Falguni: మిల్లెట్స్ పాట ఆలోచన.. మోదీని కలిసినప్పుడు అలా..!

శ్రావ్యమైన సంగీతానికి రాళ్లైనా కరుగుతాయంటారు.. పాటలు మనసుకు ఆహ్లాదాన్ని పంచడమే కాదు.. పలు అంశాలపై అందరిలో అవగాహనా పెంచుతాయి.. అలాంటి ఓ చక్కటి సందేశాత్మక పాటకు కర్త, కర్మ, క్రియ.. అన్నీ తానై ప్రధాని మోదీ మన్ననలందుకున్నారు....

Updated : 17 Jun 2023 13:51 IST

(Photos: Instagram)

శ్రావ్యమైన సంగీతానికి రాళ్లైనా కరుగుతాయంటారు.. పాటలు మనసుకు ఆహ్లాదాన్ని పంచడమే కాదు.. పలు అంశాలపై అందరిలో అవగాహనా పెంచుతాయి.. అలాంటి ఓ చక్కటి సందేశాత్మక పాటకు కర్త, కర్మ, క్రియ.. అన్నీ తానై ప్రధాని మోదీ మన్ననలందుకున్నారు ఇండియన్‌-అమెరికన్‌ గాయని ఫల్గుణీ షా. ఈ ఏడాదిని ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా ప్రకటించిన నేపథ్యంలో.. ప్రధాని కోరిక మేరకు ఆమె తన భర్త గౌరవ్‌ షాతో కలిసి మిల్లెట్స్‌పై ఓ పాట రాసి పాడారు. ఈ పాటలో మోదీజీ కూడా గీత రచనతో పాటు గాత్ర సహకారాన్నీ అందించడం విశేషం.

చిన్నారుల్లో స్ఫూర్తి నింపే పాటలు రాస్తూ, పాడుతూ.. ఇప్పటికే రెండు గ్రామీ పురస్కారాల్ని తన ఖాతాలో వేసుకున్న ఫల్గుణి... భారతీయ సంగీత శైలికి ఆధునిక శైలిని జత చేస్తూ ఆల్బమ్స్‌ రూపొందించడంలో దిట్ట. మరి, తాను ప్రధానితో కలిసి రాసి, పాడిన మిల్లెట్స్‌ పాట తాజాగా విడుదలైన నేపథ్యంలో ఈ పాటల పూదోట సంగీత ప్రయాణం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

మిల్లెట్స్‌ పాట.. ఆలోచన అలా!

వివిధ అంశాలపై సందేశాత్మక పాటలు రాస్తూ, చిన్నారుల్లో స్ఫూర్తి నింపేలా పాటలు పాడుతూ.. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు ఫల్గుణి. గతేడాది రెండో గ్రామీ అవార్డును అందుకొని.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్రకెక్కిన ఆమె.. తాజాగా మరో సందేశాత్మక పాటతో మన ముందుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకలి సమస్యను నిర్మూలించేందుకు.. ఐక్యరాజ్య సమితి ఈ ఏడాదిని ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా ప్రకటించిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే చిరుధాన్యాల ప్రాముఖ్యం, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను బాణీలుగా సమకూర్చుకొని ‘Abundance of Millets’ పేరుతో ఓ చక్కటి పాట రాశారు ఫల్గుణి.. ఇందులో తన భర్త గౌరవ్‌ షాతో పాటు ప్రధాని మోదీ సహకారం కూడా ఉందంటున్నారామె.

‘గ్రామీ అవార్డు గెలుచుకున్నాక కొన్నాళ్లకు ముంబయి వచ్చాను. అదే సమయంలో దిల్లీకి వెళ్లి మోదీజీని కలిశా. అప్పుడే మిల్లెట్స్‌పై ఓ పాట రాయమని ఆయన సూచించారు. ఈ క్రమంలో ఆయన్నీ సహకరించాల్సిందిగా కోరాను. అందుకు మోదీజీ ఒప్పుకోవడంతో.. నేను, మా వారు గౌరవ్‌, మోదీజీ.. ముగ్గురం కలిసి ఈ పాటను రాశాం.. ఈ క్రమంలో కాస్త నెర్వస్‌గా ఫీలయ్యా. అయితే తాజాగా విడుదలైన ఈ పాట కోసం మోదీజీ తన గాత్రాన్ని కూడా అరువిచ్చారు. పాట మధ్యలో ఆయన బాణీలు, గాత్రాన్ని మీరు వినచ్చు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌.. ఈ రెండు భాషల్లోనే అందుబాటులో ఉన్న ఈ పాటను.. త్వరలోనే ఇతర ప్రాంతీయ భాషల్లోకీ అనువదించి.. ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల ప్రాముఖ్యాన్ని తెలియజేయాలనుకుంటున్నా..’ అంటూ చెప్పుకొచ్చారు ఫల్గుణి.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మోదీ.. ఫల్గుణి దంపతులతో కలిసి ఈ పాటను ఆవిష్కరించారు.

మూడేళ్ల వయసు నుంచే..!

ఫల్గుణి సొంతూరు ముంబయి. ఆమె కుటుంబంలో అందరూ సంగీతంలో ప్రవేశం ఉన్న వారే! తన తల్లి, బామ్మ.. ఇద్దరూ సంగీత కళాకారులు కావడం, సోదరుడు తబలా వాయిద్యకారుడు కావడంతో.. వాళ్ల స్ఫూర్తితో ఫల్గుణి కూడా పాటలపై ప్రేమ పెంచుకుంది. ఇలా మూడేళ్ల వయసు నుంచే సంగీతంలో ఓనమాలు నేర్చుకోవడం ప్రారంభించిందామె. ఈ క్రమంలోనే ‘జైపూర్‌ ఘరానా’ సంగీత సంప్రదాయాన్ని ఒంటబట్టించుకుంది. ఇందులో భాగంగానే రోజుకు 16 గంటలు సాధన చేసేది. ఆపై దిగ్గజ సారంగి విద్వాంసుడు ఉస్తాద్‌ సుల్తాన్‌ ఖాన్‌ దగ్గర శిక్షణ తీసుకుంది. బనారసీ స్టైల్‌ టుమ్రి అనే భారతీయ సంగీత స్వరశైలిలో ఆమె దిట్ట. ఇలా స్వదేశంలో సంగీతాన్ని అవపోసన పట్టిన ఫల్గుణి.. 2000లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది.

అలా పేరుప్రఖ్యాతులు!

అమెరికాకు వెళ్లిన వెంటనే ఇండో-అమెరికన్‌ బ్యాండ్‌ ‘కరిష్మా’లో ప్రధాన గాయకురాలిగా చేరింది ఫల్గుణి. ఆపై ఇండో-అమెరికన్‌ సంగీత కళాకారుడు కర్ష్‌ కాలేను కలుసుకున్న ఆమె.. ఆయన ప్రోత్సాహంతో అక్కడి యూనివర్సిటీలు, క్లబ్స్‌, ఫెస్టివల్‌ సర్క్యూట్‌ (వినోద రంగానికి చెందిన ఈవెంట్లు).. తదితర వేదికలపై తన గాత్రంతో సంగీత ప్రియుల్ని ఓలలాడించింది. ఆపై రెండేళ్ల పాటు బోస్టన్‌లోని ‘Tufts University’లో భారతీయ సంగీత విభాగంలో విజిటింగ్‌ లెక్చరర్‌గా విధులు నిర్వర్తించిన ఆమె.. ఆ తర్వాత న్యూయార్క్‌ వెళ్లిపోయింది. అక్కడే ‘Falu Music’ పేరుతో తన సొంత బ్యాండ్‌ను ప్రారంభించింది. ఈ వేదికగానే న్యూయార్క్‌ అంతటా సంగీత ప్రదర్శనలివ్వడంతో అనతి కాలంలోనే ఆమె పేరు మార్మోగిపోయింది. క్రమక్రమంగా భారతీయ సంగీత శైలికి ఆధునిక శైలిని జత చేస్తూ ఆమె రూపొందించిన ఆల్బమ్స్‌ ప్రపంచవ్యాప్తంగా ఆమె సంగీత ప్రతిభకు పట్టం కట్టాయని చెప్పచ్చు.

పిల్లల కోసం ప్రత్యేక ఆల్బమ్స్!

2007లో ఆగ్నేయాసియా జానపదాలతో పాశ్చాత్య సంగీతాన్ని మేళవించి.. తన సొంత పేరుతో సోలో ఆల్బమ్‌ను రూపొందించారు ఫల్గుణి. ఇది అంతర్జాతీయంగా ఆమెకు బోలెడంత పేరు తీసుకొచ్చింది. తన సంగీతంతో ఎక్కువగా పిల్లల్లో స్ఫూర్తి నింపేలా ఆల్బమ్స్‌ రూపొందిస్తుంటారామె.

‘పిల్లలు పాటల రూపంలో చాలా విషయాలు నేర్చుకుంటారు. భాష, జంతువులు, ఆహార పదార్థాలు, వంటకాలు, వివిధ దేశాల సంస్కృతులు - సంప్రదాయాలు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌.. ఇవన్నీ వాళ్లకు సరళంగా అర్థం కావాలంటే అందుకు పాటే వారధి. దీంతో వాళ్లు అటు సంగీతాన్ని ఎంజాయ్‌ చేస్తూనే ఇటు వివిధ విషయాల్ని ఒంటబట్టించుకుంటారు..’ అంటారు ఫల్గుణి. ఆల్బమ్స్‌తో పాటు పలు సంగీత ప్రాజెక్టులు, లైవ్‌ షోలలో భాగమవుతూ బిజీగా గడిపే ఆమె.. 2009లో అప్పటి యూఎస్‌ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దంపతుల సమక్షంలో ఏఆర్‌ రెహమాన్‌తో కలిసి సంగీత ప్రదర్శన ఇచ్చారు. రెహమాన్‌ని తన స్ఫూర్తిగా భావించే ఆమె.. ఆయనతోనే కలిసి లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇవ్వడం జీవితంలోనే మర్చిపోలేని అనుభూతి అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

రెండుసార్లు దక్కిన ‘గ్రామీ’!

అంతర్జాతీయంగా సంగీత ప్రతిభకు పట్టం కట్టే ప్రతిష్టాత్మక గ్రామీ పురస్కారం గెలుచుకోవడం సంగీత కళాకారులకు ఓ స్వప్నం లాంటిది! తన అద్భుతమైన గాత్రం, ప్రతిభతో అలాంటి అరుదైన ఘనతను ఒకటి కాదు.. రెండుసార్లు సాధించారు ఫల్గుణి. 2018లో ‘ఫాలూస్‌ బజార్‌’ పేరుతో ఆమె రూపొందించిన ఆల్బమ్‌ గ్రామీలో మొదటిసారి పోటీపడింది. తన నాలుగేళ్ల కొడుకు నిషాద్‌ స్ఫూర్తితో.. భారతీయ సంప్రదాయాలు, ఇండియన్‌ నేటివిటీ రంగరించి.. 12 పాటలతో హిందీ, ఇంగ్లిష్‌, గుజరాతీ భాషల్లో విడుదల చేసిన ఈ ఆల్బమ్‌కు 2019లో తొలి గ్రామీ పురస్కారం దక్కింది. ఇక గతేడాది.. ‘ఎ కలర్‌ఫుల్‌ వరల్డ్‌’ పేరుతో ఆమె రూపొందించిన పిల్లల ఆల్బమ్‌కి గాను ‘ఉత్తమ పిల్లల మ్యూజిక్‌ ఆల్బమ్‌’ విభాగంలో రెండో గ్రామీ గెలుచుకున్నారు ఫల్గుణి. ఇలా రెండుసార్లు గ్రామీ అందుకున్న తొలి భారతీయురాలిగా చరిత్రకెక్కారీ ముంబయి సింగర్.

పాటే మంత్రం!

పాట కేవలం వినోదాన్ని అందించడమే కాదు.. మానసిక ప్రశాంతతను అందించే ఔషధం అంటారు ఫల్గుణి. ‘సంగీతం హద్దుల్ని చెరిపేస్తుంది. పాట కేవలం వినోదానికే కాదు.. మానసిక, శారీరక సమస్యల్ని నయం చేసే గొప్ప ఔషధం. అంతేకాదు.. ఇదే మనుషుల మధ్య దూరాన్ని చెరిపేసి వాళ్లను ఒక్కటి చేస్తుందనేది నా నమ్మకం. నాకు ముంబయితోనే కాదు.. సూరత్‌తోనూ సంబంధాలున్నాయి. ఇప్పటికీ మా కుటుంబ సభ్యులు అక్కడున్నారు. అవకాశం వస్తే గుజరాతీలో పాటలు పాడాలని ఉవ్విళ్లూరుతున్నా. అది నా చిరకాల స్వప్నం కూడా!’ అంటారీ గ్రామీ విన్నర్.

తన సంగీత ప్రతిభకు గుర్తింపుగా న్యూయార్క్‌లోని ‘కార్నేజ్‌ హాల్’ 2006లో ఫల్గుణిని భారతీయ సంగీత రాయబారిగా నియమించింది. అంతేకాదు.. ఆమె సంగీతాన్ని ‘అద్వితీయం.. అసాధారణం..’ అంటూ అక్కడి బిల్‌బోర్డులపై ప్రదర్శించడం ఆమెకు దక్కిన మరో గొప్ప గౌరవం! ఇక మరోవైపు టైమ్‌ పత్రిక విడుదల చేసిన ‘ప్రపంచంలోని వందమంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల’ జాబితాలోనూ చోటు దక్కించుకున్నారీ మ్యూజిక్‌ లవర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని