ఆయన నాతో మాట్లాడరు.. ప్రేమగా ఉండరు..!

నా భర్త నాకు ఏ విషయాలూ చెప్పరు. నాతో ఉన్నప్పుడు అస్సలు మాట్లాడరు. కానీ తన కుటుంబ సభ్యులతో, బయటి వ్యక్తులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ విషయం గురించి అడిగితే సమాధానం చెప్పరు. నాతో ఎప్పుడూ ప్రేమగా ఉండరు. అన్యోన్యంగా ఉన్న సందర్భాలు కూడా చాలా తక్కువ. నేను లేనప్పుడు తన తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లతో మాట్లాడతారు. ఆయన ప్రవర్తనతో చాలా బాధపడుతున్నాను....

Published : 16 Aug 2023 12:56 IST

నాకు పెళ్లై మూడేళ్లవుతోంది. నా భర్త నాకు ఏ విషయాలూ చెప్పరు. నాతో ఉన్నప్పుడు అస్సలు మాట్లాడరు. కానీ తన కుటుంబ సభ్యులతో, బయటి వ్యక్తులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ విషయం గురించి అడిగితే సమాధానం చెప్పరు. నాతో ఎప్పుడూ ప్రేమగా ఉండరు. అన్యోన్యంగా ఉన్న సందర్భాలు కూడా చాలా తక్కువ. నేను లేనప్పుడు తన తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లతో మాట్లాడతారు. ఆయన ప్రవర్తనతో చాలా బాధపడుతున్నాను. ‘నేను ఒంటరిదాన్ని, నాకు ఎవరూ లేరు.. నేను దురదృష్టవంతురాలిని’ అనే భావన కలుగుతోంది. దానివల్ల డిప్రెషన్‌కి గురవుతున్నా. నా భర్త నాతో ప్రేమగా ఉండి, అన్ని విషయాలు పంచుకోవాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీరు మొదట నేను, నా పరిస్థితులు, నా దురదృష్టం వల్లే ఈ సమస్యలు వచ్చాయి అనే భావన నుంచి బయటకు రండి. ఎందుకంటే వైవాహిక జీవితమనేది దీర్ఘకాలిక ప్రయాణం. ఈ ప్రయాణంలో దంపతులిరువురిలో ఏ ఒక్కరితో సమస్య ఉన్నా పరిష్కరించుకోవడానికి ముందు మన వంతు ప్రయత్నం చేయాలి. అంతేతప్ప నిరాశానిస్పృహలకు లోను కాకూడదు. నాదే తప్పేమో అన్న ఆత్మ నింద కూడా పనికి రాదు.
ఈ క్రమంలో- ముందుగా మీ మాట తీరు, పద్ధతులు, విధానాల్లో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా మీ భర్త మీకు దగ్గర కాగలరా? అన్న విషయాన్ని పరిశీలించండి. అలాగే మీరు మీ జీవితంలోని ఇతర అంశాల కన్నా మీరు మీ భర్త పైనే అవసరమైనదానికన్నా ఎక్కువగా ఫోకస్ చేస్తూ, మీకు మీరుగా ఒంటరితనానికి లోనవుతున్నారేమో కూడా ఆలోచించండి.
అదేవిధంగా- మీ పుట్టింట్లో పరిస్థితులు, మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధ బాంధవ్యాలు వేరుగా ఉండచ్చు. అదే పరిస్థితి మీ అత్తవారింట్లో ఉండకపోవచ్చు. ఈ క్రమంలో- అత్తింటివారితో కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడడానికి మీ వైపు నుంచి ఏవైనా మార్పులు చేసుకోవాల్సి ఉందేమో కూడా పరిశీలించండి. ఆ క్రమంలో మీ భర్త మీకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉండచ్చు.
మీ భర్తకు దగ్గర కావడానికి, అత్తవారింట్లో అందరినీ కలుపుకొనిపోవడానికి మీ వైపు నుంచి ఎంతగా ప్రయత్నించినా అప్పటికీ ఫలితం లేదంటే అప్పుడు కచ్చితంగా సమస్యకు కారణం ఎదుటివారే అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులలో మీ భర్త ప్రవర్తన వల్ల మీరెంతగా బాధపడుతున్నదీ ఆయనతో వివరంగా చెప్పి చూసే ప్రయత్నం చేయండి. ఈ విషయంలో అవసరమైతే మీ అత్తింట్లో మీకు మద్దతుగా నిలిచే సభ్యుల సహాయం కూడా తీసుకోండి. వీలైతే ఫ్యామిలీ కౌన్సెలింగ్ తీసుకోవడం కూడా మంచిది. అయితే ఏది ఏమైనా- నిరాశానిస్పృహలు ఇక్కడ అనవసరం. మీపై మీరు పూర్తి విశ్వాసంతో ఉండండి. అదేవిధంగా సాధ్యమైనంతవరకు ఖాళీగా ఉండకుండా మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని