Published : 22/10/2022 16:48 IST

ధనలక్ష్మీ కరుణాకటాక్షాల ‘ధన్‌తేరస్’!

మహిళలు ధనలక్ష్మీ వరసిద్ధి కోసం ఈ రోజు స్వర్ణాభరణాలను కొనుగోలు చేస్తే... వ్యాపారస్తులు ఇదే పర్వదినాన తమ నూతన ఒప్పందాలకు శ్రీకారం చుడతారు. కొన్నిచోట్ల ఇదే రోజు కుబేరుడిని పూజించడం ఆనవాయితీ అయితే... మరి కొన్ని చోట్ల అపమృత్యు నివారణ కోసం దీపాలను వెలిగించడం సంప్రదాయం. ఏదేమైనా, దీపావళి పండగలో భాగంగా ఐదు రోజులు జరుపుకొనే వేడుకల్లో తొలి రోజైన 'ధన్‌తేరస్' ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

ఇదే 'ధన' త్రయోదశి

ఉత్తరాదిలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ 'ధన్‌తేరస్'నే 'ధన త్రయోదశి' అని కూడా అంటారు. ఆశ్వయుజ మాసం కృష్ణపక్షంలో దీపావళి పర్వదినాల్లో భాగంగా తొలి రోజు జరుపుకొనే ఈ పండగ సందర్భంగా ప్రజలంతా స్వర్ణాభరణాల కొనుగోలుపై మొగ్గుచూపడం విశేషం. కొత్త వస్తువులు కొనడానికి ఇది అనువైన రోజని పండితులు చెబుతుంటారు. వర్తకులు బంగారం, వెండితో చేసిన నాణేలను కూడా విక్రయిస్తుంటారు. భక్తుల కోరికలను తీర్చడానికి 'అదృష్ట లక్ష్మి' తనను పూజించే ప్రతి ఇంటికీ ఈ రోజు అతిథిగా విచ్చేస్తుందన్నది ఒక నమ్మకం.

నేపథ్యమిది!

'ధన్‌తేరస్'కు సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ రోజున హిమచక్రవర్తి కుమారుడు పాముకాటుకి గురవుతాడని, అతడి జాతకం ద్వారా ముందే తెలిసిందట! దీంతో తన పతిని కాపాడుకోవడం కోసం అతని భార్య ఆ సమయంలో ఇంట్లోని వెండి, బంగారు ఆభరణాలన్నీ తెచ్చి గడప ముందు రాశులుగా పోసిందని, ఆ రాశుల నుంచి వచ్చే తేజస్సు ధాటికి తట్టుకోలేక పాము రూపంలో ఆమె భర్త ప్రాణాలు కబళించడానికి వచ్చిన యమధర్మరాజు తిరిగెళ్లిపోయాడని ఓ కథ ప్రచారంలో ఉంది. ఇదే రోజున సముద్ర మథనంలో అమృతాన్ని సృష్టించారని అంటారు. ధనత్రయోదశినే కొన్ని ప్రాంతాల్లో 'యమ త్రయోదశి' అని కూడా పిలుస్తారు. ఈ రోజున సాయంత్రం భక్తులందరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇంటి చుట్టూ దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈ పూజలో భాగంగా గోధుమ, పెసలు, మినుములు, కందులు, బార్లీ .. మొదలైన వాటిని అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే అపమృత్యు నివారణ కోసం నూనెతో దీపం వెలిగిస్తారు. దీనినే 'యమదీపం' అని కూడా అంటారు.

'బంగారం' పండగ!

⚛ ధన్‌తేరస్ సందర్భంగా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకొనే అంశం కొత్త స్వర్ణాభరణాలను, వస్తువులను కొనుగోలు చేయడం.

⚛ ఈ రోజున బంగారం కొనుగోలు చేసి ఆ మహాలక్ష్మికి సమర్పిస్తే సకల అభీష్టాలు నెరవేరతాయని, ఇంటిల్లిపాదీ సుఖసంతోషాలతో కళకళలాడుతుంటారని భావిస్తారు.

⚛ ధన్‌తేరస్ సందర్భంగా పలువురు మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం తెలిసిందే. పెద్ద మొత్తంలో బంగారం కొనలేని వారు తమ తాహతును బట్టి కనీసం ఒక గ్రాము బంగారమైనా కొనుగోలు చేయడం చూస్తూనే ఉంటాం. కొంతమంది బంగారు నాణేలు, డాలర్ల రూపంలో కూడా కొనుగోలు చేస్తారు.

⚛ ధన త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అష్త్టెశ్వర్యాల సిద్ధి కోసం కొన్ని ప్రాంతాల్లో కుబేరుడిని పూజించడం కూడా ఒక ఆచారంగా ఉంది.

ఇంకొన్ని విశేషాలు..

⚛ ధన్‌తేరస్ సందర్భంగా కుంకుమతో చేసిన పాదాలను, రంగురంగుల రంగవల్లికలను.. ఇంటి గడప ఎదుట వేసి ఆ మహాలక్ష్మికి స్వాగతం పలికే ఆచారం చాలా చోట్ల కనిపిస్తుంది.

⚛ ఇదే రోజు ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే, ఆమెలో ఆ లక్ష్మీదేవి అంశ తప్పకుండా ఉంటుందని, తమ ఇల్లు పావనమవుతుందని చాలామంది నమ్మడం విశేషం.

⚛ ధన్‌తేరస్ రోజునే కొన్ని ప్రాంతాల్లో 'ధన్వంతరి జయంతి'ని జరుపుకొనే సంప్రదాయం కూడా ఉంది.

⚛ కొత్త ఒప్పందాలు చేసుకోవాలన్నా, నూతన వ్యాపార లావాదేవీలకు శ్రీకారం చుట్టాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా 'ధన్‌తేరస్' అనువైన రోజని మార్వాడీలు భావిస్తారు.

⚛ ధన త్రయోదశి రోజునే పితృదేవతలను స్మరిస్తూ, సంధ్యా సమయంలో దక్షిణ దిక్కుగా దీపాన్ని వెలిగించి, వారికి నైవేద్యం సమర్పించే ఆచారం కూడా చాలా ప్రాంతాల్లో ఉంది.

⚛ ఇదే రోజున గోవులను పూజించే సంప్రదాయం కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉండడం విశేషం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని