40ల్లోకి ప్రవేశించారా? ఇలా ఇమ్యూనిటీని పెంచుకోండి!

మెనోపాజ్‌ వల్ల కావచ్చు.. జీవనశైలిలో మార్పుల వల్ల కావచ్చు.. ఇలా కారణమేదైనా నలభైల్లోకి అడుగుపెట్టిన మహిళలు వయసుతో పాటు ఉన్నట్లుండి బరువు పెరుగుతుంటారు. ఈ క్రమంలో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి శరీరం సహకరించదని అనుకునే వారూ లేకపోలేదు. ఇలా శరీరానికి సరైన వ్యాయామం....

Published : 30 May 2023 12:51 IST

మెనోపాజ్‌ వల్ల కావచ్చు.. జీవనశైలిలో మార్పుల వల్ల కావచ్చు.. ఇలా కారణమేదైనా నలభైల్లోకి అడుగుపెట్టిన మహిళలు వయసుతో పాటు ఉన్నట్లుండి బరువు పెరుగుతుంటారు. ఈ క్రమంలో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి శరీరం సహకరించదని అనుకునే వారూ లేకపోలేదు. ఇలా శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, చక్కటి ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఈ వయసులో వివిధ అనారోగ్యాలు చుట్టుముడతాయి. మరి, వీటి బారిన పడకూడదన్నా, పడినా వీటిని సమర్థంగా ఎదుర్కోవాలన్నా రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండడం ముఖ్యం. అందుకోసం కొన్ని ఆహార పదార్థాలు చక్కగా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. మరి, నలభైల్లో ప్రవేశించిన మహిళల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆ ఆహార నియమాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

సాధారణంగా వయసు పైబడే కొద్దీ శరీరంలో జీవక్రియల రేటు కూడా మందగిస్తుంది. ఫలితంగా క్యాలరీలు కరిగించే శక్తి రోజురోజుకీ క్షీణిస్తుంది. ఇక నలభై దాటిన మహిళల్లో మెనోపాజ్‌, హార్మోన్ల అసమతుల్యత, కండరాల దృఢత్వం క్షీణించడం.. వంటి పలు సమస్యలు వారిలో అధిక బరువుకు దారితీస్తాయి. ఇక వీటి వల్ల ఇటు శారీరకంగా, అటు మానసికంగా లేనిపోని అనారోగ్యాలు చుట్టుముడతాయి. కాబట్టి నలభై దాటిన మహిళలు చక్కటి పోషకాహారంతో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

సబ్జా గింజలు
బరువు తగ్గించుకుని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునే వారికి సబ్జా గింజలు మంచి ఆహారమని చెప్పుకోవచ్చు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. గ్లూటెన్‌ ఉండదు. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. తదితర పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ఈ గింజల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉండడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదేవిధంగా ఇందులోని ప్రొటీన్లు ఆహారపు కోరికల్ని తగ్గిస్తాయి. తద్వారా మితంగా ఆహారం తీసుకుంటూ సులభంగా బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందట! సాధారణంగా సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టుకుని తినచ్చు. లేకపోతే సలాడ్లు, స్మూతీలలో వీటిని కలుపుకొని తీసుకున్నా అందులోని పోషకాలు శరీరానికి అందుతాయి.

నిమ్మ జాతి పండ్లు
నారింజ, ద్రాక్ష, నిమ్మ.. వంటి నిమ్మ జాతికి చెందిన పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌, విటమిన్‌-సి తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర బరువును అదుపులో ఉంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అంతేకాదు.. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. గుండెకు రక్షణనిస్తాయి. చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా మారుస్తాయి.

గుడ్లు
మెనోపాజ్‌కు దగ్గరవుతోన్న మహిళల్లో ఐరన్, విటమిన్‌-డి స్థాయులు క్రమంగా తగ్గిపోతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ రెండు పోషకాలు పుష్కలంగా లభించే గుడ్లు వారికి ఎంతో మేలు చేస్తాయి. అదేవిధంగా గుడ్లలోని ప్రొటీన్లు మెనోపాజ్‌ కారణంగా స్త్రీలలో పెరిగే చెడు కొవ్వును కరిగిస్తాయి. తద్వారా గుండె సమస్యలు, స్థూలకాయం.. లాంటి దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.

చేపలు
చేపల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే హార్మోన్ల అసమతుల్యత కారణంగా కలిగే అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చు. ఈ కొవ్వులు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. అంతేకాదు మెదడు, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. సాధారణంగా మెనోపాజ్‌ దశలోకి ప్రవేశించిన మహిళల్లో వేడి ఆవిర్లతో పాటు రాత్రి సమయాల్లో చెమట పట్టడంతో అసౌకర్యంగా ఫీలవుతుంటారు. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

చిరుధాన్యాలు
నియాసిన్‌, రైబోఫ్లేవిన్‌, విటమిన్‌-ఇ వంటి పోషకాలు అధికంగా ఉండే నట్స్‌తో ఆరోగ్యమే కాదు మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు కూడా దూరమవుతాయి. శరీర బరువును అదుపులో ఉంచే ఫైబర్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు కూడా ఇందులో సమృద్ధిగా లభిస్తాయి.

క్యారట్
విటమిన్‌-ఎ పుష్కలంగా దొరికే క్యారట్లు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. నల్లమచ్చలు, ముడతలు, మొటిమలు.. లాంటి సమస్యల నుంచి రక్షణ కలిగిస్తాయి. ఇక క్యారట్‌తో కంటికి కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

యాపిల్
అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే యాపిల్‌కు సూపర్‌ ఫుడ్‌ అనే పేరు కూడా ఉంది. ఇందులో సి, బి, కె విటమిన్లు; ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. యాపిల్‌లోని పీచు పదార్థం కారణంగా అజీర్తి సమస్యలు దూరమవుతాయి. జీర్ణక్రియ రేటు వేగవంతమవుతుంది.

పెరుగు
పెరుగులో ప్రొ-బయోటిక్స్‌ పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. అలాగే ఇందులో అధిక మొత్తంలో లభించే ప్రొటీన్‌, విటమిన్ ‘ఎ’, జింక్‌... వంటి పోషకాలు శరీరానికి అవసరమైన శక్తినిస్తాయి. పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి.

సో...చూశారుగా... నలభై ఏళ్లు దాటిన మహిళలు వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో..! మరి మీరూ నలభైల్లోకి అడుగుపెట్టారా? అయితే వెంటనే పైన చెప్పిన పదార్థాలను మీ మెనూలో చేర్చుకోండి.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని