Ileana: బరువు గురించి బాధ లేదు.. చాలా హ్యాపీగా ఉన్నా!

అమ్మయ్యే క్రమంలో జరిగే శారీరక మార్పులు, మానసిక ఒత్తిళ్లకు తోడు పెరిగే బరువుతో కొంతమంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు. కానీ తనకు ఆ బాధ లేదంటోంది టాలీవుడ్‌ బ్యూటీ ఇలియానా. ప్రస్తుతం గర్భిణి అయిన ఈ ముద్దుగుమ్మ అన్ని విషయాలు....

Updated : 25 Jun 2023 21:21 IST

(Photos: Instagram)

అమ్మయ్యే క్రమంలో జరిగే శారీరక మార్పులు, మానసిక ఒత్తిళ్లకు తోడు పెరిగే బరువుతో కొంతమంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు. కానీ తనకు ఆ బాధ లేదంటోంది టాలీవుడ్‌ బ్యూటీ ఇలియానా. ప్రస్తుతం గర్భిణి అయిన ఈ ముద్దుగుమ్మ అన్ని విషయాలు పక్కన పెట్టి.. వీలైనంత హ్యాపీగా ఉండడానికే ప్రయత్నిస్తున్నానంటోంది. ప్రెగ్నెన్సీలో మనం ఎంత సంతోషంగా ఉంటే.. కడుపులో బిడ్డ అంత ఆరోగ్యంగా ఎదుగుతుందంటోంది. తాజాగా ఇన్‌స్టాలో ‘Ask Me Anything’ సెషన్‌ నిర్వహించిన ఈ బెల్లీ బ్యూటీ.. తన ప్రెగ్నెన్సీ అనుభవాలు, ఆహారపు కోరికలకు సంబంధించిన బోలెడన్ని విషయాలు తన ఫ్యాన్స్‌తో పంచుకుంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో తన ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టింది ఇలియానా. ‘త్వరలోనే నేను తల్లిని కాబోతున్నా.. పుట్టబోయే నా చిన్నారి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా..’ అంటూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసిందీ బ్యూటీ. ఇక అప్పట్నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా.. కాబోయే అమ్మగా తన అనుభవాల్ని, అనుభూతుల్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటోంది ఇల్లూ బేబీ. ఇక తాజాగా ఇన్‌స్టాలో ‘Ask Me Anything’ సెషన్‌ నిర్వహించిందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానమిస్తూ.. ఈతరం మహిళల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసిందామె.

నెటిజన్‌ : ప్రెగ్నెన్సీలో పెరిగే బరువు గురించి బాధపడుతున్నారా?

ఇలియానా : ఈ ప్రశ్న నన్ను మొదట్లో పదే పదే ఇబ్బంది పెట్టేది. కానీ ఇప్పుడు దీని గురించి పట్టించుకోవడం మానేశా. నేనే కాదు.. ఈ రోజుల్లో చాలామంది గర్భిణులు ఇలాంటి ప్రశ్నలు, పెరిగే బరువు విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. నిజానికి దీని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా డాక్టర్‌ చెకప్‌కి వెళ్లినప్పుడల్లా తూచే బరువును మనసులో పెట్టుకుంటే ఒత్తిడి ఎదురవుతుంది. గర్భిణిగా ఉన్న సమయంలో ఇది మంచిది కాదు. కాబట్టి ఇలాంటి విషయాలు పట్టించుకోకుండా.. శరీరంలో జరిగే మార్పుల్ని స్వీకరించడం మంచిది. ప్రస్తుతం నేనూ ఇదే చేస్తున్నా. గత కొన్ని నెలలుగా నా శరీరంలో వస్తోన్న మార్పుల్ని ఆస్వాదిస్తున్నా. అయితే ఈ అద్భుతమైన ప్రయాణంలో కొన్ని ప్రతికూల పరిస్థితుల్నీ ధైర్యంగా ఎదుర్కొన్నా. ఈ సమయంలో బరువు ముఖ్యం కాదు.. మనం ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం! అందుకే మనసు మాట వింటూ, శరీరానికి సౌకర్యంగా ఉండే పనులు చేస్తూ సాధ్యమైనంత సంతోషంగా గడుపుతున్నా.

మొదటిసారి బేబీ హార్ట్‌బీట్‌ విన్నప్పుడు ఎలా ఫీలయ్యారు?

ఎంత సంబరపడిపోయానో మాటల్లో చెప్పలేను. నా జీవితంలోనే అత్యద్భుతమైన క్షణాలవి. ఆనందభాష్పాలతో నా కళ్లు చెమర్చాయి. కడుపులో పిండంగా ఏర్పడిన ఒక జీవి.. కొన్ని నెలల్లోనే పాపాయిగా ఈ భూమ్మీదకు రాబోతోందంటే ఎవరికైనా ఆనందమే కదా మరి!

ఐస్‌క్రీమ్‌/పిజ్జా.. వీటిలో ఏది తినాలనిపిస్తోంది?

ప్రస్తుతం నా ఆరోగ్యం, బేబీ ఎదుగుదలను దృష్టిలో ఉంచుకొని సంప్రదాయ వంటకాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నా. నిజానికి బటర్‌ చికెన్‌-నాన్‌ కాంబినేషన్‌ నాకు చాలా ఇష్టం. ఎప్పుడో ఒకసారి మాత్రమే దీన్ని తీసుకుంటున్నా. ముంబయికి చెందిన ప్రత్యేక వంటకాల్ని మిస్సవుతున్నా. ఇక గర్భం ధరించినప్పట్నుంచి బేబీ క్యారట్స్‌ బాగా తినాలనిపిస్తోంది.

మీ స్ట్రెస్‌బస్టర్?

బీచ్‌లు. ఎంత ఒత్తిడిలో ఉన్నా కాసేపు సముద్రాన్ని చూస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది. అందుకే బీచ్‌ వెకేషన్లను ఎక్కువగా ఇష్టపడతా. సముద్రానికి దగ్గరగా/అభిముఖంగా ఉండే ఇల్లు కొనాలని ఎప్పట్నుంచో కోరిక. ఎప్పటికైనా అది నెరవేర్చుకుంటా.

అతడే.. నా హీరో!

ఇలా తన ప్రెగ్నెన్సీ ప్రయాణంలో పాజిటివ్‌గా ముందుకు సాగుతోన్న ఇలియానా.. తాను గర్భవతినన్న విషయం బయటపెట్టినప్పుడు.. పెళ్లి కాకుండా తల్లవడంపై పలు విమర్శలు ఎదుర్కొంది. అప్పుడు మౌనం వహించినా.. ఇటీవలే బేబీమూన్‌కి వెళ్లొచ్చాక.. తన ప్రియుడిని ఫ్యాన్స్‌కి పరిచయం చేసిందీ గోవా బ్యూటీ.

‘నా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నా. ఒకానొక సమయంలో.. నా గురించి నేనే మర్చిపోయిన రోజుల్లో ఈ వ్యక్తి (ప్రియుడిని ఉద్దేశిస్తూ) నాకు అండగా నిలిచాడు. నాలో ధైర్యాన్ని నింపాడు. నా కన్నీళ్లు తుడిచి.. నా ముఖంలో చిరునవ్వులు పూయించాడు. నాకు ఎప్పుడు ఏం కావాలో అర్థం చేసుకుని.. నా చెంతనే నిలిచాడు. ప్రతి అడుగులో నాకు తోడయ్యాడు..’ అంటూ అతడితో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ బెల్లీ బ్యూటీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని