వీలైతే నన్ను మన్నించు రాజు!

‘పెళ్లికి ముందు మరో వ్యక్తిని ఇష్టపడడం తప్పే అయితే... వందలో ఎనభై మంది తప్పు చేసినట్లే’... ఇది త్రివిక్రమ్‌ సినిమాలో ఓ డైలాగ్‌. నిజమే జీవితంలో ఏదో ఒక సమయంలో ఒక వ్యక్తిని ఇష్టపడడం సర్వసాధారణమైన విషయం. నేనూ అలాగే ఓ వ్యక్తిని ఇష్టపడ్డాను. కానీ ఆ ఇష్టాన్ని వివాహం వరకు తీసుకెళ్లలేక పోయాను. ప్రస్తుతం నేను నా భర్తతో సంతోషంగానే ఉంటున్నాను, ఒక్క నువ్వు గుర్తొచ్చిన్నప్పుడు తప్ప.. రాజు!’ అని చెబుతోంది ఓ అమ్మాయి. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆమె కథేంటో తన మాటల్లోనే...

Updated : 02 Jul 2021 19:12 IST

‘పెళ్లికి ముందు మరో వ్యక్తిని ఇష్టపడడం తప్పే అయితే... వందలో ఎనభై మంది తప్పు చేసినట్లే’... ఇది త్రివిక్రమ్‌ సినిమాలో ఓ డైలాగ్‌. నిజమే జీవితంలో ఏదో ఒక సమయంలో ఒక వ్యక్తిని ఇష్టపడడం సర్వసాధారణమైన విషయం. ‘నేనూ అలాగే ఓ వ్యక్తిని ఇష్టపడ్డాను. కానీ ఆ ఇష్టాన్ని వివాహం వరకు తీసుకెళ్లలేక పోయాను. ప్రస్తుతం నేను నా భర్తతో సంతోషంగానే ఉంటున్నాను, ఒక్క నువ్వు గుర్తొచ్చినప్పుడు తప్ప.. రాజు!’ అని చెబుతోంది ఓ అమ్మాయి. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆమె కథేంటో తన మాటల్లోనే...

నా పేరు వర్షిణి... మాది గుంటూరు. నాకు ఒక చెల్లి ఉంది. మాకు పెద్దగా ఆస్తి పాస్తులు లేకపోయినా మా నాన్న మమ్మల్ని ఎలాంటి లోటు లేకుండా పెంచాడు. ఇంట్లో ఇద్దరం ఆడ పిల్లలమే.. అయినప్పటికీ మాకు ఏది కావాలని అడిగినా లేదనకుండా తీసుకొచ్చేవాడు. నేను టెన్త్‌ పూర్తి చేసే వరకూ గుంటూరుకు దగ్గర్లోని ఓ గ్రామంలో ఉండేవాళ్లం. అనంతరం పై చదువులకోసం రోజూ బస్సులో వెళ్లి రావడం ఇబ్బంది అవుతుందని నాన్న మా ఫ్యామిలీని గుంటూరుకు షిఫ్ట్‌ చేశాడు. అమ్మ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకునేది. నా కూతుళ్లను ఎవరూ తక్కువగా చూడొద్దని ఎప్పటికప్పుడు కొత్త బట్టలు కొనిచ్చేది. గుంటూరులోనే నా ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. నిజానికి నాకు బీటెక్‌ చేయాలని ఉన్నా... ఇంట్లో ఆర్థిక పరిస్థితి నా ఆశలకు కళ్లెం వేసింది. ఇక డిగ్రీ పూర్తయిన తర్వాత బెంగళూరు వెళ్లి ఏదైనా కంప్యూటర్‌ కోర్సు నేర్చుకొని సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ కొట్టాలనేది నా కల. కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితే అంతంతమాత్రం మా ఇద్దరిని చదివిపించడంతోనే సరిపోతుంది. ఇక బెంగళూరు ఏం వెళ్తాంలే అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. కానీ నా ఆసక్తి తెలిసిన అమ్మ ఎలాగైనా నువ్వు బెంగళూరు వెళ్లాలి. అమ్మాయిలు తమ కాళ్లపై తాము నిలబడితేనే ఈ సమాజంలో విలువ ఉంటుందని చెప్పి కోచింగ్‌ పంపడానికి నన్ను సిద్ధం చేసింది.

ఇక ఎలాగోలా బెంగళూరు చేరుకున్నాను. నాన్న కష్టపడి నా హాస్టల్‌, కోచింగ్‌కు ఫీజును సమకూర్చాడు. అక్కడే ఓ ఉమెన్స్‌ హాస్టల్‌లో చేరి కోచింగ్‌లో జాయిన్‌ అయ్యాను. అప్పుడే నా జీవితంలోకి అనుకోని అతిథిలా వచ్చాడు రాజు. తనది చిత్తూరు. మేమిద్దరం ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్‌ అయ్యాం. బెంగళూరులాంటి నగరంలో తెలుగు మాట్లాడే మరో వ్యక్తి ఉన్నాడంటేనే సహజంగా మాటలు కలిపేస్తాం. అలా రాజుతో నాకు మాటలు కలిశాయి. కానీ ఆ మాటలు నా జీవితాన్ని మార్చేస్తాయని అప్పుడు అనుకోలేదు. బెంగళూరు వెళ్లే ముందు నాన్న... ‘నువ్వు కచ్చితంగా ఉద్యోగం చేయాలని నిన్ను అక్కడికి పంపడం లేదు, నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి పంపిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో నా తల దించుకునే పరిస్థితి మాత్రం తీసుకురాకు’ అని చెప్పి పంపించాడు. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది నాన్నా? అని నేనే ఎదురు ప్రశ్నించాను. ఇక ప్రతి రోజూ హాస్టల్‌, ఇన్‌స్టిట్యూట్‌తో రోజులు బిజీగా గడిచిపోతున్నాయి. రాజుతో సాన్నిహిత్యం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఏ చిన్న అవసరం వచ్చినా రాజునే పిలవడం ప్రారంభించాను. ఇద్దరం కలిసి షాపింగ్‌, సినిమాలకు వెళ్లడం సాధారణమైపోయింది. అతని మాటతీరు, నడవడిక నచ్చిన నేను నాకు తెలియకుండానే అతనితో ప్రేమలో పడిపోయాను. అది ప్రేమ అని తెలిసే లోపే రాజు లేకపోతే నేను లేనేమో అన్నంతలా మా బంధం బలపడిపోయింది. ఒక్క రోజు కూడా విడిచి ఉండలేని పరిస్థితి. ఒకసారి ఇంట్లో ఏదో పని ఉందని మూడు రోజుల పాటు రాజు చిత్తూరు వెళ్లాడు. అతను లేని ఆ మూడు రోజులు నాకు మూడు యుగాలుగా గడిచాయి. ఎప్పుడెప్పుడు రాజు వస్తాడా అని వేయి కళ్లతో ఎదురు చూసేదాన్ని. అలా రోజులు ఎంతో సంతోషంగా గడిచిపోతున్నాయి.

మా ఇద్దరికీ బెంగళూరులోనే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మధ్యలో చాలా సార్లు గుంటూరు వెళ్లొచ్చినా రాజు విషయం నాన్నకు చెప్పలేకపోయాను. కారణం... నాన్నకు ఈ ప్రేమ వ్యవహారాలంటే అస్సలు నచ్చవు. ‘ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. ఒప్పుకోకపోవడానికి ఏం కారణముంటుంది? నువ్వు ధైర్యంగా మీ నాన్నకు చెప్పు’ అని రాజు అన్నాడు. తీరా ఒకసారి సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు.. ‘నాన్న నాకు బెంగళూరులో రాజు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్‌ తీసుకున్నాం, మేమిద్దరం ఇప్పుడు ఒకే ఆఫీసులో పని చేస్తున్నాం. నాకు జీవితాంతం రాజుతోనే ఉండాలని ఉంది. రాజును పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పాను.

నేను చెప్పేది మొత్తం విన్న తర్వాత నాన్న ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. జీవితంలో నాన్నను ఎప్పుడూ అంత కోపంతో చూడలేదు. అంతెందుకు ఎప్పుడూ ఒక చిన్న మాట కూడా అనని నాన్న ఆ రోజు నాపై చేయి చేసుకున్నాడు. ఇలా నాన్న మా ప్రేమను వ్యతిరేకించడానికి ఇద్దరి కులాలు వేరు కావడం కూడా ఓ కారణమే! ‘నమ్మకంతో అంత దూరం పంపిస్తే ఇలా చేస్తావా? ఇకపై ఉద్యోగం లేదు ఏం లేదు ఇంట్లో ఉండు’ అని నన్ను బెంగళూరు వెళ్లకుండా ఆపేశారు. ఈ విషయాన్ని ఎలాగోలా రాజుకు చెప్పేశాను. ఎలాగైనా నన్ను తీసుకెళ్లిపో అని చెప్పాను. వారం రోజుల తర్వాత రాజు నన్ను తీసుకెళ్లడానికి గుంటూరు వచ్చాడు. అసలు ఆ రోజు ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు కానీ.. రాజుతో వెళ్లిపోవడానికి బ్యాగ్‌ సిద్ధం చేసుకొని రడీగా ఉన్నాను. తీరా రాజు రాగానే రాత్రి 2 గంటల తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయాను. నాన్న, అమ్మ, చెల్లి ఏమవుతారో అని కూడా ఆలోచించలేకపోయాను. ప్రేమ మైకంలో ఉన్న వారికి మరో ఆలోచన రాదు... అని ఇందుకే అంటారేమో!

నేను ఇంట్లో నుంచి వెళ్లిన కొద్ది సేపటికే నాన్న నేను వెళ్లానన్న విషయాన్ని తెలుసుకున్నాడు. వెంటనే పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి మిస్సింగ్‌ కంప్లైంట్‌ ఇచ్చాడు. దాంతో పోలీసులు నా ఫోన్‌ నెంబర్‌ను ట్రాక్‌ చేసి నన్ను, రాజును మధ్యలోనే అడ్డుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ‘నా కూతురును ఎవరో కిడ్నాప్‌ చేశార’ని నాన్న పోలీసులకు తెలిపాడంటా అందుకే మా ఇద్దరిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే మేమిద్దరం మేజర్లం కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని పోలీసు అధికారులకు చెప్పాం. దానికి స్పందించిన ఎస్‌ఐ ‘కాసేపట్లో మీ పేరెంట్స్‌ వస్తున్నారు. వచ్చాక వాళ్లకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు’ అని సమాధానం ఇచ్చాడు. నాన్న స్టేషన్‌కు వస్తున్నాడనడంతో ఒక్కసారిగా నా గుండె కొట్టుకునే వేగం పెరిగిపోయింది. తప్పు చేశానా? అన్న భావన మనసులో మెదులుతున్నా... నచ్చిన వాడిని ప్రేమించడంలో తప్పేముందని మరోవైపు నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఇంతలోనే నాన్న, అమ్మతో కలిసి స్టేషన్‌కు వచ్చారు. వారిద్దరి కళ్లలోనూ నీళ్లు తిరుగుతున్నాయి. ‘చదువుకుంటాను అంటే బెంగళూరు పంపాను చూడు... అదీ నేను చేసిన తప్పు...’ అని నాన్న బాధపడుతున్నాడు. ఇక అమ్మ అయితే ‘మా పరువు ఇప్పుడు నీ చేతిలోనే ఉంది, నువ్వు మేజర్‌వి కాబట్టి నీకు నచ్చినట్లు చేయొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు మాతో ఇంటికి రాకపోతే తిరిగి వెళ్లేది మేం కాదు, మా శవాలే, ఏ రైలు కిందో పడి చనిపోతాం. ఇక మిగిలిన చెల్లి జీవితం నాశనమైపోతుంది. నీ కాళ్లు మొక్కుతానే వాడిని వదిలేసి ఇంటికి వచ్చేయ్‌’... అని ఏడుస్తూ చెబుతుంది. దీనికి తోడు పోలీసులు కూడా ‘ప్రేమ వివాహాలు అంత మంచివి కాదమ్మా.. మీ అమ్మ, నాన్న చెబుతోంది విను. నీ ఇష్టం కోసం ఒక కుటుంబాన్ని నాశనం చేస్తావా?’ అని కౌన్సెలింగ్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. రాజుపై ఎంత ప్రేమ ఉన్నా... అమ్మానాన్న అన్న మాటలు విని వాళ్లతోనే వెళ్లడానికి నిశ్చయించుకున్నాను. ఆ క్షణం రాజు చేయి వదిలి నాన్న చేయి పట్టుకొని బయటకు వచ్చేశా. ఆ రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాం.

ఇక నాకు క్షణం ఒక యుగంలా గడిచింది. ఓవైపు మనసులో ఏదో తప్పు చేశానన్న భావన. మరోవైపు ఉద్యోగం మాన్పించేశారు. ఇక ఇంట్లో అందరి మధ్యే ఉన్నా ఒంటరితనం వేధించేది. అలా చాలా రోజుల పాటు గడిపాను. ఇక నన్ను అలా చూసిన మా పేరెంట్స్‌ నాకు పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. ఒక రోజు పెళ్లి చూపుల కోసమని ఓ అబ్బాయి ఫొటో ఇచ్చారు. ‘మీ కోసం నేను ఎంతో ఇష్టపడ్డ రాజునే వదులుకున్నాను. ఇక ఈ పెళ్లి ఒక లెక్కా’... అన్నట్లు ఫొటో చూడకుండానే ఓకే చేశాను. మూడు నెలల్లో నా పెళ్లి జరిగిపోయింది. నా పెళ్లికి రాజు కూడా వచ్చాడట.. నాకు కనిపించకుండా దూరం నుంచి చూసి వెళ్లిపోయాడని తర్వాత నా స్నేహితులు చెప్పారు.

ప్రస్తుతం నాకు వివాహమై మూడేళ్లు అవుతోంది. మాకు ఇద్దరు పిల్లలు, మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. నా గతాన్ని మొత్తం ఆయనకు వివరించాను. పెద్ద మనసుతో అర్థం చేసుకున్న ఆయన ‘గతాన్ని మరిచిపోయి నాతో కొత్త జీవితాన్ని ప్రారంభించు’ అని చెప్పాడు. ఇప్పుడు మేము ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాం. నేను కూడా పిల్లలు, భర్త ప్రేమతో గతాన్ని మరిచిపోయాను. కానీ అప్పుడప్పుడు రాజు ఎలా ఉన్నాడు? నాలాగే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాడా? అనే సందేహం కలుగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ రాజుతో మాట్లాడాలని అనిపించలేదు. అదేదో తప్పనే భావనతో కాదు... ప్రేమ కోసం ధైర్యం చేయని నేను మరోసారి అతని జీవితంలోకి వెళ్లడం ఇష్టం లేకే అలా చేస్తున్నాను. కానీ రాజు నా కళ్ల ముందుకు వస్తే మాత్రం ఒకే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. ‘ఆ రోజు మా పేరెంట్స్‌ కోసం ఒక్క మాట కూడా నీతో మాట్లాడకుండా వెళ్లిపోయినందుకు వీలైతే నన్ను మన్నించు రాజు’ అని! ప్రేమ దూరమైందని, ఇక జీవితం ముగిసి పోయిందనుకున్న నాకు దేవుడు భర్త రూపంలో మరో కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. మనకు నచ్చిన వారే మన జీవితంలోకి రావాలని లేదు. ఒకవేళ అలా జరగకపోయినా మనం నిరాశ చెందనక్కర్లేదు. ఏదో ఒక సమయంలో మన జీవితం మనకు అనుకూలంగా మారుతుందన్న ఆశతో ఆ క్షణం కోసం ఎదురుచూడాలి.

ఇంతకీ ఇదంతా మీకెందుకు చెబుతున్నానంటే... కొంతమంది మహిళలు ప్రేమించిన సమయంలో ధైర్యం చేయక వేరే వ్యక్తులను వివాహం చేసుకుంటున్నారు. ఇష్టం లేని సంసారం చేయలేనంటూ జీవితాన్ని అర్థాంతరంగా ముగించే వారు లేకపోలేదు. అలా చేయడం వల్ల మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలోకి వచ్చిన వారికి అన్యాయం చేసిన వారవుతారు. కాబట్టి మీ గతాన్ని ఓ మధుర జ్ఞాపకంగా మార్చుకొని, వారి మంచి కోరుకుంటూ, మీరూ ఆనందంగా గడిపేయండి. మీరే సర్వస్వంగా భావించే భాగస్వామికి మీ మనసులో దాగున్న పూర్తి ప్రేమను పంచండి. అప్పుడే గతం పదే పదే మీ మనసును తొలిచివేయకుండా ఆలుమగల అనుబంధం ఎలాంటి అరమరికల్లేకుండా ముందుకు సాగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్