోండి.

పైచదువుల కోసం సిటీకి వచ్చానని అంటున్నారు. ఇలాంటప్పుడు మీ ధ్యాసంతా మీ లక్ష్యంపై ఉండాలి. మీ స్నేహితులు పబ్‌కు వెళ్తున్నారంటే వారి కుటుంబ నేపథ్యం భిన్నంగా ఉండచ్చు. కాబట్టి, మీ దృష్టిని చదువుపై కేంద్రీకరించడానికి ప్రయత్నించండి. మీ స్నేహితులతో ‘నేను చదువుకోవడానికి ఇక్కడికి వచ్చాను. మా తల్లిదండ్రులకు ఇది నచ్చదు. కావాలంటే మీరు వెళ్లండి’ అని సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించండి. అలా మూడు, నాలుగు సార్లు చెబితే.. తర్వాత వారు మిమ్మల్ని బలవంత పెట్టే అవకాశం ఉండదు. వాళ్లతో స్నేహంగా ఉంటూనే మీకంటూ కొన్ని పరిధులు పెట్టుకోండి. అలాగే ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటూ మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని