కెమెరాతో... పోరాడుతున్నా!

ఈసారి కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సందడంతా మనదేనేమో! పాయల్‌ కపాడియా... అనుసూయాసేన్‌గుప్తాలు మహిళా చిత్రాలతో తమ ప్రతిభని చాటుకున్నట్టే... పౌలోమీబసు కూడా ఓ వినూత్నమైన అంశంతో ఈ వేదికపైకి వచ్చింది.

Published : 01 Jun 2024 19:51 IST

ఈసారి కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సందడంతా మనదేనేమో! పాయల్‌ కపాడియా... అనుసూయాసేన్‌గుప్తాలు మహిళా చిత్రాలతో తమ ప్రతిభని చాటుకున్నట్టే... పౌలోమీబసు కూడా ఓ వినూత్నమైన అంశంతో ఈ వేదికపైకి వచ్చింది. ‘మాయ: ద బర్త్‌ ఆఫ్‌ సూపర్‌హీరో’ అనే వర్చువల్‌ రియాలిటీ సినిమాతో కేన్స్‌ వేదికపై మెరిసింది. ఇంతకీ మాయ ఎవరు? ఆమెకీ పౌలోమీకీ ఉన్న సంబంధం ఏంటి? తెలుసుకుందాం రండి..

కోల్‌కతాలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది పౌలోమీబసు. పెద్ద కుటుంబం. ఆడవాళ్లపై హింస చాలా సహజం అన్నట్టుండేదా ఇంటి పరిస్థితి. ఇక తను రజస్వల అయ్యాక ఆ బాధలు రెట్టింపయ్యాయి. అడుగడుగునా ఆంక్షలతో ఆమెకా ఇల్లు నరకంలా తోచేది. ‘17 ఏళ్ల వయసులో అమ్మ నన్ను ఇంట్లోంచి పారిపొమ్మంది. ఏ తల్లీ కూతురితో ఇలా అనదు కదా? కానీ నా పరిస్థితి అలాంటిది. నాన్న చీటికీమాటికీ అనుమానించేవాడు, వేధించేవాడు. వేశ్యలా ప్రవర్తిస్తున్నావ్‌ అనేవాడు. ఒక దశలో నిద్ర మాత్రలు మింగేద్దామనుకున్నా. ఆ సమయంలో నేను చదివిన పుస్తకాలే నన్ను రక్షించాయి. అలా మగవాళ్లు పెట్టే హింసని చాలా దగ్గరగా చూశా. నాకు పదిహేడేళ్లు వచ్చేసరికి నాన్న చనిపోయాడు. ‘నువ్వైనా నీ కలలు నిజం చేసుకో..ఇంటి నుంచి పారిపో’ అంటూ అమ్మ నన్ను ఇంటి నుంచి పంపేసింది. అప్పట్నుంచీ నాకన్నీ నా కెమెరానే. ఏదో శక్తి నన్ను నడిపించినట్టు కెమెరా భుజాన వేసుకుని దేశమంతా తిరిగాను. బోడో ఉద్యమకారిణులని కలిశాను, భారత్, పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని మహిళా సైనికులతో మాట కలిపాను, మధ్య భారతంలో మైనింగ్‌ కారణంగా భూమిని కోల్పోయి గెరిల్లా యుద్ధం చేస్తున్న ఆడవాళ్ల పరిస్థితి చూశాను. నాకు అర్థమయ్యింది ఒకటే. యుద్ధం, రాజకీయాలు, వాతావరణ మార్పులు, వలసలు.. వీటన్నింటికీ ముందుగా బలయ్యేది ఆడవాళ్లూ, వాళ్ల శరీరాలే’ అనే పౌలోమీ తనకెదురైన అనుభవాలతో స్త్రీల కన్నీళ్లని తన కెమెరాలో బంధిస్తూ వచ్చింది.

పీరియడ్‌ యాక్టివిస్ట్‌గా...

ఇన్ని కష్టాలు చూసినా పీరియడ్‌ యాక్టివిస్ట్‌గా మారి 11 ఏళ్ల క్రితం ‘బ్లడ్‌ టాక్స్‌’ అనే మల్టీమీడియా ప్రాజెక్ట్‌ ప్రారంభించడానికి కారణం... పౌలోమీకి నేపాల్‌లో ఎదురైన పరిస్థితులే. ‘నేపాల్‌లో ‘చౌపది’ ఆచారం నన్ను కలిచివేసింది. నెలసరి సమయంలో ఇంటికి దూరంగా ఓ గుడిసెలో ఉంచడాన్నే చౌపది అంటారు. అక్కడ సరైన సదుపాయాలు ఉండవు. కనీసం మంచి నీళ్లు ఉండవు. వాళ్ల గుడిసెల్లోకి వెలుతురు రాదు. వాళ్లు పచ్చని మొక్కని తాకకూడదు. ఇన్‌ఫెక్షన్లు వచ్చి చచ్చిపోతున్నా ఎవరూ పట్టించుకోరు. వెలుతురు కోసం వేసుకొనే మంట కార్బన్‌మోనాక్సైడ్‌గా మారి వారి ప్రాణాలు హరించేది. పాముకాట్లకు లెక్కలేదు. ఈ ఆచారంపై పోరాటానికి నా కెమెరా లెన్స్‌నే ఆయుధంగా చేసుకున్నా. ఏ నెత్తురు మానవజాతి అభివృద్ధికి కారణమో, అదే నెత్తురు ఆడవాళ్ల జీవితాలని నాశనం చేయడం నాకు నచ్చలేదు’ అనే పౌలోమీ తన ప్రాజెక్ట్‌కి బ్లడ్‌ టాక్స్‌ అని పేరు పెట్టింది. ఆమె తీసిన చిత్రాలు టైమ్‌ ముఖచిత్రమయ్యాయి. టు బీ ఏ గర్ల్, మైబాడీ ఈజ్‌ మైన్‌ పేరుతో ఆమె చేసిన ప్రచారానికి స్పందించి అంతర్జాతీయ సంస్థలు అక్కడి పరిస్థితులు మెరుగుపరిచేందుకు రెండు లక్షల పౌండ్లని అందించాయి. వీడియోలు, ఫొటోలు, వీఆర్‌ టెక్నాలజీతో నెలసరిపై ఆమె చేసిన పోరాట ఫలితంగా 2018లో నేపాల్‌ ప్రభుత్వం చౌపది ఆచారానికి వ్యతిరేకంగా చట్టం చేసింది. ఆ ఆచారాన్ని పాటించమని బలవంతం చేసేవారికి 3 నెలల జైలు శిక్ష పడుతుంది. అలాగే సిస్టర్స్‌ ఆఫ్‌ ద మూన్, ఒలింపిక్‌ మ్యూజియమ్‌ పేరుతో పౌలోమీ మరో రెండు ప్రాజెక్ట్‌లు చేపట్టింది. ఆమె తీసిన చిత్రాలు అమెరికాలోని మోడరన్‌ ఆర్ట్‌ మ్యూజియమ్‌లో చోటు సంపాదించుకున్నాయి. ఆమె కృషికి రాయల్‌ ఫొటోగ్రాఫిక్‌ సొసైటీ నుంచి హూడ్‌ మెడల్‌ అందింది. ‘మాయ సినిమా బ్లడ్‌ టాక్స్‌ ప్రాజెక్ట్‌లో ఓ భాగం. 11 ఏళ్ల కల ఇది. నిజం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఈ తరం పిల్లలకు నెలసరిపైనే కాదు, మన శరీరంపైనా అవగాహన తీసుకొచ్చే సినిమా’ అంటోంది పౌలోమి.

మాయ... లండన్‌లో పుట్టి, పెరిగిన ఆసియా అమ్మాయి. ఫస్ట్‌ పీరియడ్‌ ఆ అమ్మాయి ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది. ఇంట్లో ఆచారాలు, నమ్మకాలు... ఆమెని భయం, బిడియంలోకి నెట్టేస్తాయి. వాటి నుంచి బయటపడి తనో సూపర్‌హీరోగా ఎలామారిందన్నదే ‘మాయ: ద బర్త్‌ ఆఫ్‌ సూపర్‌హీరో’ కథ. ఇది వీఆర్‌ సినిమా. హెడ్‌సెట్‌ పెట్టుకుని మనం కూడా కథలో భాగం కావొచ్చు. అక్కడ మనల్ని వేధించే నెలసరి నొప్పులు, సాంఘిక దురాచారాలతో పోట్లాడొచ్చు. గెలిచి హీరో కావొచ్చు. అరగంట నిడివితో సాగే ఈ ఫ్రెంచ్‌- ఇంగ్లిష్‌ సినిమా తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మంజీత్‌మన్, పౌలోమీ... కథారచయిత్రులు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడి మూడేళ్లపాటు నిర్మించిన ఈ చిత్రంలో బొమ్మలు గ్రాఫిక్స్‌ కావు. చేత్తో గీసిన చిత్రాలు.


అమ్మానాన్నల కోసం...

తల్లిదండ్రులు పిల్లలే తమ జీవితంగా బతుకుతారు. వాళ్ల భవిష్యత్తు కోసం ఎంతో శ్రమిస్తారు. మంచీ, చెడు తెలియజేస్తారు. క్రమశిక్షణ నేర్పించి ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దుతారు. అందుకే, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల అమూల్యమైన పాత్రకు గుర్తుగా 2012లో యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ... జూన్‌ 1ని ‘గ్లోబల్‌ డే ఆఫ్‌ పేరెంట్స్‌’ గా ప్రకటించింది. ఈ ఏడాది ‘ద ప్రామిస్‌ ఆఫ్‌ ప్లేఫుల్‌ పేరెంటింగ్‌’ అనే నినాదంతో దీన్ని నిర్వహించనున్నారు. పిల్లలతో కలిసి సరదాగా ఎటువంటి యాక్టివిటీస్‌ చేయాలి అనే విషయంపై ఈ నెలంతా నిపుణులు తమ సలహాలూ, సూచనలూ అందజేస్తారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్