Updated : 18/05/2022 19:18 IST

Cannes 2022: రెడ్‌కార్పెట్‌పై ‘కొత్తం’దాలు!

(Photos: Instagram)

కేన్స్‌ చిత్రోత్సవంలో పాల్గొనాలనేది ప్రతి సినీ ఆర్టిస్ట్‌ కల. అయితే ఇలాంటి అరుదైన అవకాశం అతి కొద్దిమందికే దక్కుతుంది. వారిలోనూ ఏటికేడు కొత్తందాలు రెడ్‌ కార్పెట్‌పై సందడి చేస్తుంటాయి. అలా ఈ ఏడాది కొంతమంది ముద్దుగుమ్మలు తొలిసారి కేన్స్‌ వేదికపై మెరవనున్నారు. అందులోనూ ముచ్చటగా ముగ్గురు దక్షిణాది తారలు ఈ అవకాశం దక్కించుకోవడం విశేషం. మరి, ఇంతకీ వారెవరు? ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

తమన్నా

తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసింది ముంబయి బ్యూటీ తమన్నా. అయితే ఈ ముద్దుగుమ్మ ఈసారి కేన్స్‌ చిత్రోత్సవాల్లో తొలిసారి పాల్గొంది. ఈ వేడుకల ప్రారంభోత్సవాల్లో భాగంగా తనదైన స్టైల్‌లో హొయలుపోయిందీ టాలీవుడ్‌ అందం. డిజైనర్‌ ద్వయం గౌరి, నైనిక రూపొందించిన బాడీ హగ్గింగ్‌ బ్లాక్‌ గౌన్‌లో, తెలుపు రంగు ట్రెయిల్‌తో కట్టిపడేసింది తమ్మూ. ‘కేన్స్‌ వంటి ప్రతిష్టాత్మక వేడుకలో దేశం తరఫున పాల్గొనడం ఓ గొప్ప గౌరవం!’ అంటూ ట్వీట్‌ చేసిందీ మిల్కీ బ్యూటీ.


ఊర్వశీ రౌతెల

అందం, అభినయంతోనే కాదు.. తన ఫ్యాషన్‌ సెన్స్‌తోనూ ప్రపంచ సినీ ప్రేక్షకులకు దగ్గరైంది నటి ఊర్వశీ రౌతెల. అంతర్జాతీయంగా జరిగే వివిధ ఫ్యాషన్‌ వీక్స్‌లో విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తులు ధరించి హొయలుపోయే ఈ చక్కనమ్మ.. ఈసారి కేన్స్‌ వేదిక పైనా మెరుపులు మెరిపించింది. ఈ చిత్రోత్సవంలో తొలిసారి పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. టోనీ వార్డ్‌ కోచర్‌ నుంచి ఎంచుకున్న తెలుపు రంగు వన్‌ షోల్డర్‌ మల్టీ లేయర్డ్‌ టల్లే గౌన్‌లో ఏంజెల్‌లా దర్శనమిచ్చింది. తన ఫొటోల్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఈ చిన్నది.. ‘కేన్స్‌ చిత్రోత్సవంలో పాల్గొనడం ఓ కల. ఈసారి అది నెరవేరింది. థ్యాంక్యూ యూనివర్స్‌!’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది.


హెల్లీ షా

వెండితెర తారలే కాదు.. బుల్లితెర తారలకు కూడా కేన్స్‌ సాదర ఆహ్వానం పలుకుతోంది. ఈ క్రమంలోనే 2019లో హీనా ఖాన్‌ ఈ చిత్రోత్సవాల్లో తెరంగేట్రం చేయగా.. ఈసారి ఈ మహదవకాశం హెల్లీ షాను వరించింది. ఇక ప్రారంభ వేడుకల్లో భాగంగా ఈ చక్కనమ్మ.. పసుపు రంగు మినీ డ్రస్‌లో మెరుపులు మెరిపించింది. 2015లో ప్రసారమైన ‘స్వరాగిని’ అనే సీరియల్‌తో గుర్తింపు పొందిన హెల్లీ.. ఓ అంతర్జాతీయ బ్యూటీ బ్రాండ్‌ తరఫున ఈ వేడుకల్లో భాగమైంది. ఇక తన తొలి హిందీ సినిమా ‘కాయా పలట్’కు సంబంధించిన పోస్టర్‌ను ఈ వేదికగా ప్రదర్శించనుందీ బాలీవుడ్‌ బ్యూటీ.


పూజా హెగ్డే

ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘రాధే శ్యామ్‌’ సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. విభిన్న కథా చిత్రాల్ని ఎంచుకోవడమే కాదు.. పాత్రకు తగినట్లుగా నట వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ దూకుడు మీదుందీ బ్యూటీ. తనలోని ఈ ప్రతిభే ఈ ఏడాది కేన్స్‌ చిత్రోత్సవంలో పాల్గొనే అరుదైన అవకాశం ఈ చక్కనమ్మకు అందించిందని చెప్పచ్చు. ‘సినిమా, సంస్కృతీ సంప్రదాయాలు, ఫ్యాషన్‌.. వీటిని మేళవిస్తూ, సరిహద్దుల్ని చెరిపేస్తూ.. అందరినీ ఒక్కటి చేసే ప్రత్యేకమైన వేడుకే ఇది. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో పాల్గొనే అవకాశం రావడం నా అదృష్టం. ఇకముందూ ఇదే కొనసాగాలని ఆశిస్తున్నా..’ అంటూ మురిసిపోతోంది పూజ.


నయనతార

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార కూడా ఈ ఏడాది కేన్స్‌ చిత్రోత్సవాల్లో పాల్గొననున్నట్లు వార్తలొచ్చాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఆమె నుంచి వెలువడలేదు. ప్రస్తుతం ‘కాతువక్కుల రెండు కాదల్‌’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోన్న నయన్‌.. త్వరలో తన ప్రియుడు, దర్శకుడు అయిన విఘ్నేష్‌ శివన్‌తో ఏడడుగులు నడవబోతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి.

ఇక దీపికా పదుకొణె ఈసారి కేన్స్‌ జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరిస్తోంది. ఆమెతో పాటు ఈ చిత్రోత్సవంలో భాగంగా ఇప్పటికే హీనా ఖాన్‌, ఐశ్వర్యారాయ్‌లు రెడ్‌ కార్పెట్‌పై హొయలొలికించారు. మరి, వాళ్ల లుక్స్‌ని మనమూ ఓసారి చూసేద్దామా?!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని