Cannes 2023: ఆ ప్రత్యేకతే వీళ్లకు ‘రెడ్ కార్పెట్’ పరిచింది!

డబ్బుతో పాటు పాపులారిటీ కూడా సంపాదించుకోవాలనుకుంటున్నారు ఈ తరం అమ్మాయిలు. ఇందుకోసం తమలో ఉన్న ప్రత్యేకమైన ప్రతిభకు పదును పెడుతున్నారు.. ఈ క్రమంలో స్ఫూర్తిదాయక వీడియోలు రూపొందిస్తూ, వాటిని సోషల్‌ మీడియాలో....

Updated : 05 Jan 2024 14:53 IST

(Photos: Instagram)

డబ్బుతో పాటు పాపులారిటీ కూడా సంపాదించుకోవాలనుకుంటున్నారు ఈ తరం అమ్మాయిలు. ఇందుకోసం తమలో ఉన్న ప్రత్యేకమైన ప్రతిభకు పదును పెడుతున్నారు.. ఈ క్రమంలో స్ఫూర్తిదాయక వీడియోలు రూపొందిస్తూ, వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా ప్రజాదరణ పొందుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అలాంటి కొంతమంది భారతీయ ఇన్ఫ్లుయెన్సర్లకు కేన్స్ వేదిక ఈ ఏడాది ఆహ్వానం పలికింది. అందులో కొందరికి ఇది తొలి పిలుపు కాగా, మరికొందరు గతంలోనూ రెడ్‌ కార్పెట్‌పై హొయలు పోయారు. మరి, ఈసారి కేన్స్‌ వేదికపై మెరవనున్న ఆ యువ ఇన్ఫ్లుయెన్సర్స్‌ ఎవరు? వాళ్ల ప్రత్యేకతేంటి? తెలుసుకుందాం రండి..

ఫ్రాన్స్‌ వేదికగా ఏటా జరిగే ‘కేన్స్‌ అంతర్జాతీయ చిత్రోత్సవం’లో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ సెలబ్రిటీలు పాల్గొనడం తెలిసిందే! మన దేశం నుంచి కూడా ఐశ్వర్యారాయ్‌, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, అనుష్కా శర్మ.. తదితర తారలు పాల్గొని.. విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో ఏటా రెడ్‌ కార్పెట్‌పై హొయలుపోతుంటారు. అయితే వీళ్లతో పాటు మరికొందరు తారలు, యువ సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్‌ ఈసారి కేన్స్‌ వేదికపై అలరించనున్నారు.


నా దారి రహదారి! - డాలీ సింగ్

అందరూ వెళ్లే దారిలో కాకుండా కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని చిన్న వయసులోనే నిర్ణయించుకుంది నైనిటాల్‌కు చెందిన డాలీ సింగ్‌. ఆమె తల్లిదండ్రులిద్దరూ టీచర్లే. ఉన్నత విద్యా నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన ఆమె.. స్కూల్‌ టాపర్‌గా సత్తా చాటింది. అయితే ఉన్నత చదువుల కోసం ‘హ్యుమానిటీ’ని ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకున్న ఆమె.. ఈ నిర్ణయంతో తన తల్లిదండ్రుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. డాలీకి చిన్నతనం నుంచి ఫ్యాషన్‌ అంటే పిచ్చి. పెరిగి పెద్దయ్యే క్రమంలో విభిన్న ఫ్యాషన్లు ప్రయత్నిస్తూ అందరినీ ఆకట్టుకునేదామె. అయితే ఫ్యాషన్‌పై తనకున్న మక్కువతో ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ’లో ‘ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌’లో మాస్టర్స్‌ పూర్తిచేసింది. అదే సమయంలో తన స్నేహితుల్లో కొందరు ఫ్యాషన్‌ బ్లాగర్లుగా మారడం చూసి.. వాళ్ల స్ఫూర్తితోనే ‘స్పిల్‌ ది సాస్‌’ పేరుతో సొంత ఫ్యాషన్‌ బ్లాగ్‌ను ప్రారంభించిందామె. ఈ వేదికగా మహిళలకు బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఫ్యాషన్‌ టిప్స్‌ అందించేది డాలీ. మరోవైపు పలు మీడియా సంస్థలు రూపొందించే ఫన్నీ వీడియోల్లో నటించి మెప్పించిందామె. ఇదే క్రమంగా సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా మారాలన్న ఆసక్తిని తనలో రేకెత్తించిందంటోందామె.

నటిగానూ!

‘అమెరికన్‌ కవి రాబర్ట్‌ ఫ్రాస్ట్‌ రచించిన ‘ది రోడ్‌ నాట్‌ టేకెన్‌’ అనే కవిత నా ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌. దాని స్ఫూర్తితోనే అందరూ నడిచే దారిలో కాకుండా ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకోవాలనుకున్నా.. ప్రజాదరణ పొందాలనుకున్నా. తొలుత చాలామంది నా నిర్ణయాన్ని వ్యతిరేకించారు.. కానీ నేను వాళ్ల మాటలు పట్టించుకోకుండా.. నా ఆసక్తి పైనే దృష్టి పెట్టాను. కంటెంట్‌ క్రియేటర్‌గా, సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా పేరు తెచ్చుకున్నా. ప్రస్తుతం నిత్యజీవితంలో నాకెదురయ్యే అనుభవాల్ని స్ఫూర్తిగా తీసుకొని సరదా వీడియోలు రూపొందిస్తున్నా..’ అంటోన్న డాలీ.. ఇటీవలే ‘మోడ్రన్‌ లవ్‌ ముంబయి’ వెబ్‌సిరీస్‌లో తొలిసారి నటించి నటిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇలా తన కంటెంట్‌, వీడియోలతో దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన డాలీ.. ఈ ఏడాది కేన్స్‌ వేదికపై తొలిసారి పాల్గొననుంది. ‘ఇది నా జీవితంలోనే ఓ గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది..’ అంటూ ఉప్పొంగిపోతోందీ యువ ఇన్ఫ్లుయెన్సర్‌. ప్రస్తుతం ఇన్స్టాలో ఆమెకు 16 లక్షల మందికి పైగా ఫాలోవర్లున్నారు.


ది పంజాబీ కుడీ - రూహీ దొసానీ

తన అసలు పేరు కంటే ‘ది పంజాబీ కుడీ’గానే ప్రజాదరణ సంపాదించుకుంది యూఎస్‌లో స్థిరపడిన పంజాబీ గర్ల్‌ రూహీ దొసానీ. చిన్నతనం నుంచి ఎంతో చలాకీగా ఉండే ఆమె.. చదువులో మహా చురుకు. ఈ ట్యాలెంటే ఆమెకు ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థలో మంచి ప్యాకేజీతో కూడిన కొలువును కట్టబెట్టింది. అయితే రూహీకి డ్యాన్స్‌ అంటే ప్రాణం. ఈ మక్కువతోనే యూఎస్‌లో ఉన్న తన స్నేహితులతో కలిసి పలు బాలీవుడ్‌, భోజ్‌పురీ పాటలకు నృత్యం చేసేలా చేసింది. ఇక ఇలా రీ-క్రియేట్‌ చేసిన వీడియోల్ని తన ఇన్‌స్టా ఖాతాల్లో పోస్ట్ చేసేదామె. అయితే అప్పటికే తన స్నేహితులు తనకు ‘ది పంజాబీ కుడీ’ అని బిరుదిచ్చినప్పటికీ.. తన పాపులారిటీ అమాంతం పెరిగింది మాత్రం కరోనా సమయంలోనే అంటోందామె.

‘ఇన్‌స్టాలో నేను పెట్టిన వీడియోల్లో ఒకటి.. గాయకుడు దిల్జిత్‌ దొసాంజ్ కంట పడింది. దాన్ని ఆయన రీపోస్ట్‌ చేస్తూ.. నన్ను ప్రశంసించడంతో చాలామంది నా గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. అలా క్రమంగా నా పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. బాలీవుడ్‌లో ఒక్కొక్క సెలబ్రిటీదీ ఒక్కో స్టైల్‌. దాన్ని అనుకరిస్తూ.. వాళ్లతో కాలు కదుపుతూ ఎన్నో వీడియోలు రూపొందించా.. కొన్ని ప్రకటనలకు సంబంధించిన ఫన్నీ వీడియోలూ చేశాను. ‘ఎంత ఒత్తిడిలో ఉన్నా మీ వీడియోలు చూస్తే ఇట్టే రిలాక్సవుతాం..’ అని చెబుతుంటారు చాలామంది. అది విన్నాక నేను పడే కష్టాన్నీ మర్చిపోతా..’ అంటూ చెప్పుకొచ్చిందీ పంజాబీ బ్యూటీ. తన వీడియోల్లో భాగంగా ఉత్తరం నుంచి దక్షిణం వరకు.. తూర్పు నుంచి పడమర వరకు దాదాపు అందరు తారలతో కలిసి స్టెప్పులేసిన రూహీ.. డ్యాన్సింగ్‌ స్టైల్‌కి ఫిదా అవని మనసుండదంటే అతిశయోక్తి కాదు. ఇక ఈసారి కేన్స్‌ చిత్రోత్సవంలో తొలిసారి పాల్గొంటోన్న ఈ యువ ఇన్ఫ్లుయెన్సర్‌.. ‘ఈ చిత్రోత్సవంలో పాల్గొనాలనుకోవడం కళాకారులందరి కల. ఈ అరుదైన అవకాశం అందుకోవడం మర్చిపోలేని అనుభూతి..’ అంటోంది. ప్రస్తుతం ఈమె ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 23 లక్షలకు పైమాటే!


నవ్వుల పువ్వుల ‘నీహారిక’!

తన హాస్య చతురతతో అందరినీ కడుపుబ్బా నవ్వించడం నీహారిక ఎన్‌ఎం ప్రత్యేకత. చెన్నైలో పుట్టి బెంగళూరులో పెరిగిన ఆమెలో ఉన్న హాస్య ప్రత్యేకతను చిన్నప్పుడే గుర్తించి ప్రోత్సహించారు ఆమె తల్లిదండ్రులు. ఇక పెరిగి పెద్దయ్యే క్రమంలో బ్రహ్మానందం, వడివేలు.. వంటి మేటి హాస్యనటుల్ని స్ఫూర్తిగా తీసుకొని.. వాళ్లను అనుకరిస్తూ పలు షార్ట్‌ వీడియోలు, సరదా స్కిట్స్‌ రూపొందించేది నీహారిక. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ క్రమంగా పాపులారిటీ సంపాదించిందామె. నాటకాలపై ఇష్టంతో.. టీవీలో నాటకాలు, సినిమాలు ఎక్కువగా చూసేదామె. దీంతో కామెడీపై మరింత పట్టు పెంచుకుంది. ఈ క్రమంలో ఆయా రోజువారీ అంశాలపై, నిత్యజీవితంలోని పలు అంశాలపై ఆమె రూపొందించిన వీడియో సిరీస్‌లకు లక్షల్లో ప్రజాదరణ దక్కింది. ప్రస్తుతం ఫన్నీ వీడియోలతో పాటు సెలబ్రిటీలతోనూ స్కిట్స్‌, వీడియోలు రూపొందిస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుందీ చెన్నై చిన్నది.

‘కాలేజీలో ఉన్నప్పుడు స్నేహితుల్ని కడుపుబ్బా నవ్వించడానికి ప్రయత్నించేదాన్ని. అయితే ‘నీలో ఉన్న ఈ ప్రత్యేకతతో నువ్వెందుకు పాపులర్‌ కాకూడదు?!’ అంటూ వాళ్లు సలహా ఇచ్చారు. అప్పుడే వీడియోలు రూపొందించాలన్న ఆలోచన వచ్చింది. వీటిని యూట్యూబ్‌లో పెట్టేదాన్ని.. కానీ ఇంత పాపులారిటీ వస్తుందనుకోలేదు. నా వీడియోల్లో భాగంగా నేను పోషించే పాత్రల్లో చాలావరకు నా పాత్రకు దగ్గరగా ఉంటాయి..’ అంటోన్న ఈ హ్యూమర్‌ క్వీన్‌.. యూట్యూబ్‌ ప్రారంభించిన ‘గ్లోబల్‌ అంబాసిడర్స్‌ ఆఫ్‌ క్రియేటర్స్ ఫర్‌ ఛేంజ్‌’ అనే కార్యక్రమానికి వరుసగా రెండుసార్లు ఎంపికైన ఏకైక కంటెంట్‌ క్రియేటర్‌గా పేరు సంపాదించుకుంది. నీహారిక కేన్స్‌లో పాల్గొనడం ఇది రెండోసారి. గతేడాది తొలిసారి రెడ్‌ కార్పెట్‌పై మెరిసిన ఆమె.. వరుసగా రెండోసారి ఈ చిత్రోత్సవంలో పాల్గొనడం తనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందంటోంది. ప్రస్తుతం ఈ నవ్వుల రాణికి ఇన్‌స్టాలో 32 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు.

ఇక ఇప్పటికే బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు సారా అలీఖాన్‌, మానుషీ ఛిల్లర్‌, ఈషా గుప్తా.. తమ ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌తో రెడ్‌ కార్పెట్‌పై మెరుపులు మెరిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్