Asian Games : అమ్మలు.. ఆటాడేస్తున్నారు!

అమ్మయ్యాక అవకాశాలు రావనుకుంటారు చాలామంది. ఒకవేళ వచ్చినా వాటిని అందిపుచ్చుకునే తీరిక, ఓపిక ఉండదనుకుంటారు.. అలాంటి ఆలోచనను తుడిచిపెట్టేస్తున్నారు కొందరు స్పోర్ట్స్‌ మామ్స్‌.

Published : 21 Sep 2023 12:16 IST

(Photos: Instagram)

అమ్మయ్యాక అవకాశాలు రావనుకుంటారు చాలామంది. ఒకవేళ వచ్చినా వాటిని అందిపుచ్చుకునే తీరిక, ఓపిక ఉండదనుకుంటారు.. అలాంటి ఆలోచనను తుడిచిపెట్టేస్తున్నారు కొందరు స్పోర్ట్స్‌ మామ్స్‌. తల్లయ్యాక నెలల వ్యవధిలోనే తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడమే కాదు.. ఆటకు కావాల్సిన ఫిట్‌నెస్‌ను, క్రీడా నైపుణ్యాల్ని మెరుగుపరచుకొని మరీ పతకాలు కొల్లగొడుతున్నారు. ఇక ఇప్పుడు ఆసియా క్రీడలకూ సిద్ధమైపోయారు. మరి, ఓవైపు అమ్మగా పిల్లల బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే.. మరోవైపు ఈ ఏటి ఆసియా క్రీడల్లో సత్తా చాటబోతోన్న ఆ సూపర్‌ మామ్స్‌ ఎవరో తెలుసుకుందాం రండి..


‘పసిడి’తో పునరాగమనం!

స్క్వాష్‌ క్రీడ అనగానే మనకు మొదట గుర్తొచ్చే పేరు దీపికా పల్లికల్‌దే. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఈ ఆటలో దేశానికి పతకాల పంట పండించిన ఘనత ఆమె సొంతం. 2015లో క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ను వివాహమాడిన దీపిక.. 2021లో కవల అబ్బాయిలకు జన్మనిచ్చింది. తిరిగి ఆరు నెలల్లోపే కోర్టులోకి అడుగుపెట్టిన ఆమె.. ‘వరల్డ్‌ డబుల్స్‌ ఛాంపియన్‌షిప్‌’లో మిక్స్‌డ్‌, మహిళల విభాగాల్లో రెండు పసిడి పతకాలు కొల్లగొట్టింది. ఆపై జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ కాంస్యంతో సత్తా చాటింది. అయితే అమ్మగా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే క్రమంలో తన మనసులోని స్వీయ సందేహాలన్నీ అధిగమించగలిగానంటే అందుకు కుటుంబ సభ్యుల మద్దతు, ప్రోత్సాహమే కారణమంటోందీ స్క్వాష్‌ స్టార్‌.

‘నేనెప్పుడూ మానసికంగా దృఢంగా ఉంటాను. నా లక్ష్యాల పట్ల స్పష్టమైన అవగాహనతో ఉంటాను. ప్రతి మ్యాచ్‌ గెలవాలన్న పట్టుదలతోనే కోర్టులోకి అడుగుపెడతాను. అమ్మయ్యాకా ఇదే పాజిటివిటీతో ముందుకు సాగాను. అందుకు నిదర్శనమే నేను సాధించిన విజయాలు! అయితే పిల్లలు పుట్టాకా నిండైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నానంటే.. అందుకు కారణం మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే! మా అమ్మానాన్నలు, నా భర్త దినేష్‌, వాళ్ల కుటుంబ సభ్యులు అడుగడుగునా నా వెన్నుతట్టారు. ఒకానొక సమయంలో నా పిల్లలిద్దరినీ వదిలి వెళ్లడం కష్టంగా అనిపించేది. దీనికి తోడు.. కొంతమంది ‘ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోవచ్చుగా!’ అనడంతో నా సామర్థ్యంపై నాకే సందేహాలు రేకెత్తాయి. మా కుటుంబ సభ్యుల వల్లే ఇవన్నీ అధిగమించగలిగాను. ఏదేమైనా.. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నా పిల్లలు పెద్దయ్యాక.. నేను చేసిన ఈ త్యాగాల్ని వారు తప్పకుండా అర్థం చేసుకుంటారు. దేశానికి ప్రాతినిథ్యం వహించినందుకు నన్ను చూసి గర్వపడతారు. అమ్మగా అంతకంటే ఆనందం మరొకటి ఏముంటుంది?!’ అంటూ మురిసిపోతోంది దీపిక. అమ్మయ్యాక నెలల వ్యవధిలోనే తిరిగి ఫిట్‌గా మారి కోర్టులోకి అడుగుపెట్టిన ఆమె.. ఆసియా క్రీడలకూ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యానంటోంది.


ఆటతోనే ఆ ఒత్తిడిని అధిగమించా!

అమ్మయ్యాక ప్రసవానంతర ఒత్తిడి ఎదురవడం సహజం. అయితే దీన్ని అధిగమించడానికే కూతురు పుట్టిన మూడు నెలలకే తిరిగి ఆటను సాధన చేయడం ప్రారంభించానంటోంది ప్రముఖ చెస్‌ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక. గతేడాది తొమ్మిది నెలల గర్భంతోనూ ‘చెస్‌ ఒలింపియాడ్‌’లో పాల్గొని భారత మహిళల జట్టు కాంస్య పతకం గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆమె.. త్వరలో జరగబోయే ఆసియా క్రీడల్లోనూ సత్తా చాటడానికి సిద్ధమయ్యానంటోంది.

‘నిజానికి ఆసియా క్రీడలు గతేడాదే జరగాల్సి ఉంది. కానీ కొవిడ్‌ కారణంగా అప్పుడు అవి వాయిదా పడ్డాయి. అలా జరగమే మంచిదైంది. లేదంటే నేను అందులో పాల్గొనేదాన్ని కాదేమో! త్వరలో ప్రారంభం కానున్న ఈ క్రీడల కోసం గత కొన్ని రోజుల ముందు నుంచే సిద్ధమవుతున్నా. పాప కోసం తల్లిపాలను ఫ్రీజ్‌ చేసే పద్ధతుల గురించి తెలుసుకున్నా. నాకు సిజేరియన్‌ డెలివరీ అయింది. దీంతో ముందు కొన్ని రోజులు శారీరకంగా, మానసికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నా. కానీ మానసిక దృఢత్వం, స్థిరత్వాన్ని తిరిగి పొందడానికి, ఏకాగ్రత సొంతం చేసుకోవడానికి ప్రసవమయ్యాక మూడు నెలలకే తిరిగి చెస్‌ సాధన చేయడం ప్రారంభించా. ఇది ప్రసవానంతర ఒత్తిడిని ఎదుర్కోవడంలోనూ నాకు సహాయపడింది. అలాగే అమ్మగా ఓవైపు పాప బాధ్యతలు చూస్తూనే.. మరోవైపు కెరీర్‌నూ సమన్వయం చేయడమెలాగో నేర్చుకున్నా.. ప్రస్తుతం ఈ రెండింటినీ బ్యాలన్స్ చేయగలుగుతున్నానంటే అందుకు మా కుటుంబ సభ్యుల సహకారం, ప్రోత్సాహమే కారణం..’! అంటూ చెబుతోంది హారిక. భవిష్యత్తులో తన కూతురినీ ఆమెకు ఇష్టమైన క్రీడాంశంలో ప్రోత్సహిస్తానంటూ క్రీడలపై తనకున్న మక్కువను మరోసారి చాటుకుందీ చెస్‌ క్వీన్‌.


నాలుగ్గంటలు సాధన చేసేదాన్ని!

పదిహేనేళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ సాధించి.. అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన అమ్మాయిగా చరిత్రకెక్కింది హైదరాబాదీ చెస్‌ క్రీడాకారిణి కోనేరు హంపి. 2600 ఎలో రేటింగ్‌ మార్క్‌ను అధిగమించిన రెండో మహిళా ప్లేయర్‌గానూ ఆమెకు పేరుంది. ఇలా తన కెరీర్‌లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజయాలు సాధిస్తూ.. ప్రపంచంలోనే మేటి చెస్‌ క్రీడాకారిణుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్న హంపి.. 2017లో అహనా అనే పాపకు జన్మనిచ్చింది. ఆపై రెండేళ్ల పాటు ఆటకు దూరంగా ఉన్న ఈ చెస్‌ క్వీన్‌.. 2019లో జరిగిన ‘మహిళల ప్రపంచ ర్యాపిడ్‌ ఛాంపియన్‌షిప్‌’లో విజయం సాధించి.. పసిడి పతకంతోనే తిరిగి ఆటలోకి పునరాగమనం చేసింది. ఆపై ‘2019-2021 ఎడిషన్‌ ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రి’ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది హంపి. అయితే అమ్మయ్యాకా ఆటలో రాణించగలుగుతున్నానంటే అందుకు ఆటపై తనకున్న అంకితభావమే కాదు.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉందంటోందామె.

‘చిన్నతనం నుంచి చెస్‌ లోకంగా పెరిగిన అమ్మాయిని నేను. అలాంటిది గర్భిణిగా ఉన్న సమయంలో నాలుగో నెలలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కొన్ని నెలల పాటు చెస్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అప్పటిదాకా రోజుకు తొమ్మిది గంటల చొప్పున సాధన చేసిన నేను.. ఒక్కసారిగా ఆటను పక్కన పెట్టాల్సి రావడంతో కాస్త ఒత్తిడికి గురయ్యా. అయినా ప్రతి సందర్భాన్నీ ఇంట్లో వాళ్లతో కలిసి గడపగలిగానన్న సంతోషం, సంతృప్తి నాకు దక్కాయి. ఇక పాప పుట్టాక.. ఇటు తన బాధ్యతలు చూస్తూనే.. అటు రోజుకు నాలుగ్గంటల చొప్పున సాధన చేసేదాన్ని. అమ్మతనం నాలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది.. క్రమశిక్షణను మరింతగా పెంచింది. అమ్మయ్యాక నేను సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు నా కూతురు వయసు ఐదేళ్లు. పోటీలు లేనప్పుడు తనతోనే ఎక్కువ సమయం గడపడానికి కేటాయిస్తా. ఈ రోజుల్లో చాలామంది మహిళలు తల్లయ్యాకా తమ క్రీడా కెరీర్‌ను కొనసాగించడం, విజయాలు సాధించడం చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. ఇలా అటు పిల్లల బాధ్యతను, ఇటు కెరీర్‌ను సమన్వయం చేసుకోవాలంటే ఇంట్లో వాళ్ల ప్రోత్సాహం, మద్దతు తప్పనిసరి. ఈ ప్రోత్సాహమే నా విషయంలోనూ వర్కవుట్‌ అవుతోంది..’ అంటూ చెబుతోంది హంపి.


తన రికార్డును తానే బద్దలుకొట్టి..!

తన కజిన్స్‌ స్ఫూర్తితో క్రీడల్లోకి అడుగుపెట్టింది పటియాలాకు చెందిన మన్‌ప్రీత్‌ కౌర్‌. 2006లో షాట్‌పుట్‌ను తన కెరీర్‌గా ఎంచుకున్న ఆమె.. 15.44 మీటర్లు విసిరి సబ్‌ జూనియర్‌ రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. అయితే ఆపై పలు పోటీల్లో పతకాలు ఒడిసిపట్టిన మన్‌ప్రీత్‌.. 2010-13 వరకు పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా మూడేళ్ల పాటు ఆటకు దూరమైంది. ఆపై నెలల వ్యవధిలోనే తిరిగి సాధన మొదలుపెట్టిన ఆమెకు.. పాపను ఇంట్లో వదిలి శిక్షణకు, పోటీలకు వెళ్లడం కాస్త కష్టంగానే అనిపించిందని ఓ సందర్భంలో పంచుకుంది.
‘నా కూతురు జష్నూర్‌కు 10 నెలల వయసున్నప్పట్నుంచి తిరిగి షాట్‌పుట్‌ సాధన ప్రారంభించా. ఆ సమయంలో నా పాపను మా అత్తగారే చూసుకునేవారు. అయినా నా మనసంతా పాప కోసం పరితపించేది. ఇక తనకు ఊహ తెలిశాక.. ఇంటికి ఎప్పుడొస్తావని నన్ను పదే పదే అడిగేది. కానీ ఇప్పుడు తను ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతుంది. అమ్మా నువ్వు దేశానికి ప్రాతినిథ్యం వహించడం చూస్తుంటే గర్వంగా ఉందని చెబుతుంటుంది.. తను అలా అర్థం చేసుకోవడం కంటే కావాల్సిందేముంటుంది?’ అంటోన్న మన్‌ప్రీత్‌.. గతంలో డోప్‌ పరీక్షలో విఫలమవడంతో మరోసారి కొన్నేళ్ల పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చిందామె. అయితే తిరిగి గతేడాది క్రీడలోకి అడుగుపెట్టిన ఆమె.. గతంలో తాను నమోదు చేసిన జాతీయ రికార్డును తానే బద్దలు కొట్టి మరోసారి తన సత్తా చాటుకుంది. గతంలో ఐరన్‌ బాల్‌ను 18.28 మీటర్ల దూరం విసిరి జాతీయ రికార్డు నెలకొల్పిన ఆమె.. గతేడాది 18.86 మీటర్ల దూరం విసిరి తన వ్యక్తిగత రికార్డును తానే అధిగమించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని