Updated : 27/10/2021 20:59 IST

Breaking Stereotypes: ఆ యాడ్స్‌లో సీన్లు మారుతున్నాయి..!

(Photo: Screengrab)

మహిళలు బయటికెళ్లి ఉద్యోగం చేయాలి.. తిరిగి ఇంటికొచ్చాక పని భారమంతా ఆమెదే!

భర్తల విజయాలు సెలబ్రేట్‌ చేసుకునే భార్యల్ని చూస్తుంటాం.. కానీ భార్యల విజయాలు సెలబ్రేట్‌ చేసుకునే భర్తలు మాత్రం అరుదే!

కొన్ని వృత్తులు పురుషులకే పరిమితమనుకుంటాం.. అందులో మహిళలు రాణిస్తే అదో వింతగా చూస్తుంటాం..

సమాజంలో మహిళలపై ఉన్న వివక్షను నిజ జీవితంలోనే కాదు.. కొన్ని యాడ్‌ల రూపంలోనూ చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలను ఇతివృత్తంగా తీసుకొని కంపెనీలు ప్రకటనలు రూపొందించుకోవడం, ఈ నేపథ్యంలో తమ ఉత్పత్తుల్ని ప్రమోట్‌ చేసుకోవడం సర్వసాధారణమే!

అయితే ఇది మొన్నటి మాట! ఇప్పుడు సీన్‌ మారిపోయింది. మహిళలపై ఉన్న వివక్షకు చరమగీతం పాడేలా ఎన్నో యాడ్స్‌ రూపొందుతున్నాయి.. అలాంటి ప్రకటననే తాజాగా విడుదల చేసింది డాబర్‌ సంస్థ. కర్వా చౌత్‌ సందర్భంగా స్వలింగ జంటల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రోత్సహించేలా ఉన్న ఈ ప్రకటనకు సోషల్‌ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా సాధికారతకు అద్దం పట్టే కొన్ని యాడ్స్‌పై ఓ లుక్కేద్దాం..!

లెస్బియన్‌.. అయితే తప్పేంటి?!

స్వలింగ వివాహాల్ని ఇప్పటికే చాలా దేశాలు చట్టబద్ధం చేశాయి. మన దగ్గర కూడా ఇది నేరం కాదని సుప్రీం కోర్టు గతంలో తీర్పు వెలువరించినా.. ఇప్పటికీ సమాజంలో లెస్బియన్‌ జంటలపై వివక్ష అలాగే కొనసాగుతోంది. ఇలాంటి ప్రతికూల భావనను దూరం చేసేలా ఓ సరికొత్త ప్రకటనను రూపొందించింది డాబర్‌ సంస్థ. కర్వా చౌత్ పండగ నేపథ్యంలో తమ బ్యూటీ ఉత్పత్తుల్ని ప్రమోట్‌ చేస్తూనే.. తమ ప్రకటనతో అందరిలోనూ ఆలోచన రేకెత్తించింది.. ఇంతకీ యాడ్‌లో ఏముందంటే..!

ఓ లెస్బియన్‌ అమ్మాయిల జంట తమ తొలి కర్వా చౌత్‌ వేడుకలకు సిద్ధమవుతుంటుంది. ఇంతలోనే ఓ మహిళ వచ్చి వారికి కొత్త బట్టలు అందిస్తుంది. ఆ తర్వాత వాళ్లు వాటిని ధరించి.. డాబాపై వెన్నెల వెలుగుల్లో ఎదురెదురుగా నిలబడతారు. అందంగా అలంకరించిన జల్లెడలో ముందు చంద్రుడిని చూసి.. ఆ తర్వాత అదే జల్లెడలో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరికొకరు ఆహారం తినిపించుకుంటూ ఉపవాస దీక్ష విరమిస్తారు. నిజానికి ఈ ప్రకటన అటు లింగ సమానత్వాన్ని చాటుతూనే.. ఇటు స్వలింగ జంటల మధ్య ఉన్న ప్రేమానురాగాల్ని చాటుతోంది.

నిజానికి లెస్బియన్‌ జంటలపై ప్రకటనను రూపొందించడం మన దేశంలో ఇదే తొలిసారి! ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ప్రకటన చక్కటి సామాజిక సందేశాన్ని చాటుతోందని కొంతమంది ప్రశంసిస్తున్నారు. అయితే మరికొంతమందేమో ఈ ప్రకటన ఇప్పటికీ చర్మ ఛాయ తెల్లగా ఉంటేనే అందమన్న భావనను చాటేలా ఉందని; హిందూ సంస్కృతీ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు.

 

స్త్రీపురుషుల మధ్య అంతరాల్ని తుడిచేస్తూ..!

‘పురుషుల విజయాన్నే మహిళలు సెలబ్రేట్‌ చేసుకోవాలా? స్త్రీల విజయం పురుషులది కాదా?’ అంటే.. ఈ భావన తప్పంటున్నాయి క్యాడ్‌బరీ, ఒలిగ్వీ సంస్థలు. స్త్రీపురుష సమానత్వాన్ని చాటేందుకు గతంలో రూపొందించిన తమ యాడ్‌లో పలు మార్పులు చేర్పులు చేశాయి. 90వ దశకంలో వచ్చిన డెయిరీ మిల్క్‌ చాక్లెట్‌ ప్రకటనను పరిశీలిస్తే.. మైదానంలో తన బాయ్‌ఫ్రెండ్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే స్టాండ్స్‌లో ఉన్న ఓ అమ్మాయి చాక్లెట్‌ తింటూ మరీ ఆస్వాదిస్తుంటుంది. ఇక సెంచరీకి పరుగు దూరంలో ఉండగా అతడు విన్నింగ్‌ షాట్‌ కొడతాడు. ఆ వెంటనే సెక్యూరిటీని తప్పించుకుంటూ మరీ మైదానంలోకి వచ్చిన ఆ అమ్మాయి అతడిని హగ్‌ చేసుకొని చాక్లెట్‌ తినిపిస్తూ వేడుక చేసుకుంటుంది.

ఇక ఇప్పటి ప్రకటనలో పాత్రలు మారిపోతాయి. ఇక్కడ అమ్మాయి ఆటను తన బాయ్‌ఫ్రెండ్‌ ఆస్వాదిస్తాడన్నమాట! క్యాడ్‌బరీ, ఒలిగ్వీ సంయుక్తంగా రూపొందించిన ఈ ప్రకటన లింగ సమానత్వాన్ని చాటడమే కాదు.. పురుషులే ఆధిపత్యం చలాయించే రంగాల్లోనూ అమ్మాయిలు రాణిస్తున్నారన్న చక్కటి సందేశాన్ని చాటుతుంది. ఈ మధ్యే విడుదలైన ఈ ప్రకటన తెగ వైరలవడం, నెటిజన్లు సానుకూలంగా స్పందించడం తెలిసిందే!

 

మార్పు ఎంత అందంగా ఉంటుందో!

పెళ్లి చూపుల్లో అమ్మాయిల్ని ‘వంటొచ్చా, ఇంటి పనులన్నీ చేయగలదా?’ అని అత్తింటి వారు అడగడం సాధారణమే! ఒకవేళ రాదంటే మాత్రం ఆ సంబంధం క్యాన్సిల్‌ చేసుకునే కుటుంబాలే నాటి కాలంలో ఎక్కువగా ఉండేవి. కానీ కాలం మారుతోంది.. ఇప్పుడు చేసుకోబోయే అమ్మాయికి వంట రాకపోయినా వరుడికి నో ప్రాబ్లం.. పైగా యూట్యూబ్‌ ఉందిగా.. కలిసి ట్రై చేద్దాం.. అనేస్తున్నారు ఈ కాలపు పెళ్లి కొడుకులు. ఇలా ఇంటి పనుల్ని భార్యాభర్తలిద్దరూ కలిసి పంచుకుంటేనే వాళ్ల అనుబంధం పది కాలాల పాటు పదిలంగా ఉంటుందని కొన్నేళ్ల క్రితం విడుదలైన ‘బిబా’ ప్రకటన తెలియజేస్తుంది.

ఓ అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతుంటాయి. ‘మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది.. మాకు ఈ పెళ్లి ఇష్టమే’ అని వరుడి తల్లి వధువు తల్లిదండ్రులతో చెబుతుంది. అయితే వధువు తండ్రి మాత్రం.. ‘మేము ఒకసారి మీ ఇంటికి రావాలనుకుంటున్నాం.. మీ అబ్బాయి ఇంటి పనులు ఎంతమేర చేయగలుగుతాడో మా అమ్మాయి తెలుసుకోవాలనుకుంటోంది..’ అని అంటాడు. ‘వాడికి కనీసం వేడి నీళ్లు పెట్టడం కూడా రాదు.. అప్పుడప్పుడూ నూడుల్స్‌ మాత్రం వండుతాడు.. అది కూడా అవెన్‌లో!’ అంటూ నవ్వేస్తుంది వరుడి తల్లి. అంతలోనే ‘మా అమ్మాయి కేవలం నూడుల్స్‌ తినే బతకలేదు కదా!’ అంటూ బదులిస్తాడు అమ్మాయి తండ్రి. ఆ తర్వాత వరుడు అందుకొని.. ‘మీరు ఓ పది రోజుల తర్వాత మా ఇంటికి రండి.. ఆలోపు నేను వంట నేర్చుకుంటా.. అప్పుడు నేను మీకు నచ్చితే ముందుకెళ్దాం..!’ అంటాడు. అందరూ నవ్వుకోవడంతో ‘Change Is Beautiful’ అనే క్యాప్షన్‌తో యాడ్‌ ముగుస్తుంది.

ఈ ప్రకటనలో.. ఇంటి పనుల్ని భార్యాభర్తలిద్దరూ కలిసి చేసుకోవడం ఎంత ముఖ్యమో చాటుతూనే.. ‘ఆడపిల్ల కదా ఏదో ఒక సంబంధం అని చేతులు దులిపేసుకోకుండా.. అత్తారింట్లో తను సుఖసంతోషాలతో ఉండాల’ని కోరుకునే కన్న తండ్రి ప్రేమ కనిపిస్తుంది.

 

క్షవరమూ చేయగలం!

కొన్ని కులవృత్తులు పురుషులకు మాత్రమే సొంతం అన్న భావన నేటి సమాజంలో ఉంది. క్షురకులు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.. సాధారణంగా పురుషుల క్షౌరశాలల్లో మగవారే కటింగ్‌ చేయడం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన జ్యోతి, నేహ అనే ఇద్దరు అక్కచెల్లెళ్లు తమ తండ్రి ఆరోగ్య రీత్యా వాళ్ల కులవృత్తిని స్వీకరించి కుటుంబానికి పెద్ద దిక్కుగా మారారు. ఇలా పురుషాధిపత్యం ఉన్న ఈ రంగంలోకి ప్రవేశించి మూసధోరణుల్ని బద్దలుకొట్టిన ఈ సోదరీమణుల కథను ఆధారంగా చేసుకొని 2019లో ఓ స్ఫూర్తిదాయక ప్రకటనను రూపొందించింది జిల్లెట్‌ ఇండియా సంస్థ. ఇందులో భాగంగా..

ఒక బాలుడు తన చుట్టూ జరిగే కొన్ని సంఘటనల్ని పరిశీలిస్తాడు. ఆటలు, చదువుకోవడం.. వంటివన్నీ అబ్బాయిలు చేయడం; ఇక అమ్మాయిలేమో ఇంటి పనులు, వంట పనులకు పరిమితమవడం.. వంటివన్నీ దగ్గర్నుంచి గమనిస్తాడు. అయితే ఓరోజు తన తండ్రితో కలిసి క్షౌరశాలకు వెళ్తాడు. అక్కడ ఇద్దరు అమ్మాయిలు క్షవరం చేయడం చూసి ఆశ్చర్యపోతాడు. ‘నాన్నా! అమ్మాయెలా షేవ్‌ చేయగలుగుతుంది.. ఇది అబ్బాయిలు చేసే పని కదా?’ అన్నట్లుగా మాట్లాడతాడు. అయితే అందుకు ఆ పిల్లాడి తండ్రి బదులిస్తూ.. ‘షేవ్ చేసే రేజర్‌కి ఆడ, మగ తేడా ఎలా తెలుస్తుంది..? చేయించుకుందాం.. నువ్వు షేవ్ చేయమ్మా..' అనడంతో యాడ్ ముగుస్తుంది. రంగమేదైనా ఆడపిల్లల్ని ప్రోత్సహించాలన్న స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించిన ఈ ప్రకటన అప్పట్లో తెగ వైరలైంది.

 

కొత్తగా ఆలోచిద్దాం!

పెళ్లయ్యాక అమ్మాయిల ఇంటి పేరు మారిపోవడం, ఆ తదుపరి సంతానానికీ అదే ఇంటిపేరు కొనసాగడం.. నాటి కాలం నుంచే వస్తోన్న సంప్రదాయం. అయితే స్త్రీపురుష సమానత్వాన్ని చాటే ఉద్దేశంతో ‘Nayi Soch (కొత్తగా ఆలోచిద్దాం)’ అంటూ 2016లో ఓ ప్రకటనను రూపొందించింది స్టార్‌ప్లస్‌ టీవీ ఛానల్‌. ఇందుకోసం క్రికెటర్లు ధోనీ, అజంక్య రహానే, విరాట్ కోహ్లీలు ముఖ్య పాత్రధారులుగా ఈ యాడ్‌ రూపొందించింది.

ప్రెస్‌ మీట్‌లో భాగంగా ధోనీ వేదిక పైకి వస్తుంటాడు. అతని జెర్సీపై ‘Dhoni’ కి బదులు ‘Devki’ అని రాసుంటుంది. అది గమనించిన మీడియా వాళ్లు.. ‘మీ జెర్సీపై ఉన్న పేరుకి అర్థమేంటి?’ అని అడుగుతారు. ‘అది నా తల్లి పేరు’ అని బదులిస్తాడు మహీ. ‘మీరు అలా రాసుకోవడం వెనక ఏదైనా ప్రత్యేక కారణముందా?’ అని మళ్లీ ప్రశ్నిస్తారు. అందుకు స్పందించిన ధోనీ.. ‘ఎన్నో ఏళ్లుగా మా నాన్న పేరే జెర్సీపై ఉండేది.. అప్పుడు అడగలేదే ఈ ప్రశ్న?’ అని కౌంటరిస్తాడు. ‘Son Of DEVKI’ అని స్క్రీన్‌ మీద క్యాప్షన్‌ రావడంతో యాడ్‌ ముగుస్తుంది. ఇదే విధంగా రహానే, విరాట్లతోనూ విడివిడిగా ప్రకటనల్ని రూపొందించిందీ టీవీ ఛానల్‌. స్త్రీపురుష సమానత్వానికి అద్దం పట్టే ఈ ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది.

వీటితో పాటు ‘షేర్‌ ది లోడ్‌’ పేరుతో ఏరియల్‌ రూపొందించిన ప్రకటన, ఆదివారం ఆడవాళ్లకు సెలవు కావాలంటూ కలర్స్‌ టీవీ రూపొందించిన ‘#SundayIsHerHoliday’ యాడ్‌.. వంటివన్నీ ఈ సమాజంలో ఆడవాళ్లపై ఉన్న వివక్షను ఎత్తిచూపుతూ మహిళా సాధికారత దిశగా తమ వంతు పాత్రను పోషించాయి.

నిజానికి ఇలా ఎన్ని ప్రకటనలు రూపొందించినా, ఎంతోమంది మహిళలు వివిధ రంగాల్లో గ్లాస్‌ సీలింగ్‌ని బద్దలుకొడుతున్నా.. ఇప్పటికీ కొన్ని అంశాల్లో ఈ సమాజం ఆడవాళ్లను చూసే దృష్టి కోణంలో మాత్రం మార్పు రావట్లేదనేది అక్షర సత్యం. మరి ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఏం చేయాలో మీ అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలు పంచుకోండి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని