Published : 11/10/2022 20:08 IST

బ్రెస్ట్‌ రీకన్‌స్ట్రక్షన్.. ఎవరికి, ఎప్పుడు అవసరం?

కొన్ని ఆరోగ్య సమస్యలు ఆలస్యంగా బయటపడుతుంటాయి.. రొమ్ము క్యాన్సర్‌ కూడా అలాంటిదే! ప్రతి తొమ్మిది మందిలో ఒకరు తమ జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి ఈ క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇది ప్రాణాంతకంగా మారే కేసులూ పెరిగిపోతున్నాయి. స్వీయ పరీక్షలు, ఆయా లక్షణాలను బట్టి దీన్ని తొలి దశలోనే నిర్ధరించుకొని చికిత్స తీసుకోవడం మంచిది. లేదంటే సమస్య తీవ్రతను బట్టి వ్యాధి సోకిన రొమ్మునూ తొలగించాల్సి రావచ్చు. అయితే ఇలాంటి బాధితులకు ‘బ్రెస్ట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీ’ ఓ వరంలా మారిందంటున్నారు నిపుణులు. ఇంతకీ, అసలు దీన్ని ఎవరు చేయించుకోవచ్చు? ఎప్పుడు ఎంచుకోవాలి? చేయించుకునే క్రమంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటి? 

రొమ్ము క్యాన్సర్‌ సోకిన వారిలో వ్యాధి తీవ్రతను బట్టి వివిధ రకాల చికిత్సలు చేస్తుంటారు. కీమో/రేడియేషన్‌/హార్మోనల్‌.. వంటి థెరపీలతో పాటు కొంతమందికి మ్యాస్టెక్టమీ, లంపెక్టమీ.. వంటి శస్త్రచికిత్సలూ నిర్వహించాల్సి రావచ్చు. అయితే మ్యాస్టెక్టమీలో భాగంగా వ్యాధి సోకిన రొమ్ము కణజాలాన్ని పూర్తిగా తొలగిస్తారు. అదే లంపెక్టమీ అయితే క్యాన్సర్‌ కణాలు-ఆ చుట్టూ ఉండే కొంత భాగాన్ని ఆపరేషన్‌ ద్వారా తొలగిస్తారు. ఇలాంటి సందర్భాల్లో రొమ్ము/రొమ్ముల ఆకృతి తిరిగి పొందాలనుకునే వారికి ‘బ్రెస్ట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీ’ సూచిస్తారు వైద్యులు.

ఏది ఎంచుకోవాలి?

బ్రెస్ట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీ చేయించుకోవాలనుకోవడంతోనే సరిపోదు.. జరిగిన శస్త్రచికిత్స, అప్పటి ఆరోగ్యస్థితికి అనుగుణంగా ఏ రీకన్‌స్ట్రక్షన్‌ ఎంచుకోవాలో నిపుణుల సలహా మేరకు నిర్ణయించుకోవడం చాలా ముఖ్యమట! ఇందులో భాగంగా సిలికాన్‌/సెలైన్‌ (Saline) ఇంప్లాంట్స్‌ ఉపయోగించడం ఒక పద్ధతి. ఇక మరో పద్ధతిలో భాగంగా.. ఇతర శరీర భాగం నుంచి కణజాలాన్ని సేకరించి రొమ్ము భాగంలో అమర్చుతుంటారు. దీన్ని ‘ఆటోలోగస్‌/స్కిన్‌ ఫ్లాప్‌ సర్జరీ’గా పిలుస్తారు. ఇక రొమ్ముకు సహజసిద్ధమైన లుక్‌ తీసుకురావడానికి ఈ రెండు పద్ధతుల్ని కలిపి కూడా శస్త్రచికిత్స చేయచ్చంటున్నారు నిపుణులు.

ఎప్పుడు చేయించుకోవచ్చు?

రొమ్ముల్ని తిరిగి సెట్‌ చేసుకునేందుకు చేయించుకునే ఈ సర్జరీని మ్యాస్టెక్టమీ/లంపెక్టమీతో కలిపి ఏకకాలంలోనూ చేస్తుంటారట కొందరు వైద్యులు. దీన్నే ‘Immediate Reconstruction’ అంటారు. అదే మ్యాస్టెక్టమీతో పాటు ఇతర క్యాన్సర్‌ చికిత్సలు పూర్తయ్యాక కూడా బ్రెస్ట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీని సూచిస్తుంటారు వైద్యులు. దీన్ని ‘Delayed Reconstruction’ అంటారు. అయితే దీన్ని ఎవరు చేయించుకోవాలి? ఎప్పుడు చేయించుకోవచ్చనే విషయంలో మాత్రం తుది నిర్ణయం చికిత్స చేసిన డాక్టర్‌దే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో బాధితుల వయసు, అప్పటి ఆరోగ్య స్థితి, పాటించే జీవనశైలి, కావాలనుకునే వక్షోజాల ఆకృతి.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని పరిశీలించిన తర్వాతే డాక్టర్లు సర్జరీ సూచిస్తారు.


ఈ విషయాల్లో జాగ్రత్తగా..

బ్రెస్ట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీ చేయించుకున్న తర్వాత త్వరగా కోలుకోవాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు.

✬ ఏ శస్త్ర చికిత్స తర్వాతైనా కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీ విషయంలోనూ అంతే అంటున్నారు నిపుణులు. మొదట్లో కొన్ని వారాల వరకు అలసట, నీరసం, సర్జరీ జరిగిన ప్రాంతంలో నొప్పి.. వంటివి సహజం. ఈ క్రమంలో డాక్టర్‌ ఇచ్చిన మందులు కొంత వరకు ఉపశమనాన్ని కలిగిస్తాయంటున్నారు.

✬ చికిత్స తర్వాత వాపు రాకుండా, కొత్తగా అమర్చిన రొమ్ము కణజాలానికి సపోర్ట్‌గా ఉండేందుకు డాక్టర్‌ పోస్ట్‌ సర్జికల్‌ బ్రా సూచిస్తారు. ఇక సాధారణ బ్రాలు ఎప్పట్నుంచి వాడాలో నిపుణుల్ని అడిగి తెలుసుకోవచ్చు.

✬ సర్జరీ తర్వాత శారీరకంగా, మానసికంగా దృఢంగా మారడానికి వ్యాయామాలు మేలు చేస్తాయి. అయితే బ్రెస్ట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీ తర్వాత ఎప్పట్నుంచి వ్యాయామాలు మొదలుపెట్టాలో డాక్టర్‌ని అడిగి తెలుసుకోవచ్చు. అలాగే రొమ్ములపై ఒత్తిడి పడకుండా వ్యాయామాలు చేయడం మంచిదని గుర్తు పెట్టుకోండి.

✬ సర్జరీ తర్వాత డాక్టర్‌ సలహా మేరకు ఫిజియో థెరపీకి వెళ్లచ్చు. దీనివల్ల త్వరగా కోలుకోవచ్చు.

✬ స్కిన్‌ ఫ్లాప్‌ సర్జరీ (ఇతర శరీర అవయవాల నుంచి కణజాలం సేకరించి అమర్చడం) చేయించుకున్న వారు.. కణజాలం సరిగ్గా ఎదుగుతోందా?లేదా? అనేది ఎప్పటికప్పుడు డాక్టర్‌ వద్ద పరీక్షించుకోవడం ముఖ్యం.

✬ బ్రెస్ట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీ చేయించుకున్న వారు ఇతరుల నుంచీ కొన్ని రకాల విమర్శలు, ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ అవేవీ పట్టించుకోకుండా త్వరగా కోలుకోవడంపై దృష్టి పెట్టడం మంచిదంటున్నారు నిపుణులు.

✬ అలాగే ఈ సర్జరీ నుంచి కోలుకునే క్రమంలో ఓపిక ముఖ్యం. ఎందుకంటే రొమ్ము కణజాలం పెరిగే ప్రక్రియ కాస్త నెమ్మదిగా సాగుతుంది. కాబట్టి టెన్షన్‌ పడిపోకుండా ప్రశాంతంగా ఉండడం, ఏదైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడం మంచిది.

అయితే బ్రెస్ట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీ తర్వాత తిరిగి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు అత్యంత అరుదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకవేళ వచ్చినా వ్యాధిని గుర్తించి, చికిత్స అందించే క్రమంలో కొత్తగా అమర్చిన వక్షోజాలు ఇతర సమస్యలకు దారితీయకపోవచ్చని నిపుణులు అంటున్నారు. అయినా నిర్ణీత వ్యవధుల్లో రొమ్ము పరీక్షలు చేయించుకోవడం, స్వీయ పరీక్షలు చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దని చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని