‘మా ఆయన ఎప్పుడు బయటకు వెళ్తాడా..’ అని చూస్తుంటా!

నా భర్త ఓ మార్కెటింగ్‌ సంస్థలో పని చేస్తుంటాడు. పనిలో భాగంగా ఎప్పుడూ ఏదో ఒక ప్రాంతానికి వెళుతుంటాడు. దానివల్ల మొదట్లో చాలా బోర్ కొట్టేది. ఒంటరితనంతో కొన్ని సందర్భాల్లో చిరాకు వచ్చేది.

Published : 01 Sep 2023 12:12 IST

(Representational Image)

నా భర్త ఓ మార్కెటింగ్‌ సంస్థలో పని చేస్తుంటాడు. పనిలో భాగంగా ఎప్పుడూ ఏదో ఒక ప్రాంతానికి వెళుతుంటాడు. దానివల్ల మొదట్లో చాలా బోర్ కొట్టేది. ఒంటరితనంతో కొన్ని సందర్భాల్లో చిరాకు వచ్చేది. అయితే ఇద్దరం పని చేస్తేనే కుటుంబం గడుస్తుంది.. కాబట్టి, నేను కూడా ఏమీ అనలేకపోయేదాన్ని. కొద్ది రోజుల తర్వాత నాకు లభించిన ఖాళీ సమయంలో సహోద్యోగులు/స్నేహితులతో గడపడం మొదలుపెట్టా. ఈ క్రమంలో ఇప్పుడు నా భర్త కంటే ఎక్కువ సమయం వారితోనే గడపాలనిపిస్తోంది. ప్రస్తుతం నా పరిస్థితి ఎలా మారిందంటే ‘మా ఆయన ఎప్పుడు బయటకు వెళ్తాడా?’ అని ఎదురుచూస్తుంటా!  దీనివల్ల మా దాంపత్య బంధం దెబ్బతింటుందా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ భర్త పని మీద ఎక్కువగా బయటకు వెళ్లడంతో ఇంట్లో మీకు ఖాళీ సమయం ఎక్కువగా లభించింది. ఒంటరితనం నుంచి బయటపడడానికి సహోద్యోగులు/స్నేహితులతో గడపడం మొదలుపెట్టారు. ఇప్పుడు అది కాస్తా వ్యసనంగా మారిపోయింది. దాంతో మీ దాంపత్య బంధంలో సమస్యలు వస్తాయేమోనని భయపడుతున్నారు. వ్యక్తిగతంగా మీకంటూ కొంత సమయం కేటాయించుకోవడం.. ఈ క్రమంలో సహోద్యోగులు/స్నేహితులతో కొద్దిసేపు సరదాగా గడపడం వల్ల ఎలాంటి నష్టం లేదు. అయితే అదే సమయంలో జీవిత భాగస్వామితోనూ సమయం గడపాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే దాంపత్య బంధం బలపడుతుంది. కానీ, మీ విషయంలో ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి, దాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇందుకోసం మొదటగా మీ స్నేహితులతో గడిపే సమయాన్ని తగ్గించుకోండి. దానికి బదులుగా అదే సమయాన్ని మీ అభిరుచులు/మక్కువలపై వెచ్చించండి. ఇది మీలో కొత్తదనం నింపడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

మీ భర్త ఎక్కువ సమయం బయటే ఉంటాడని చెబుతున్నారు. అయితే లభించిన కొద్ది సమయాన్ని ఇద్దరూ కలిసి సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇందుకోసం ఆ సమయంలో ఇంటి పని ఎక్కువ లేకుండా చూసుకోవడం లేదా ఇద్దరూ కలిసి పనులు పంచుకునేలా ప్రణాళికలు వేసుకోండి. దానివల్ల ఇద్దరూ కలిసి గడిపే సమయం పెరుగుతుంది. అలాగే ఇద్దరికీ కలిసి వచ్చేలా మధ్య మధ్యలో సెలవులు తీసుకోండి. ఈ సమయంలో నచ్చిన ప్రదేశాలకు వెళ్లండి. ఫలితంగా ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఏ ఇద్దరి మధ్య బంధమూ 100 శాతం పరిపూర్ణంగా ఉండదు. ఈ క్రమంలో- ఇద్దరూ కలిసి ఉన్నప్పుడైనా మీ భర్తతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడిపేలా ప్లాన్ చేసుకోండి. అందుకనుగుణంగా మీ జీవనశైలిలో కూడా అవసరమైన మార్పులు చేసుకోండి. అప్పుడు మీ దాంపత్య బంధంలో ఎలాంటి సమస్యలు రావు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని