Breadcrumbing: ప్రేమ చూపిస్తూనే.. మనసు విరిచేస్తారు!

‘ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ.. నాతిచరామి’ అంటూ పెళ్లిలో చేసిన వాగ్దానాల్ని దంపతులిద్దరూ తు.చ. తప్పకుండా పాటించినప్పుడే ఆ అనుబంధం శాశ్వతమవుతుంది. అయితే కొంతమంది మాత్రం పెళ్లి వాగ్దానాలే కాదు.. అప్పుడప్పుడూ తమ భాగస్వామికిచ్చిన మాటల్ని....

Updated : 18 Jul 2023 18:38 IST

‘ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ.. నాతిచరామి’ అంటూ పెళ్లిలో చేసిన వాగ్దానాల్ని దంపతులిద్దరూ తు.చ. తప్పకుండా పాటించినప్పుడే ఆ అనుబంధం శాశ్వతమవుతుంది. అయితే కొంతమంది మాత్రం పెళ్లి వాగ్దానాలే కాదు.. అప్పుడప్పుడూ తమ భాగస్వామికిచ్చిన మాటల్ని సైతం నిలబెట్టుకోలేకపోతారు. ఇందుకు కారణం.. గుర్తులేకపోవడం కాదు.. భాగస్వామి పట్ల నిర్లక్ష్యం..! వైవాహిక బంధంలో ఉన్న ఈ తరహా ధోరణినే ‘బ్రెడ్‌క్రంబింగ్‌ రిలేషన్‌షిప్‌’గా పిలుస్తున్నారు నిపుణులు. తమపై ఎంతో నమ్మకం పెట్టుకున్న భాగస్వామిని ఇలా నిర్లక్ష్యం చేయడం వారిని మానసికంగా కుంగదీయడమే అంటున్నారు. అంటే.. ఇదీ ఒక రకంగా మానసిక వేధింపుల్లాంటిదే! మరి, దాంపత్య బంధంలో దీన్నెలా గుర్తించాలి? తిరిగి భాగస్వామి ప్రేమను పొందాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..

వైవాహిక బంధంలో ఏళ్లు గడిచే కొద్దీ చాలామంది దంపతుల మధ్య ప్రేమ, అన్యోన్యత తగ్గిపోవడం మనం చూస్తుంటాం. మొదట్లో తమ భాగస్వామితో ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపినా.. ఆ తర్వాత కాసేపు సమయం కేటాయించడం కూడా ఏదో కష్టంగా ఫీలవుతుంటారు. అంతేకాదు.. పెళ్లైన కొత్తలో అడిగిందల్లా కొనిచ్చే ఆతృత ఏళ్లు గడిచే కొద్దీ ఉండదు. ఇక ఇచ్చిన మాటలు, చేసిన వాగ్దానాలు కూడా నెరవేర్చలేకపోతుంటారు. ఇది చూసి ‘భాగస్వామివన్నీ కల్లబొల్లి కబుర్లే’ అన్న భావన కలుగుతుంది. అయితే వివాహ బంధంలో ‘బ్రెడ్‌క్రంబింగ్‌ రిలేషన్‌షిప్‌’గా పిలిచే ఈ పరిస్థితిని భాగస్వామి ప్రవర్తనను బట్టి గుర్తించచ్చంటున్నారు నిపుణులు.

ఆశలు రేకెత్తిస్తారంతే..!

భాగస్వామి అస్థిరమైన ప్రవర్తనను బట్టి అనుబంధంలో బ్రెడ్‌ క్రంబింగ్‌ను గుర్తించచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇలాంటి వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరు. సరేనని మనం సర్దుకుపోయి.. ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తే.. పదే పదే దాన్నే గుర్తుచేస్తూ భాగస్వామిని బాధపెడుతుంటారు. ఇలా తమ చంచలమైన స్వభావంతో ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ.. దాంపత్య బంధంలో కలతలకు కారణమవుతుంటారు.

వీకెండ్‌ రాగానే.. భాగస్వామి, పిల్లలతో కలిసి బయటికెళ్లాలని, డిన్నర్‌కి వెళ్లాలని.. ఇలా ప్లాన్ల మీద ప్లాన్లు వేసుకుంటాం. భాగస్వామీ ఇందుకు సరేనంటారు.. కానీ తీరా సమయం వచ్చేసరికి పదే పదే ఈ ప్రణాళికల్ని వాయిదా వేస్తూ అవతలి వారిని నిరాశ పరుస్తుంటారు. దీనివల్ల ఓపిక నశిస్తుంది.. మనసూ బాధపడుతుంది.

పొరపాటు తమదైనా, భాగస్వామిదైనా.. భాగస్వామినే నిందిస్తుంటారు. ఈ క్రమంలో అలకబూనడం, కాల్స్‌/సందేశాలకూ స్పందించకపోవడం.. ఇలా అవతలి వారు స్వీయ అపరాధ భావనకు లోనయ్యేలా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో భాగస్వామి క్షమాపణ కోరుతుంటే.. రాక్షసానందం పొందే వారూ లేకపోలేదు.

నిజమైన ప్రేమ ఏదీ ఆశించదంటారు. కానీ ‘బ్రెడ్ క్రంబర్స్‌’ ఇందుకు భిన్నం. భాగస్వామిపై ఎనలేని ప్రేమను ప్రదర్శిస్తూ, అవసరం ఉన్నా లేకపోయినా వారిని ప్రశంసిస్తూ తమ పనులు పూర్తిచేసుకుంటుంటారు. ఇంత ప్రేమ చూపుతున్నారని, ప్రశంసిస్తున్నారని వారికి లొంగిపోయామంటే మోసపోయినట్లే అంటున్నారు నిపుణులు.

శృంగార జీవితంలోనూ భార్యాభర్తలు ఒకరి ఇష్టాల్ని మరొకరు గౌరవిస్తూ.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. కానీ భాగస్వామి ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యమివ్వకుండా.. తమ కోరికల్ని నెరవేర్చుకుంటే చాలనుకుంటారు కొందరు. ఈ క్రమంలో బలవంతపు శృంగారానికి ప్రయత్నించడం, తాత్కాలిక ప్రేమను చూపించడం.. ఎలాగోలా తాము అనుకున్నది నెరవేరితే చాలనుకుంటారీ స్వార్థపరులు.

ఇలాంటి మోసపూరిత ప్రవర్తన భాగస్వామి పసిగట్టారని తెలిసినా, అనుమానమొచ్చినా.. అప్పటికప్పుడు మారిపోయినట్లుగా నటించి జాగ్రత్తపడడంలోనూ ‘బ్రెడ్‌క్రంబర్స్‌’ ముందుంటారు. అయితే ఈ నటన కూడా తాత్కాలికమే! ఒకట్రెండు రోజులయ్యాక.. కథ మళ్లీ మొదటికొస్తుంది.

పంతాలొద్దు.. సామరస్యంగానే..!

అయితే భాగస్వామిలో ఈ తరహా ప్రవర్తన మిమ్మల్ని బాధపెట్టినా, వాళ్లను అలాగే వదిలేసినా.. నష్టం మీకే. పైగా ఇలా ఇద్దరూ ఒకరినొకరు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే అనుబంధానికే ముప్పు వాటిల్లచ్చు. అందుకే దాంపత్య బంధంలో చిచ్చుపెట్టే ‘బ్రెడ్ క్రంబింగ్‌’కు స్వస్తి పలకాలంటే ఈ జాగ్రత్తలు ముఖ్యమంటున్నారు నిపుణులు.

ఏ సమస్యకైనా మాట్లాడుకుంటేనే పరిష్కారం దొరుకుతుంది. బ్రెడ్ క్రంబింగ్‌కూ ఇది వర్తిస్తుంది. కాబట్టి భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు.. అసలు వాళ్లెందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో పొరపాటు ఎవరిదైనా నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా సరిదిద్దుకుంటేనే ఫలితం ఉంటుంది.

కొన్నిసార్లు మన ప్రవర్తన, చేసే పనులు అవతలి వారికి నచ్చక.. ఇలా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెట్టడం కామనే! అందుకే స్వీయ పొరపాట్లేమైనా ఉన్నాయేమో ఆత్మపరిశీలన చేసుకోమంటున్నారు నిపుణులు. ఒకవేళ వాళ్లను నిర్లక్ష్యం చేయడం వల్లే వాళ్లిలా ప్రవర్తిస్తున్నారని తేలితే.. ముందు మిమ్మల్ని మీరు మార్చుకొని.. ఆపై వాళ్లలో మార్పు కోరుకోవడం వల్ల మేలు జరుగుతుందంటున్నారు.

ముల్లును ముల్లుతోనే తీయాలని కొంతమంది.. పంతాలకు పోతుంటారు. భాగస్వామి ఎలా ప్రవర్తిస్తే.. తామూ అలాగే ప్రవర్తిస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. నిజానికి దీనివల్ల దాంపత్య బంధంలో సమస్యలు పెరగడం తప్ప మరే ప్రయోజనం లేదంటున్నారు నిపుణులు. అందుకే సామరస్యంగానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటున్నారు.

ఇలా భాగస్వామి ఇబ్బంది పెట్టడం వల్ల మానసికంగా డిస్టర్బ్‌ అవుతాం. దాంతో ప్రతికూల ఆలోచనలు మనసును ఆవహిస్తాయి. ఈ పరిస్థితి వైవాహిక బంధాన్నీ ప్రభావితం చేస్తుంది. కాబట్టి ముందు మీరు మానసికంగా కాస్త దృఢంగా మారాకే.. భాగస్వామితో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకుంటే ఇద్దరి మధ్య బంధం మరింత సన్నగిల్లకుండా జాగ్రత్తపడచ్చు. ఈ క్రమంలో మీ మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి నిపుణుల సహాయం కూడా తీసుకోవచ్చు.

అయితే ఇన్ని విధాలుగా ప్రయత్నించినా భాగస్వామి మారకపోతే మాత్రం ఆఖరి ప్రయత్నంగా నిపుణుల కౌన్సెలింగ్‌కు వెళ్లచ్చు.. ఆపై మారితే సరి.. లేదంటే అన్ని విధాలుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం మీ చేతుల్లోనే ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని