ఈ స్టార్‌ క్రికెటర్ల కూతుళ్లు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?

నటుల వారసులు నటులవడం చూస్తున్నాం.. తల్లిదండ్రుల వ్యాపారంలో ప్రవేశించే పిల్లలూ చాలామందే ఉన్నారు. కానీ తాము మాత్రం ఇందుకు భిన్నం అంటున్నారు కొందరు స్టార్‌ క్రికెటర్ల కూతుళ్లు. తండ్రి పేరు ప్రఖ్యాతులతో కాకుండా.. తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. క్రికెట్‌ నేపథ్యం ఉన్న కుటుంబంలో...

Published : 16 Oct 2022 10:02 IST

నటుల వారసులు నటులవడం చూస్తున్నాం.. తల్లిదండ్రుల వ్యాపారంలో ప్రవేశించే పిల్లలూ చాలామందే ఉన్నారు. కానీ తాము మాత్రం ఇందుకు భిన్నం అంటున్నారు కొందరు స్టార్‌ క్రికెటర్ల కూతుళ్లు. తండ్రి పేరు ప్రఖ్యాతులతో కాకుండా.. తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. క్రికెట్‌ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినా మోడలింగ్‌, సినిమా, కళలు.. వంటి విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. తమ తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తున్నారు. మరి, అటు అందం, ఇటు తమ ప్రతిభతో కట్టిపడేస్తోన్న కొందరు సెలబ్రిటీ క్రికెట్‌ డాటర్స్‌ గురించి మీకోసం..!

సారా తెందూల్కర్

క్రికెట్‌ ప్రేమికులకు సారా తెందూల్కర్‌ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ తెందూల్కర్‌ - డాక్టర్‌ అంజలిల గారాల పట్టి ఆమె. తండ్రి నుంచి క్రికెట్‌ వారసత్వంతో సంబంధం లేకుండా తనకిష్టమైన మోడలింగ్‌ రంగాన్ని ఎంచుకుందీ బ్యూటీ. ఈ క్రమంలోనే గతేడాది ‘అజియో లక్సే’ అనే అంతర్జాతీయ క్లాతింగ్‌ బ్రాండ్‌కి తొలిసారి మోడలింగ్‌ చేసింది సారా. మరో ఇద్దరు మోడల్స్‌తో కలిసి ఈ యాడ్‌ షూట్‌లో పాల్గొన్న సారా.. తన అందంతో అందరినీ కట్టిపడేసింది. అందుకే సారాను మోడల్‌గా చూసిన అభిమానులు ‘అచ్చం గ్రీకు దేవత’లా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. ఇక ఇటీవలే మరో మేకప్‌ బ్రాండ్‌కి మోడలింగ్‌ చేసి మరోసారి వార్తల్లో నిలిచిందీ లిటిల్‌ తెందూల్కర్‌. అయితే సారా మోడలింగ్‌ రంగంలోకి రావడంతో అందరూ ఆమె నటిగా స్థిరపడుతుందేమో అనుకున్నారు. కానీ తనకు ఆ ఆలోచన లేదని, భవిష్యత్తులో మోడల్‌గా, డాక్టర్గా స్థిరపడాలన్నదే తన ఆశయమంటోంది సారా. ప్రస్తుతం లండన్‌లో వైద్య విద్య అభ్యసిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్‌ మీడియాలో మహా చురుకు! తన కుటుంబం, స్నేహితులతో గడిపిన జ్ఞాపకాలతో పాటు.. వెకేషన్లకు వెళ్లిన సందర్భాల్నీ ఫొటోల రూపంలో పంచుకుంటుంది సారా.


అమైయా దేవ్

తల్లిదండ్రుల వారసత్వంతో కాకుండా తన సొంత ప్రతిభతో రాణిస్తోంది నాటి దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ - రోమీ భాటియాల ముద్దుల కూతురు అమైయా దేవ్‌. దిల్లీలో పుట్టిపెరిగిన ఈ జూనియర్‌ కపిల్‌.. యూకే స్కాట్లాండ్‌లోని సెయింట్‌ ఆండ్రూస్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసింది. అయితే తండ్రిలా క్రికెట్‌ వృత్తిని, తల్లిలా వ్యాపారాన్ని కాకుండా.. సినిమా రంగంలోకి రావాలని ఆశ పడింది అమైయా. అనుకున్నట్లుగానే తన తండ్రి బయోపిక్‌ ‘83’తో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం సినిమా దర్శకత్వంపై తన పూర్తి దృష్టి పెట్టిన ఆమె.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతుంది.


సనా గంగూలీ

తన చిరునవ్వుతో కట్టిపడేస్తుంటుంది మాజీ క్రికెటర్‌ సౌరభ్‌ గంగూలీ గారాలపట్టి సనా గంగూలీ. కోల్‌కతాలో పుట్టి పెరిగిన ఈ లిటిల్‌ దాదాకు తన తల్లి డోనా గంగూలీలాగే శాస్త్రీయ నృత్యమంటే మక్కువ! లండన్‌ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసిన సనా.. ప్రస్తుతం ఒడిస్సీ డ్యాన్సర్‌గా రాణిస్తోంది. శాస్త్రీయ నృత్యంపై ఆమెకున్న ఇష్టాన్ని గుర్తించిన గంగూలీ దంపతులు తమ కూతురిని ఈ దిశగా ప్రోత్సహించి ఇందులో శిక్షణ ఇప్పించారు. ఏడేళ్ల వయసులోనే తన తొలి స్టేజీ ప్రదర్శన ఇచ్చిన ఈ స్టార్‌ డాటర్‌.. తన తల్లితో కలిసి నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది. ఇక 2019లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు మద్దతు తెలుపుతూ సనా పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే! ఆపై గంగూలీ దీనిపై వివరణ ఇవ్వడంతో సనా పోస్ట్‌ తొలగించడం, ఆపై వివాదం సద్దుమణగడం జరిగిపోయాయి. ఇక హాబీస్‌ విషయానికొస్తే.. స్విమ్మింగ్, షాపింగ్, ప్రయాణాలను ఎక్కువగా ఇష్టపడే ఈ చక్కనమ్మకు లండన్‌లో పర్యటించడమంటే ఎంతో ఇష్టమట!


ఆరుణీ కుంబ్లే - స్వస్తి కుంబ్లే

మాజీ ఇండియన్‌ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే-చేతనా రామతీర్థల కూతుళ్లే ఆరుణీ కుంబ్లే, స్వస్తి కుంబ్లే. లండన్‌ ఇంపీరియల్‌ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసిన ఆరుణి.. ప్రస్తుతం చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఇక చెల్లెలు స్వస్తి.. ప్రస్తుతం ఓవైపు చదువుకుంటూనే, మరోవైపు ‘పెహ్లే అక్షర్‌ ఫౌండేషన్‌’లో కథకురాలిగా (Story Teller)గా పనిచేస్తోంది. వీరిద్దరికీ మయాస్‌ కుంబ్లే అనే సోదరుడున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని