‘మేరీ జిందగీ’.. ఈ రాక్ బ్యాండ్ రూటే సెపరేటు!

ఇంట్లో గృహ హింస, గడప దాటితే అత్యాచారాలు-యాసిడ్‌ దాడులు, పని ప్రదేశంలో అసమానతలు-అవమానాలు.. ఇప్పటికీ ఇలాంటి సమస్యలతో నలిగిపోతోన్న మహిళలెందరో! ఇక వాటిలో వెలుగులోకొచ్చేవి కొన్నైతే.. చీకట్లోనే కనుమరుగయ్యేవి లెక్కకు....

Published : 30 Jun 2023 17:19 IST

(Photos: Instagram)

ఇంట్లో గృహ హింస, గడప దాటితే అత్యాచారాలు-యాసిడ్‌ దాడులు, పని ప్రదేశంలో అసమానతలు-అవమానాలు.. ఇప్పటికీ ఇలాంటి సమస్యలతో నలిగిపోతోన్న మహిళలెందరో! ఇక వాటిలో వెలుగులోకొచ్చేవి కొన్నైతే.. చీకట్లోనే కనుమరుగయ్యేవి లెక్కకు మిక్కిలి! అలాంటి బాధిత మహిళల ఆత్మఘోషను పాటల రూపంలో వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు ఐదుగురు మహిళలు. మహిళా శ్రేయస్సే లక్ష్యంగా ఓ రాక్‌ బ్యాండ్‌ను నెలకొల్పిన వీరు.. దేశవ్యాప్తంగా ప్రదర్శనలిస్తూ మహిళా సమస్యలపై అందరిలో చైతన్యం కలిగిస్తున్నారు. పాటలతోనే కాదు.. సంప్రదాయ చీరకట్టుతోనూ ఆకట్టుకుంటూ.. ప్రతి ఒక్కరిలో ఆలోచనల్ని రేకెత్తిస్తోన్న ఈ ఆల్‌-విమెన్‌ రాక్‌బ్యాండ్‌ ప్రత్యేకతలు మరెన్నో!

అనుభవం ఆలోచింపజేసింది!

అనుభవాలే ఆలోచనల్ని రేకెత్తిస్తాయంటారు. మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు కూడా అప్పుడప్పుడూ మనల్ని ఆలోచనల్లో పడేస్తుంటాయి. అయితే వాటిని చూసీ చూడనట్లుగా వదిలేసే వారే ఎక్కువ! కానీ లక్నోకు చెందిన డాక్టర్‌ జయా తివారీ అలా అనుకోలేదు. సంగీతంలో పీహెచ్‌డీ చేసిన ఆమె.. గతంలో కొన్నేళ్ల పాటు రేడియో జాకీగా పని చేసింది. ఈ క్రమంలో ఇంటా, బయటా, పని ప్రదేశంలో ఎంతోమంది మహిళలు ఎదుర్కొన్న వివిధ రకాల సమస్యల్ని దగ్గర్నుంచి గమనించింది. వీటి గురించి అందరికీ తెలియజేయాలనుకుంది.. మహిళా సమస్యలపై అందరిలో చైతన్యం తీసుకొచ్చి.. ఇకనైనా వీటికి చరమగీతం పాడేలా తన వంతు ప్రయత్నం చేయాలనుకుంది. ఈ ఆలోచనే 2010లో ‘మేరీ జిందగీ’ అనే రాక్‌ బ్యాండ్‌కు తెరతీసింది.

సంగీతమే ఎందుకంటే..?

దేశంలోనే తొలి ఆల్‌-విమెన్‌ రాక్‌ బ్యాండ్‌గా పేరుగాంచిన ఈ సంగీత బృందాన్ని జయ ప్రారంభించినా.. అందులో మరో నలుగురు మహిళలు చేరారు. ప్రస్తుతం జయతో పాటు పుర్వీ మాలవీయ, నీహారికా దుబే, మేఘనా శ్రీవాస్తవ, సౌభాగ్యా దీక్షిత్‌.. ఇలా మొత్తం ఐదుగురు మహిళలు ఈ సంగీత బృందంలో ఉన్నారు. వీరందరూ ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. తమ తమ జీవితాల్లో మహిళా సమస్యల్ని దగ్గర్నుంచి చూశారు. అయితే ఇలాంటి సమస్యలపై అవగాహన కల్పించడానికి మాటల కంటే పాటల రూపంలోనే సందేశాన్ని ఎక్కువమందికి చేయచ్చంటోంది బ్యాండ్‌ నాయకురాలు జయ.

‘మా బ్యాండ్‌లో ఉన్న ఐదుగురం మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారమే! మా అందరికీ సంగీతమంటే ఇష్టం.. అటు మా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్ని బ్యాలన్స్‌ చేస్తూనే.. ఇటు మహిళా సమస్యలపై గళమెత్తుతున్నాం. మల్టీ టాస్కింగ్‌ మా అందరి జీవితాల్లో భాగం. మన సమాజంలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. లైంగిక వేధింపులు, గృహ హింస, లింగ అసమాతనలు, బాలికల్ని విద్యకు దూరం చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ చరిత్రే అవుతుంది. అయితే వాటిని మాటల రూపంలో చెప్పడం కంటే పాటల ద్వారా వినిపిస్తే.. మరింతమందికి చేరువవుతాయి. ఎందుకంటే సంగీతానికి ఆలోచింపజేసే శక్తి ఉందని మా నమ్మకం..’ అంటూ చెప్పుకొచ్చారామె.

మా దుస్తులూ మాట్లాడతాయ్!

సాధారణంగా రాక్‌ బ్యాండ్‌ అంటే.. మిరుమిట్లు గొలిపేలా, తళుకుబెళుకులతో కూడిన మోడ్రన్‌ వస్త్రధారణే మన మదిలో మెదులుతుంది. కానీ మేరీ జిందగీ రాక్‌ బ్యాండ్‌ అందుకు పూర్తి భిన్నం. గులాబీ-నలుపు రంగులు కలగలిసిన సంప్రదాయ చీరకట్టుతోనే ఈ సంగీత బృందం ప్రదర్శనలిస్తుంటుంది. మా పాటలే కాదు.. మా ట్రెడిషనల్‌ యూనిఫాం కూడా మహిళల్ని ఆలోచింపజేసేలా ఉండాలనేదే తమ ముఖ్యోద్దేశం అంటున్నారు జయ.

‘మోడ్రన్‌ దుస్తులు ధరించి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం మా ఉద్దేశం కాదు.. కుప్పలు తెప్పలుగా డబ్బు సంపాదించాలన్న అత్యాశా మాకు లేదు. ఈ సమాజంలో వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతోన్న మహిళల సమస్యల్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. మమ్మల్ని ఓ సాధారణ గృహిణుల్లా గుర్తిస్తే చాలు. మా ఈ ప్రయత్నంతో సమాజం మహిళల్ని చూసే దృష్టి కోణంలో మార్పు తీసుకొస్తే మేం సఫలమైనట్లే! మా పాటలతోనే కాదు.. దుస్తులతోనూ మహిళల్లో సానుకూల ఆలోచనలు రేకెత్తించేలా, తమ సమస్యల్ని తాము స్వయంగా ఎదుర్కొనే ధైర్యాన్ని అందిస్తే చాలు..’ అంటున్నారామె.

పాట, ట్యూన్‌.. ఆమెదే!

మహిళలే తోటి మహిళల్ని చైతన్యవంతుల్ని చేయగలరన్న స్ఫూర్తితో ముందుకు సాగుతోన్న ఈ ‘మేరీ జిందగీ’ బ్యాండ్.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వందలాది ప్రదర్శనలిచ్చింది. 50 నగరాల్లో పర్యటించిన ఈ బృందం.. 350కి పైగా సంగీత ప్రదర్శనలిచ్చింది. ఇందులో భాగంగా.. పలు సంగీతోత్సవాలు, కాలేజీ ఫెస్ట్‌లు, ప్రభుత్వ కార్యక్రమాలు, స్కూల్‌ ఫంక్షన్లు.. ఇలా వేర్వేరు వేదికలపై తమ సంగీతంతో బాలికల్ని/మహిళల్ని ఆయా అంశాలపై ఆలోచింపజేస్తున్నారీ రాకింగ్‌ విమెన్‌. ఇక బ్యాండ్‌ నాయకురాలు జయ తాము పాడే పాటలన్నింటికీ స్వయంగా బాణీలు సమకూర్చడం, సంగీతం అందించడం.. వంటివి చేస్తారు. మిగతా బృంద సభ్యులు వివిధ రకాల సంగీత పరికరాల్ని వాయిస్తూ.. అందరూ కలిసి పాటను ఆలపిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని