‘మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవం’.. అసలెందుకు మొదలైందో తెలుసా?

‘మహిళలే తోటి మహిళల్ని నడిపించగలరం’టుంటారు. వ్యాపారం విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం ఒకరి స్ఫూర్తితో మరొకరు వ్యాపారాలు, స్టార్టప్‌లు ప్రారంభించడం.. వాటిని లాభాల బాట పట్టించడం.. ఎంతోమందికి ఉపాధి కల్పించడం.. ఇలా దేశ ఆర్థిక ప్రగతిలో తమ వంతుగా....

Updated : 19 Nov 2022 19:10 IST

‘మహిళలే తోటి మహిళల్ని నడిపించగలరం’టుంటారు. వ్యాపారం విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం ఒకరి స్ఫూర్తితో మరొకరు వ్యాపారాలు, స్టార్టప్‌లు ప్రారంభించడం.. వాటిని లాభాల బాట పట్టించడం.. ఎంతోమందికి ఉపాధి కల్పించడం.. ఇలా దేశ ఆర్థిక ప్రగతిలో తమ వంతుగా కృషి చేస్తున్నారు అతివలు. ఇలా వీరి వ్యాపార విజయాల్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఏటా నవంబర్‌ 19న ‘మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవం’గా జరుపుకోవాలని ‘వుమెన్ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌డే ఆర్గనైజేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ (WEDO) ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేకమైన రోజు గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..

అప్పుడే తొలిసారి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా వ్యాపారవేత్తల్ని ప్రోత్సహిస్తూ, వారికి మద్దతిస్తూ.. తద్వారా పేదరికాన్ని నిర్మూలించడమే ముఖ్యోద్దేశంగా ‘మహిళా వ్యాపారవేత్తల దినోత్సవా’న్ని జరుపుకోవాలని నిర్ణయించింది WEDO. ఈ దిశగా ఈ సంస్థ చేస్తోన్న ప్రయత్నాల్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి నవంబర్‌ 19న ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించింది. అలా న్యూయార్క్‌ సిటీలో జరిగిన మొదటి పారిశ్రామికవేత్తల దినోత్సవం వేడుకల్లో పలు దేశాలు పాల్గొన్నాయి. ఇక 2014లో సుమారు 144కి పైగా దేశాలు తొలిసారి ఈ ప్రత్యేకమైన రోజును గుర్తించి వేడుకలు జరుపుకొన్నాయి. ఈ సందర్భంగా వ్యాపారంలో మేటిగా నిలిచిన మహిళా వ్యాపారవేత్తలకు అవార్డులు (Pioneer Awards) అందించడం కూడా మొదలుపెట్టారు. ఇక అప్పట్నుంచి నేటి దాకా ఏటా ఇదే రోజున ‘మహిళా వ్యాపారవేత్తల దినోత్సవా’న్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వ్యాపారంలో విజయం సాధించిన మహిళల స్ఫూర్తిని చాటుతున్నాయి పలు సంస్థలు.

#Choosewomen ముఖ్యోద్దేశమిదే!

అభివృద్ధి చెందిన, చెందుతోన్న, చెందని చాలా దేశాల్లో.. స్థూల జాతీయోత్పత్తిలో మహిళా పారిశ్రామికవేత్తల వాటా 50 శాతానికి పైగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని బట్టే దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళా వ్యాపారవేత్తలు సగం పాత్ర పోషిస్తున్నారని అర్థమవుతోంది. అందుకే ఇలాంటి అర్హులైన మహిళా వ్యాపారవేత్తల స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తం చేసే ముఖ్యోద్దేశంతో ఈ ఏడాది #Choosewomen అనే క్యాంపెయిన్‌కి శ్రీకారం చుట్టింది WEDO. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక మహిళా వ్యాపారవేత్త నిర్వహిస్తోన్న వ్యాపారానికి సంబంధించిన ఉత్పత్తులు కొనడం, మహిళా రచయిత్రి రాసిన పుస్తకం చదవడం, మహిళా దర్శకురాలు/నిర్మాత రూపొందించిన చిత్రాలు చూడడం.. వంటివి చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ల గురించి, వాళ్ల ఉత్పత్తులు/నైపుణ్యాల గురించి #Choosewomen అనే హ్యాష్‌ట్యాగ్‌ని జతచేస్తూ సోషల్‌ మీడియాలో పంచుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా వాళ్ల వ్యాపార నైపుణ్యాలు/శక్తిసామర్థ్యాలు ప్రపంచవ్యాప్తమవుతాయి.. ఎంతోమందిలో స్ఫూర్తినీ నింపుతాయి.


ప్రోత్సహిస్తే మేలే!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం పారిశ్రామికవేత్తల్లో మహిళా వ్యాపారవేత్తలు దాదాపు మూడింట ఒక వంతు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక భారత్‌లో ఈ సంఖ్య 13.76 శాతం ఉన్నట్లు ‘ప్రణాళిక, గణాంకాల మంత్రిత్వ శాఖ’ నిర్వహించిన ఆరో ఆర్థిక గణనలో వెల్లడైంది. అంటే మన దేశంలో మొత్తంగా 5.85 కోట్ల మంది పారిశ్రామికవేత్తలుంటే.. అందులో మహిళల సంఖ్య 80.5 లక్షలుగా ఉంది. అయితే ఈ సంఖ్య మరింత పెరిగేలా ప్రభుత్వాలు కృషి చేయాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగితే మహిళా సాధికారత సాధించడమే కాదు.. దేశ ఆర్థికాభివృద్ధికీ మేలు జరుగుతుందంటున్నారు. అంతేకాదు.. ఇతర ప్రయోజనాలూ ఉన్నాయంటున్నారు.

ఇలాంటి మహిళల స్ఫూర్తితో కుటుంబాలూ స్ఫూర్తి పొందుతాయి. తద్వారా మూసధోరణుల అడ్డు తెరల్ని తొలగించుకొని.. వాళ్లు తమ కుటుంబంలోని అమ్మాయిల్నీ ఈ దిశగా ప్రోత్సహించేందుకు మార్గం సుగమమవుతుంది.

ఆసక్తి ఉన్న అమ్మాయిల్ని వ్యాపారంలో ప్రోత్సహించడం వల్ల.. ఈ మక్కువతో కొత్త కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకురాగలుగుతారు. ఫలితంగా ఉన్నత శిఖరాల్ని అధిరోహించగలుగుతారు.

సాధారణంగా గ్లాస్‌ సీలింగ్‌ని బద్దలుకొట్టి స్వీయ శక్తితో ఎదిగిన మహిళలు.. ఇతర మహిళల సమస్యల్ని అర్థం చేసుకోవడంలో ముందుంటారు. తద్వారా తమ సంస్థ ద్వారా వారికీ ఉపాధి కల్పించి.. వారి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తారు.

వ్యాపారంలో రాణించే మహిళలు తమ పిల్లల పైనా సానుకూల ప్రభావం చూపగలుగుతారు. పెరిగి పెద్దయ్యే క్రమంలో క్రమశిక్షణ, సమయపాలన, కెరియర్‌ ప్రాముఖ్యత.. వంటివెన్నో మిమ్మల్ని చూసి వారు నేర్చుకోగలుగుతారు. తద్వారా వారూ మంచి భవిష్యత్తును నిర్మించుకోగలుగుతారు.

‘లక్షల జీతం వదులుకుని.. ఎండలో ఎందుకీ పని’ అన్నారు..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని