పిల్లలు డ్రగ్‌ వాడితే... పట్టేస్తుందీ బ్యాండ్‌!

పక్షం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఛానెళ్ల నోట విన్నా మత్తూ, మాదకద్రవ్యాలనే మాటలే! సినిమావాళ్లతో జరుగుతున్న విచారణ వార్తల నడుమ.. ఇక్కడి బడులూ, కాలేజీల్లోనూ మత్తు ప్రబలుతోందనే నిజం కూడా మనల్ని వణికిస్తోంది.

Updated : 29 Nov 2022 13:20 IST

పక్షం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఛానెళ్ల నోట విన్నా మత్తూ, మాదకద్రవ్యాలనే మాటలే! సినిమావాళ్లతో జరుగుతున్న విచారణ వార్తల నడుమ.. ఇక్కడి బడులూ, కాలేజీల్లోనూ మత్తు ప్రబలుతోందనే నిజం కూడా మనల్ని వణికిస్తోంది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కల్పిస్తోంది. యువతని అందులో నుంచి బయటపడేయడానికే బ్యాండ్‌లాంటి పరికరం కనిపెట్టింది తెలుగమ్మాయి ఆలియా మహ్మద్‌. ఇంటర్‌స్థాయిలోనే ఉన్న ఈ అమ్మాయి దీన్నెలా సాధించింది? రండి చూద్దాం..

ముంజేతి కంకణం అనగానే ఇదేదో మనం మామూలుగా ఉపయోగించే కడియంలాంటిది అనుకోకండి. ఇదో రిస్ట్‌ బ్యాండ్‌లాంటిది. దీనికి అనుసంధానమైన యాప్‌ తల్లిదండ్రుల మొబైల్‌ఫోన్‌లో ఉంటుంది. స్కూలుకో, కాలేజీకో వెళ్లే పిల్లల చేతికి దీన్ని కట్టారనుకుందాం వాళ్ల చుట్టుపక్కల మాదకద్రవ్యాల వాసనొస్తే చాలు.. ఇది అమ్మానాన్నల్ని హెచ్చరించేస్తుంది! వాయువులో మత్తు పదార్థాల అణువులు కలిసిన మరుక్షణమే ఈ బ్యాండ్‌లోని సెన్సార్లు వాటిని పసిగట్టేస్తాయి. విద్యార్థులు వీటిని తీసుకున్నా, తీసుకున్నవారు వీళ్ల దగ్గరకొచ్చినా సరే వారి చెమటలోని తేడాని బట్టి వెంటనే తల్లిదండ్రులకి సంకేతాలనిస్తుందీ పరికరం. మీకో సందేహం రావొచ్చు. ‘ఈ కాలం పిల్లలు మరీ తెలివిమీరిపోయారు కదా.. అమ్మానాన్నలు బడికి పంపగానే ఆ బ్యాండ్‌ తీసేస్తే ఎలా?’ అని. వాళ్లు చేతి నుంచి దాన్ని తీసేసినా కూడా మరుక్షణమే ఆ విషయం అమ్మానాన్నల మొబైల్‌కి వచ్చేస్తుంది! ఈ పరికరానికి ఆలియా, ఆమె బృందం ‘ప్రోరేనాటా’ అని పేరుపెట్టారు. ఈ లాటిన్‌ పదానికి అర్థం ‘అవసరార్థం’ అని! నేటి కాలానికి ఇది అత్యావశ్యకం కాబట్టి ఈ పేరుపెట్టామంటోంది ఆలియా! పదహారేళ్ల ఆలియా అమెరికాలో టెన్త్‌ గ్రేడ్‌ చదువుతోంది. అంటే, మన ఇంటర్‌ రెండో సంవత్సరంలాంటిది. నిజానికి అలియా తనలాంటివాళ్లు, తన ఈడువాళ్లు మాదకద్రవ్యాలకి బానిసలు కావడం చూసి భరించలేకే ఈ దిశా ఆలోచించింది. అయితే ఆ ఆవిష్కరణకు అదొక్కటే కారణం కాదు. అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నిర్వహించిన ఓ పోటీ కోసం వందలాదిమందితో తలపడేందుకు ఈ ప్రత్యేక పరికరాన్ని రూపొందించింది. అందులో విజేతగానూ నిలిచింది.
ఏమిటా పోటీ? అనగనగా కాన్రాడ్‌ ఫౌండేషన్‌ అని ఓ సేవాసంస్థ. చార్లెస్‌ పీట్‌ కాన్రాడ్‌ అనే వ్యోమగామి జ్ఞాపకంగా ఆయన భార్య నాన్సీ కాన్రాడ్‌ ఏర్పాటుచేసిన సంస్థ ఇది. ఇది ప్రతి ఏడాది ‘కాన్రాడ్‌ స్పిరిట్‌ ఆఫ్‌ ఇనోవేషన్‌ ఛాలెంజ్‌’ అనే పేరుతో శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణల పోటీ నిర్వహిస్తుంది. ఇందులో నాసా భాగస్వామి. ఈ రెండు సంస్థలూ కలిసి నిర్వహించే ఈ పోటీలకి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న నాసా కెన్నడీ అంతరిక్ష కేంద్రం వేదిక! ప్రపంచవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థలకి చెందిన రెండువందల బృందాలు ఇందుకోసం తలపడ్డాయి. వాటిలో ఆలియా మహ్మద్‌ బృందం ‘సైబర్‌ టెక్నాలజీ అండ్‌ సేఫ్టీ’ అనే విభాగం కింద పోటీపడింది. ఆలియా నేతృత్వంలోని ఈ బృందంలో దీపికా దండబోయిన, సారా వర్గీస్‌, ఆంచల్‌ రఘువంశీ కూడా ఉన్నారు. పేర్లని బట్టే తెలుస్తోందిగా వీళ్లందరూ అమెరికాలో చదువుతున్న ప్రవాస భారతీయ విద్యార్థినులని. వీరిలో దీపిక కూడా మన తెలుగమ్మాయే! వేర్వేరు స్కూళ్లలో చదువుతున్న వీరంతా పాఠశాలల సమన్వయకర్త ప్రొఫెసర్‌ మీర్జా ఫైజాన్‌ ద్వారా ఏకమయ్యారు. తమ బృందానికి ‘డార్క్‌ హార్స్‌’ అని పేరుపెట్టుకున్నారు. 200 బృందాల్లో 142 సెమీఫైనల్స్‌కి వెళితే విజేతగా నిలిచిన చివరి మూడు బృందాల్లో ‘డార్క్‌ హార్స్‌’ ఒకటి. ‘మాదకద్రవ్యాలని పసిగట్టగల సెన్సార్‌లని ఇంత చిన్న బ్యాండ్‌లోకి తీసుకురావడం, అది తల్లిదండ్రులకీ, పోలీసులకి ఉపయోగపడేలా మార్చడం వీరి ప్రత్యేకత!’ అని ప్రశంసించారు న్యాయ నిర్ణేతలు.
ఎనిమిదేళ్లప్పుడే అధ్యక్షుడి ప్రశంస.. అమెరికా టెక్సాస్‌ రాష్ట్రంలోని ఫ్రిస్కోలో సెంటెనియల్‌ స్కూల్లో చదువుతున్న ఆలియా మహ్మద్‌.. చిన్నప్పటి నుంచే చురుకు. ఎనిమిదో తరగతిలోనే దేశంలోని ఉత్తమ విద్యార్థినిగా నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నుంచి ‘ఔట్‌స్టాండింగ్‌ అకడమిక్‌ ఎక్సలెన్స్‌’ అవార్డు అందుకుంది. ఆలియా తండ్రి ఆసిఫ్‌ మహ్మద్‌ స్వస్థలం మచిలీపట్నం. విజయవాడలో చదువుకుని అమెరికా వెళ్లిపోయారు. ఇప్పుడక్కడ సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌గా ఉంటున్నారు. తల్లి సమ్రీనాది విశాఖ. అమెరికాలో అకౌంటెంట్‌గా ఉంటున్నారు. ఇద్దరు కూతుళ్లలో ఆలియా పెద్దమ్మాయి. ఏడాదికి ఓసారి ఇక్కడికి వస్తుంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మత్తుపదార్థాలతో ఏర్పడ్డ సంక్షోభం తీవ్రతపై ఆలియాకి ఎంతవరకు అవగాహన ఉందో తెలియదుకానీ.. ఆమె కనిపెట్టిన కంకణం అవసరం మాత్రం చాలా ఉందనే అనిపిస్తోంది మీరేమంటారు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్