దానమివ్వడానికి నేనేమైనా వస్తువునా.. నాన్నా?!

పెళ్లిలో వధువు తండ్రి వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం మన సంప్రదాయం! అప్పటిదాకా తానే అన్నీ అయి తన కూతురి బాధ్యతలు చూసుకున్న తండ్రి.. ఇప్పుడా బాధ్యతల్ని అల్లుడి చేతిలో పెట్టడమే ఈ తంతు అంతరార్థం. అయితే ఇలా పెళ్లి పేరుతో అమ్మాయిని దానమివ్వడం మధ్యప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ తపస్యా పరిహార్‌కు నచ్చలేదు.

Published : 20 Dec 2021 19:19 IST

(Photo: Instagram)

పెళ్లిలో వధువు తండ్రి వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం మన సంప్రదాయం! అప్పటిదాకా తానే అన్నీ అయి తన కూతురి బాధ్యతలు చూసుకున్న తండ్రి.. ఇప్పుడా బాధ్యతల్ని అల్లుడి చేతిలో పెట్టడమే ఈ తంతు అంతరార్థం. అయితే ఇలా పెళ్లి పేరుతో అమ్మాయిని దానమివ్వడం మధ్యప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ తపస్యా పరిహార్‌కు నచ్చలేదు. ఇదే విషయం నిర్మొహమాటంగా తన తండ్రికి, కాబోయే భర్త కుటుంబానికి చెప్పింది. వాళ్లూ అందుకు ఒప్పుకోవడంతో కన్యాదానం లేకుండానే పీటలెక్కిందీ వధువు. ఇలా ఏళ్లుగా కొనసాగుతోన్న ఈ సంప్రదాయానికి తెరదించి వార్తల్లోకెక్కిందీ కలెక్టరమ్మ.

తపస్యా పరిహార్‌ది మధ్యప్రదేశ్‌లోని జోబా గ్రామం. ఆమె తండ్రి వ్యవసాయం చేస్తుంటారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాక సివిల్స్‌ పరీక్షలు రాసిందామె. 2018లో విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో 23 వ ర్యాంక్‌ సాధించి తన కలల కొలువును కొల్లగొట్టింది. రెండున్నరేళ్ల పాటు ఎలాంటి కోచింగ్‌ లేకుండా స్వయంగా చదువుకొని అత్యుత్తమ ర్యాంక్‌ సాధించినందుకుగాను తపస్య పేరు అప్పట్లో వార్తల్లో మార్మోగిపోయింది.

కన్యాదానం లేకుండానే..!

ఇక ఇటీవలే ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ గౌరవిత్‌ గంగ్వార్‌తో తపస్య వివాహం జరిగింది. అయితే ఆడపిల్లలపై సమాజంలో ఉన్న వివక్ష, అసమానతలు, పెళ్లిలో కన్యాదానం చేయడం.. వంటివన్నీ చిన్నతనం నుంచే నచ్చని ఆమె.. తన వివాహంలో ఈ ఘట్టానికి చోటివ్వకూడదని నిశ్చయించుకుంది. పెళ్లికి ముందు ఇదే విషయాన్ని తన తండ్రితో పంచుకుంటూ.. ‘నువ్వు దానమివ్వడానికి నేను వస్తువును కాదు.. నీ కూతురిని నాన్నా..’ అంది తపస్య. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆమెతో ఏకీభవించారు. అంతేకాదు.. ఆమె నిర్ణయాన్ని కాబోయే భర్త, అత్తింటి వాళ్లూ కాదనలేదు. ఫలితంగా ఆమె ఇష్టప్రకారమే కన్యాదాన తంతు లేకుండానే భర్తతో ఏడడుగులు వేసింది తపస్య. ఇలా భార్యాభర్తలిద్దరూ సమానమే అంటూ కొత్త సంప్రదాయానికి తెర తీసి వార్తల్లోకెక్కిందీ కలెక్టరమ్మ. ‘అయినా పెళ్లి పేరుతో ఆడపిల్లల్ని దానమిచ్చే ఈ సంప్రదాయానికి తాను చిన్నప్పట్నుంచీ వ్యతిరేకినే!’ అంటూ ఓ సందర్భంలో పంచుకుంది తపస్య.

సమానత్వాన్ని చాటడానికే..!

ఇలాంటి పితృస్వామ్య వ్యవస్థకు చరమగీతం పాడుతూ గతంలో మరి కొంతమంది సెలబ్రిటీలు, సామాన్యులు సైతం తమ పెళ్లిలో కన్యాదాన ఘట్టాన్ని బహిష్కరించారు. వారిలో నేచర్‌ బ్యూటీ దియా మీర్జా ఒకరు. మహిళా పురోహితురాల్ని ఎంచుకోవడం దగ్గర్నుంచి కన్యాదానం లేకుండా పెళ్లి పీటలెక్కే దాకా.. ఈ ముద్దుగుమ్మ పెళ్లిలో ప్రతిదీ ప్రత్యేకమే అని చెప్పాలి.

‘మా వివాహం మహిళా పురోహితురాలు షీలా అత్తా చేతుల మీదుగా జరిగింది. ఇక నా పెళ్లిలో కన్యాదానం, అప్పగింతలు (బిదాయి) కూడా లేవు. ఎందుకంటే ఈ సమాజంలో ఆడ, మగ ఇద్దరూ సమానమే! పురుషులతో సమానంగా మహిళలూ తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం. మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి. మహిళా శక్తిని చాటడానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. మరికొందరు ఇదే దారిలో నడుస్తారని ఆశిస్తున్నా..’ అని అప్పట్లో చెప్పుకొచ్చింది దియా.

 

కన్న తండ్రే వ్యతిరేకించాడు!

ఇక మరో వివాహంలో ఓ తండ్రి తన కూతురి వివాహంలో కన్యాదానం చేయడానికి నిరాకరించి వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలో అతడి మనసులోని అంతరార్థాన్ని తెలుసుకొని ఎంతోమంది ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అసలు విషయమేంటంటే.. బెంగాల్‌కు చెందిన ఓ తండ్రి తన కూతురి పెళ్లిని మహిళా పురోహితుల చేతుల మీదుగా జరిపించారు. ఈ క్రమంలో వివాహ వేదికపై కన్యాదానం గురించి ఓ చిన్నపాటి సందేశమిచ్చాడు. ‘నా కూతురిని కన్యాదానం చేయట్లేదు. ఎందుకంటే ఆమె ఆస్తి కాదు నేను వదులుకోవడానికి.. నా ప్రాణం!’ అనేసరికి.. అక్కడున్న వాళ్లే కాదు.. ఈ వార్త నెట్టింట్లో వైరల్‌ కావడంతో నెటిజన్లూ ఒకింత ఎమోషన్‌ అయ్యారు. పితృస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించి కూతురిపై అమితమైన ప్రేమను చాటిన ఈ తండ్రిపై ప్రశంసల వర్షం కురిపించారు.

 

అందుకే దాన్ని ప్రోత్సహించను!

ఇక కోల్‌కతాకు చెందిన మహిళా పురోహితురాలు నందినీ భౌమిక్‌ తాను జరిపించే పెళ్లిళ్లలో కన్యాదానానికి చోటివ్వనంటున్నారు. అలా దానమివ్వడానికి ఆడపిల్లలేమీ వస్తువులు కాదని చెబుతున్నారామె. ‘కన్యాదానంలో భాగంగా తల్లిదండ్రులు తమ కూతురిని వరుడి చేతిలో పెడుతుంటారు. అప్పట్నుంచి ఆమె మంచిచెడ్డలు చూసుకునే వ్యక్తిగా ఆమె బాధ్యతలన్నీ ఆయనకు అప్పగిస్తారు. అయినా ఇలా కన్యను దానం ఇవ్వడానికి ఆడపిల్లలు వస్తువులు కాదు కదా! అందుకే నేను చేసే పెళ్లిళ్లలో కన్యాదానం అనే పద్ధతే ఉండదు..’ అంటారామె.

మరి, కన్యాదానాన్ని బహిష్కరించి ఆడ-మగ సమానమే అని చాటే ఇలాంటి పెళ్లిళ్లపై మీ అభిప్రాయాలేంటి? స్త్రీపురుషుల మధ్య ఉన్న అంతరాలు తొలగాలంటే ఇంకా ఏయే అంశాల్లో/ పద్ధతుల్లో /సంప్రదాయాల్లో మార్పులు రావాలంటారు? మీ అభిప్రాయాలను contactus@vasundhara.net ద్వారా మాతో పంచుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్