అందుకే 89 ఏళ్ల ఈ అవ్వకు.. అంత యూత్ ఫాలోయింగ్!

వయసు పెరుగుతున్న కొద్దీ బాధ్యతల నుంచి విముక్తి పొంది హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు చాలామంది. కానీ కొందరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. వయసును కేవలం సంఖ్యగా భావిస్తూ కొత్త బాధ్యతలందుకోవడానికి సిద్ధపడతారు.

Published : 01 Sep 2023 12:12 IST

(Photo: Twitter)

వయసు పెరుగుతున్న కొద్దీ బాధ్యతల నుంచి విముక్తి పొంది హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు చాలామంది. కానీ కొందరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. వయసును కేవలం సంఖ్యగా భావిస్తూ కొత్త బాధ్యతలందుకోవడానికి సిద్ధపడతారు. అలా మూడేళ్ల క్రితం తన గ్రామానికి పంచాయతీ అధ్యక్షురాలిగా మూడోసారి ఎన్నికయ్యారు తమిళనాడుకు చెందిన వీరమ్మల్‌ అమ్మ. ఈ క్రమంలో తన గ్రామాభివృద్ధిలో చురుగ్గా వ్యవహరించడమే కాదు.. ప్రస్తుతం 89 ఏళ్ల వయసులోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎంతోమందిని ఆకట్టుకుంటున్నారామె. తాజాగా ప్రముఖ ఐఏఎస్‌ అధికారిణి సుప్రియా సాహు కూడా ఈ బామ్మ యాక్టివ్‌నెస్‌కి ఫిదా అయిపోయారు. అందుకే ఆమె ఫిట్‌నెస్‌, ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకొని మరీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరలవుతోంది.

వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా సమాజంలో స్ఫూర్తి నింపే కొంతమంది వ్యక్తుల గురించి.. ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో పంచుకోవడం కామనే! అలాంటి స్ఫూర్తిదాయక కథనే తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు తమిళనాడుకు చెందిన ఐఏఎస్‌ అధికారిణి సుప్రియా సాహు. అదే రాష్ట్రంలోని అరిట్టపట్టి గ్రామానికి చెందిన 89 ఏళ్ల వీరమ్మల్‌ అమ్మ గురించి ఈ పోస్ట్‌లో ప్రస్తావించారామె.

అదే ఈ బామ్మ ఆరోగ్య రహస్యం!

వీరమ్మల్‌ గత కొన్నేళ్లుగా ఆ గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. ‘అరిట్టపట్టి పాటి’ పేరుతో సుపరిచితురాలైన ఈ అవ్వ.. గ్రామాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఎలాంటి బాధ్యతనైనా చురుగ్గా నిర్వహిస్తుంటారు. అయితే ఈ యాక్టివ్‌నెస్‌ వెనకున్న రహస్యమేంటో తాజాగా తెలుసుకునే ప్రయత్నం చేశారు సుప్రియ. ఆమెతో దిగిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ఆ అవ్వ ఆరోగ్య రహస్యాల్నీ పంచుకున్నారు.

‘వీరమ్మల్‌ అమ్మ.. అరిట్టపట్టి గ్రామ సర్పంచ్‌గా ఈ 89 ఏళ్ల మహిళను ఇక్కడంతా అరిట్టపట్టి పాటిగా పిలుచుకుంటారు. తమిళనాడులోనే అత్యంత వృద్ధ సర్పంచ్‌గా గుర్తింపు పొందిన ఈ బామ్మ ఎంతోమందికి స్ఫూర్తి. నిరంతరం ఫిట్‌గా, ఉత్సాహంగా ఉండే ఆమె తన చిరునవ్వుతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ఇలాగే నా మనసూ దోచుకున్నారు పాటి. ఈ క్రమంలోనే తన ఫిట్‌నెస్‌, ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఇందుకు సమాధానమిస్తూ.. ఇంటి ఆహారం, మిల్లెట్స్‌ తీసుకోవడంతో పాటు.. రోజంతా పొలం పనులు చేసుకోవడమే తన ఆరోగ్య రహస్యమని చెప్పుకొచ్చారు వీరమ్మల్‌. ఇలాంటి ఆదర్శమూర్తిని కలుసుకోవడం, అరిట్టపట్టి గ్రామాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల గురించి ఆమెతో చర్చించడం ఎంతో గౌరవప్రదం!’ అంటూ పోస్ట్‌ పెట్టారు సుప్రియ. ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో.. చాలామంది స్పందిస్తున్నారు. ‘ఈ బామ్మ జీవనశైలి ఎంతోమందికి ఆదర్శం!’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

యువత మద్దతుతో..!

వీరమ్మల్‌ గత కొన్నేళ్లుగా అరిట్టపట్టి గ్రామానికి సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. అలా 2020లో మూడోసారి ఈ పదవికి ఎన్నికైన ఆమెకు అక్కడి యువత మద్దతు ఎక్కువగా ఉంది. ప్రతిసారీ ఎన్నికల సమయంలో యువత ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడం, ప్రతి పర్యాయం గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంతో విజయవంతమైన నాయకురాలిగా కొనసాగుతున్నారీ పాటి. ఎన్నికల సమయంలో.. ‘అరిట్టపట్టి గ్రామం నాకెంతో ఇచ్చింది.. నేనూ నా వంతుగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకున్నా. సర్పంచ్‌గా నా కోరిక నెరవేర్చుకుంటా. గ్రామంలో తాగునీరు, రోడ్లు, బాత్‌రూమ్‌ సౌకర్యాలు, మురుగు నీటి వ్యవస్థను అభివృద్ధి చేయడం.. వంటి పనులన్నీ చేయిస్తా..’ అంటూ వాగ్దానం చేసిన ఈ బామ్మ.. అనుకున్నట్లుగానే ఒక్కో పనినీ పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇలా ఆమె నాయకత్వంలోనే అరిట్టపట్టి.. మధురైలోనే మొట్టమొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.


పర్యావరణంపై ప్రేమతో..!

సుప్రియా సాహు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌. 1991 బ్యాచ్‌కు చెందిన ఆమె.. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలోని ‘పర్యావరణం, వాతావరణ మార్పులు, అటవీ’ శాఖకు అదనపు చీఫ్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ అంటే ఆమెకు ప్రాణం. 2002లో నీలగిరీస్‌ జిల్లాకు కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ‘బ్లూ మౌంటెయిన్‌’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. తద్వారా జిల్లాలో ప్లాస్టిక్‌ని పూర్తిగా నిషేధించడంలో సక్సెసయ్యారామె. ఇలా ఆమె ప్రయత్నాన్ని అప్పటి ప్లానింగ్‌ కమిషన్‌, యూఎన్‌డీపీ సంస్థలు ఉత్తమ ప్రయత్నంగా గుర్తించాయి. ‘ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ ది మౌంటెయిన్స్‌ 2002’ అనే ప్రచార కార్యక్రమాన్నీ ముందుండి నడిపించారామె. 2003లో సుప్రియ ఆధ్వర్యంలో అదే జిల్లాలో 42,182 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రయత్నం గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకుంది. ఆపై తమిళనాడు రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ మండలికి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఈ మహిళా అధికారిణి.. టీబీ, హెచ్‌ఐవీ పరీక్షల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేశారు. అలాగే బాధితులకు కౌన్సెలింగ్‌-చికిత్స ఇప్పించడం, నివారణ మార్గాలు, ఈ వ్యాధులు తల్లి నుంచి బిడ్డకు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పైనా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు సుప్రియ. ఇలా బాధ్యత గల అధికారిణిగా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూనే.. ప్రజల మన్ననలందుకుంటున్నారీ ఐఏఎస్‌ ఆఫీసర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని