Met Gala: ప్రియాంక నెక్లెస్ ఖరీదు 204 కోట్లట!
సాధారణంగా సెలబ్రిటీ పార్టీల్లోనే సరికొత్త ఫ్యాషన్లతో హొయలుపోయే మన అందాల తారలు.. అంతర్జాతీయ ఫ్యాషన్ వేడుకంటే ఒకరితో ఒకరు పోటీ పడుతూ మరీ ఫ్యాషనబుల్‌గా రడీ అవుతుంటారు. ఇక మెట్ గాలా వంటి ప్రతిష్టాత్మక వేడుకకైతే తమ అందచందాలతో.....
(Photos: Instagram)
సాధారణంగా సెలబ్రిటీ పార్టీల్లోనే సరికొత్త ఫ్యాషన్లతో హొయలుపోయే మన అందాల తారలు.. అంతర్జాతీయ ఫ్యాషన్ వేడుకంటే ఒకరితో ఒకరు పోటీ పడుతూ మరీ ఫ్యాషనబుల్‌గా రడీ అవుతుంటారు. ఇక మెట్ గాలా వంటి ప్రతిష్టాత్మక వేడుకకైతే తమ అందచందాలతో హంగులద్దుతుంటారు. తాజాగా న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో నిర్వహించిన ఈ ఫ్యాషన్ పరేడ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తారల తళుకుబెళుకులకు వేదికైంది. విరాళాల సేకరణే ముఖ్యోద్దేశంగా ఏటా ఏర్పాటుచేసే ఈ వేడుకలో ఈసారి అందాల ఆలియా తొలిసారి పాల్గొనగా.. మరికొంతమంది ముద్దుగుమ్మలు తమ ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్స్‌తో మెప్పించారు. మరి, ఇంతకీ వాళ్లెవరు? వాళ్లు ధరించిన ప్రత్యేక ఫ్యాషన్లపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..
థీమ్ వెనుక కథ ఇది!
కోట్లాది రూపాయల విరాళాల సేకరణే ముఖ్యోద్దేశంగా నిర్వహించే ఈ ఫ్యాషన్ పరేడ్ కోసం ఏటా ఓ ప్రత్యేకమైన థీమ్‌ను కేటాయిస్తారు. అలా ఈసారి ప్రముఖ జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ ‘కర్ల్ లాగర్‌ఫెల్డ్’ సేవలకు నివాళిగా ‘కర్ల్ లాగర్‌ఫెల్డ్ : ఎ లైన్ ఆఫ్ బ్యూటీ’ థీమ్‌తో ఈ వేడుక జరిగింది. కర్ల్ ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్స్‌కు పనిచేశారు. ఇందుకు గుర్తింపుగానే ఆయన వేసిన దాదాపు 150కి పైగా స్కెచ్‌లతో రూపొందించిన ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్స్‌ను ఈసారి మెట్ గాలాలో ముద్దుగుమ్మలు ప్రదర్శించారు. ఇక మన దేశం నుంచి అందాల ఆలియా తొలిసారి ఈ వేడుకల్లో మెరవగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ, నటాషా పూనావాలాలు.. సరికొత్త ఫ్యాషన్లతో రెడ్ కార్పెట్‌పై హొయలుపోయారు.
ఎవరెలా మెరిశారంటే..!
⚛ బాలీవుడ్ న్యూమామ్ ఆలియా భట్ తొలిసారి మెట్ గాలా వేడుకకు హాజరైంది. సాధారణంగానే విభిన్న ఫ్యాషన్లతో మైమరిపించే ఈ ముద్దుగుమ్మ.. ఈ వేడుకలో క్లాసీగా దర్శనమిచ్చింది. నేపాలీస్-అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ ప్రభల్ గురుంగ్ రూపొందించిన తెలుపు రంగు బాల్ గౌన్‌లో మెరిసిందీ బ్యూటీ. ప్లంజింగ్ నెక్‌లైన్‌తో కూడిన ఈ గౌన్‌పై లక్ష ముత్యాలను తీర్చిదిద్దారు. గౌన్‌కు వెనక వైపు జత చేసిన పొడవాటి ట్రెయిన్ డ్రస్‌కు అదనపు హంగులద్దింది. ఇక తన డ్రస్‌కు మ్యాచింగ్‌గా ముత్యాలు-వజ్రాలతో రూపొందించిన ఆభరణాల్ని ధరించిన ఆలియా.. తక్కువ మేకప్‌తో మెరుపులు మెరిపించింది. అంతేకాదు.. ఈ ఏటి థీమ్‌కు తగినట్లుగా, డిజైనర్ కర్ల్ గౌరవార్థం మ్యాచింగ్ ఫింగర్ గ్లోవ్స్ ధరించిందీ బ్యూటీ.
⚛ 2017లో మెట్ గాలాలో తొలిసారి పాల్గొన్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. అప్పట్నుంచి ఏటా ఈ వేడుకలో సందడి చేస్తోంది. అలా ఈసారి కూడా తన భర్త నిక్‌తో కలిసి రెడ్ కార్పెట్‌పై హొయలుపోయిందీ చక్కనమ్మ. ఏటికేడు సరికొత్త ఫ్యాషనబుల్ దుస్తుల్లో దర్శనమిచ్చే పీసీ.. ఈసారీ అదే పంథాను కొనసాగించింది. నలుపు రంగు స్ట్రాప్‌లెస్ థై-హై స్లిట్ వాలెంటినో గౌన్ ధరించిన ఆమె.. టఫ్టెడ్ కేప్‌ను దానికి జతచేసింది. చేతులకు తెలుపు రంగు గ్లోవ్స్, బన్ హెయిర్‌స్టైల్‌తో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ ధరించిన వజ్రాల నెక్లెస్ ధర అక్షరాలా రూ. 204 కోట్ల పైమాటేనట! ఇటలీకి చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ బల్గరీ 11.6 క్యారట్ల ఈ వజ్రాల నెక్లెన్‌ను రూపొందించిందట. ప్రియాంక ధరించిన ఈ నెక్లెస్ ధర భారత కరెన్సీలో దాదాపు రూ.204 కోట్లకు పైనే ఉంటుందని ఇప్పుడు ఓ వార్త సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మెట్ గాలా పూర్తయిన తర్వాత ఈ నెక్లెస్‌ను వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బల్గరీ సంస్థ గానీ, మెట్ గాలా నుంచి గానీ ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. ఇక తన ఇష్టసఖి దుస్తులకు మ్యాచింగ్‌గా బ్లాక్ అండ్ వైట్ సూట్ వేసుకున్నాడు నిక్.
⚛ 2017, 2019లో మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై మెరుపులు మెరిపించిన ఈషా అంబానీ.. ఈసారీ ఈ వేడుకలో పాల్గొంది. ఫ్యాషన్ డిజైనర్ ప్రభల్ గరుంగ్ రూపొందించిన నలుపు రంగు శాటిన్ శారీ-గౌన్‌లో మెరిసిందీ అంబానీ ప్రిన్సెస్. ఇక ఈ డ్రస్ బోర్డర్‌పై ముత్యాలు, మెరుపులతో హంగులద్దారు. స్టేట్‌మెంట్ డైమండ్ జ్యుయలరీ, లేయర్డ్ నెక్లెస్‌తో తన గ్లామర్‌ను పూర్తిచేసిన ఈషా చేతిలో ఉన్న డాల్ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పచ్చు.
⚛ ప్రముఖ వ్యాపారవేత్త, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాషా పూనావాలా మెట్ గాలాలో పాల్గొనడం ఇది నాలుగోసారి. ప్రతిసారీ విభిన్న ఫ్యాషనబుల్ లుక్స్‌లో దర్శనమిచ్చే ఆమె.. ఈసారీ డిఫరెంట్ అవుట్‌ఫిట్‌తో అందరి మనసులు కొల్లగొట్టింది. షియాపరెల్లీస్ హాట్ కోచర్ 2023 కలెక్షన్ నుంచి షియాపరెల్లీ సిల్వర్ గౌన్‌ను ఈ వేడుక కోసం ఎంచుకుంది నటాషా. ఇక ఈ గౌన్‌కు ఇరువైపులా రూపొందించిన పాయింటీ ఎడ్జెస్ డ్రస్‌కు అదనపు హంగులద్దాయి. తక్కువ మేకప్‌తో, స్లీక్ పోనీటెయిల్‌తో తన లుక్‌ను పూర్తిచేసిన ఈ బిజినెస్ ఉమన్.. రెడ్ కార్పెట్‌పై పూర్తి ఫ్యాషనబుల్‌గా కనిపించింది.
⚛ అంబానీ కోడలు శ్లోకా మెహతా సోదరి, ఫ్యాషనిస్టా అయిన దియా మెహతా జతియా ఈ ఏటి మెట్ గాలా ఈవెంట్‌లో మెరిసింది. ప్రభల్ గురుంగ్ రూపొందించిన నలుపు-ఆకుపచ్చ రంగుల్లో రూపొందించిన గౌన్ ధరించి రెడ్ కార్పెట్‌పై హొయలుపోయిందామె. ఇలా తన ట్రెండీ అవుట్‌ఫిట్‌కు మిక్స్ అండ్ మ్యాచ్ అయ్యేలా ట్రెడిషనల్ హెయిర్‌స్టైల్ వేసుకుంది దియా. పొడవాటి జడకు టెంపుల్ జ్యుయలరీ హెడ్ గేర్‌తో హంగులద్ది తన లుక్‌కు మరింత అందాన్ని జోడించిందీ యంగ్ ఫ్యాషనర్.
ఇక హాలీవుడ్ తారలు కార్లీ క్లోస్, రిహాన్నా.. టెన్నిస్ తార సెరెనా విలియమ్స్ గర్భంతోనే రెడ్ కార్పెట్‌పై పోజులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.