రెండో భార్యగా ఉంటానన్నా.. అతను ఒప్పుకోవడం లేదు..!

నాకు ౩౦ ఏళ్లు.. ఇంకా పెళ్లి చేసుకోలేదు.. నేను ప్రభుత్వ ఉద్యోగినిని. ఈ మధ్య ఆఫీసులో పెళ్లైన వ్యక్తితో పరిచయమైంది. కొద్దిరోజులకే నేను అతన్ని ఇష్టపడ్డాను. ఇప్పుడు అతనితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా...

Updated : 18 May 2023 21:29 IST

(Representational Image)

నాకు ౩౦ ఏళ్లు.. ఇంకా పెళ్లి చేసుకోలేదు.. నేను ప్రభుత్వ ఉద్యోగినిని. ఈ మధ్య ఆఫీసులో పెళ్లైన వ్యక్తితో పరిచయమైంది. కొద్దిరోజులకే నేను అతన్ని ఇష్టపడ్డాను. ఇప్పుడు అతనితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. మొదట్లో అతనే ఎక్కువగా మాట్లాడేవాడు. అప్పటికీ ‘నన్ను పెళ్లి చేసుకో.. మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టను.. నా జీతంతో మీ కుటుంబాన్ని పోషిస్తాను’ అని చెప్పాను. అయినా అతను ఒప్పుకోవడం లేదు. అతను నన్ను చాలా చులకనగా చూస్తున్నాడు. వాస్తవానికి అతను నా కింద పని చేస్తుంటాడు. అతని కంటే నా జీతమే ఎక్కువ. నా జీవితంలో మొదటిసారి ఇష్టపడ్డది తననే. అతని వల్ల మంచి సంబంధాలు వచ్చినా క్యాన్సిల్‌ చేస్తున్నాను. అతన్ని బతిమాలుతున్నా.. అయినా అతను లెక్కచేయడం లేదు. అతని వల్ల సంతోషంగా ఉండలేకపోతున్నాను. ఇప్పటికీ అతనికి రెండో భార్యగా ఉండడానికి కూడా నేను సిద్ధమే! అతనికి ఆస్తులు కూడా పెద్దగా లేవు. కేవలం అతన్ని ఇష్టపడ్డాను.. అతను కావాలనుకుంటున్నాను. నా సమస్యకు పరిష్కారమేంటి? - ఓ సోదరి

జ. మీరు సుస్థిరమైన ఉద్యోగంలో ఉన్నారు. ఇక ఇప్పుడు మీరు జీవితంలో స్థిరపడే సమయం. అయితే ఇలాంటి సమయంలో మీకొచ్చిన సంబంధాలు మీకు నచ్చకపోవడానికి, ఒక వివాహితుడు నచ్చడానికి కారణమేంటనేది విశ్లేషించుకోండి. ఒకేచోట కలిసి పనిచేస్తున్నందు వల్ల కానీ, ఎక్కువ సాన్నిహిత్యం వల్ల కానీ, అతను చురుగ్గా.. చొరవగా మీతో మాట్లాడుతున్నందుకు గానీ మీకు అతని పట్ల ఏర్పడినటువంటి సదభిప్రాయాన్ని మీరు ప్రేమగా నిర్వచించుకుంటున్నారేమో ఆలోచించండి. అతను అందరితో మాట్లాడినట్లే మీతోనూ మాట్లాడుతున్నాడేమో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

జీవితంలో ఒక అనుబంధం ఏర్పడాలంటే అది పరస్పరం ఉండాలి. అతనికి వివాహమైనా మీకోసం తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడట్లేదన్న విషయం స్పష్టమవుతోంది. అలాంటప్పుడు అతనిపై మీరు ఒత్తిడి తెచ్చి అతనితో జీవితం పంచుకోవాలనుకోవడం ఎంతవరకు సహేతుకమో ఆలోచించండి. అతను తన కుటుంబంతోనే సంతోషంగా ఉన్నాడనుకున్నప్పుడు మీరు మీ స్వాభిమానాన్ని పక్కన పెట్టి.. మీరు రెండో భార్యగా ఉండడానికి, మీ జీతంతో తన కుటుంబాన్ని నడపడానికైనా సిద్ధమే అంటూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. తద్వారా అతని దృష్టిలో మరింత పలుచనయ్యారనేది వాస్తవం.

కాబట్టి ఈ ఆలోచనల్లో నుంచి బయటపడాలంటే మీ మనసుని మీకు ఇష్టమైన వ్యాపకాలపై కేంద్రీకృతం చేయండి. ఈ క్రమంలో మీ వృత్తిప్రవృత్తులకు సంబంధించిన అర్హతల్ని పెంచుకోవడం, ఉద్యోగంలో పదోన్నతి సాధించడానికి కావాల్సిన చదువు లేదా రాతపరీక్షలపై దృష్టి పెట్టడం.. వంటివి చేయాలి. అలాగే అతని నుంచి ప్రయత్నపూర్వకంగా కొంత దూరాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. అతని కుటుంబం మీ వల్ల ఇబ్బంది పడుతుందన్న విషయం అతను అవగాహన చేసుకున్నట్లే.. మీరు కూడా అతని స్థానంలో ఉండి సహేతుకంగా ఆలోచించడానికి ట్రై చేయండి. అలాగే అతనే మీకు లోకం అని కాకుండా మీకంటూ ఒక లోకాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేయండి. ఇద్దరూ ఇష్టపడితేనే ప్రేమ.. కానీ బలవంతంగా తీసుకునేది ప్రేమ కాదన్న విషయం గ్రహించండి.

ప్రస్తుతం అతను మీ బలహీనతగా మారాడు. ఆ బలహీనతను అధిగమించడానికి ఏం చేయాలి? అనే ధోరణిలో ఆలోచించి చూడండి. ఈ క్రమంలో అనేక మార్గాలుంటాయి. మీరు రిలాక్స్‌ అవడం, కొంతకాలం దూరంగా వెళ్లి మనసుని మళ్లించుకునే ప్రయత్నం చేయడం, అలాగే మీ మనసులో అతనికిచ్చిన స్థానాన్ని మీకు నచ్చిన మరే అంశంతోనైనా భర్తీ చేసుకోవడం.. వంటివి చేయండి. అలాగే మీరు చదువుకునే  సమయంలో మీకున్న స్నేహితులు కానీ, పెళ్లి చేసుకున్న వాళ్లు గానీ.. వాళ్లతో మళ్లీ అనుబంధాలు పెంచుకునే ప్రయత్నాలు చేయండి. ఇలా మీ పరిధిని పెంచుకునే కొద్దీ మీ ఆలోచనల్లో చేసుకోగలిగిన మార్పులేంటో మీకే అర్థం అవుతాయి. అలాగే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి, మిమ్మల్ని మీరుగా గౌరవించే వ్యక్తి, మిమ్మల్ని సంపూర్ణంగా స్వీకరించే వ్యక్తి ఈ ప్రయత్నంలో మీకు తారసపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని