Published : 03/03/2022 19:37 IST

Milan Fashion Week: మిలాన్‌లో తొలిసారిగా మెరిశారలా!

(Photo: Instagram)

ఇంటి నుంచి పారిపోయి మేటి ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఎదిగిన వారు ఒకరైతే..

వ్యాపకంగా ఫ్యాషన్‌ బ్లాగ్‌ను ప్రారంభించి దాన్నే కెరీర్‌గా మలచుకున్న వారు మరొకరు..

మోడల్‌గా మేటి డిజైనర్లు, ప్రముఖ బ్రాండ్లతో మమేకమై పనిచేస్తున్నారు ఇంకొకరు..

ఈ ముగ్గురూ ఇటీవలే ముగిసిన ప్రతిష్ఠాత్మక మిలాన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో మెరిశారు. ఈ అరుదైన ఘనత దక్కించుకున్న తొలి భారతీయ వనితలుగా చరిత్రకెక్కారు. ఇంతకీ, ఎవరా ముగ్గురు? వారి ప్రత్యేకతేంటో తెలుసుకుందాం రండి..!

వీళ్లే ఆ ముగ్గురు!

ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌, మిలాన్‌ ఫ్యాషన్‌ వీక్‌, న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌, లండన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఫ్యాషన్‌ ఈవెంట్లివి. ఇందులో తమ డిజైన్లను ప్రదర్శించాలని డిజైనర్లు, మేటి ఫ్యాషన్లను ధరించి ర్యాంప్‌ వాక్‌ చేయాలని మోడల్స్‌ కలలు కంటుంటారు. అయితే ఆ అరుదైన అవకాశం మాత్రం అతికొద్దిమందికే దక్కుతుంది. ఇటీవలే ముగిసిన మిలాన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో భాగంగా.. ఈసారి ఆ అరుదైన అవకాశం సొంతం చేసుకున్నారు ముగ్గురు భారతీయ మహిళలు. వారే.. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ వైశాలీ షడంగులే, ఫ్యాషన్‌ బ్లాగర్‌/కంటెంట్‌ క్రియేటర్‌ మసూమ్‌ మినావాలా, మోడల్‌ అవంతీ నగ్రాత్‌. అంతేకాదు.. ఈ ఫ్యాషన్‌ పరేడ్‌లో ఆయా విభాగాల్లో తొలి మహిళలుగా ఘనత సాధించిందీ ఫ్యాషన్‌ త్రయం.


కెరీర్‌ కోసం ఇంటిని వదిలి!

కొన్ని కుటుంబాల్లో ఆడపిల్లలపై వివిధ రకాల ఆంక్షలుంటాయి. చదువుకోకూడదని, చిన్న వయసులోనే పెళ్లి చేయాలని.. ఇలా ఇంట్లో పెద్దలు, బంధువులు ఇబ్బంది పెడుతుంటారు. మధ్యప్రదేశ్‌కు చెందిన వైశాలీ షడంగులేకు కూడా కుటుంబం నుంచి ఇలాంటి ఒత్తిళ్లు తప్పలేదు. కానీ వాటికి తలొగ్గడం ఇష్టం లేని ఆమె.. 18 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి ముంబయి చేరింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ చదువుకుంది. అలా బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేసింది. అయితే తనకు చిన్నతనం నుంచి ఫ్యాషన్‌ డిజైనింగ్‌కి సంబంధించిన ఆలోచనలేవీ లేవు. కానీ దుస్తుల ఎంపిక, మెటీరియల్‌, వాటిని అందంగా డిజైన్‌ చేయించుకోవడంలో ఎదుటివారికి సలహాలిచ్చేదామె. నిజానికి అంతర్గతంగా ఆమెలో ఉన్న ఈ క్రియేటివిటీయే ఆమెను ఫ్యాషన్‌ డిజైనింగ్‌ వైపు అడుగులు వేయించింది.

ప్రపంచ వేదికపై చేనేత సోయగం!

అయితే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేయాలంటే బోలెడంత ఖర్చవుతుంది. అంత డబ్బు ఆమె దగ్గర లేకపోవడంతో ఫీజు కట్టలేక కాలేజీ మానేసి.. ఈ కోర్సుకు సంబంధించిన పుస్తకాల్ని ఇంటికే తెప్పించుకొని చదివేది. ఓవైపు జిమ్‌ ట్రైనర్‌గా విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు డిజైనింగ్‌ పోర్ట్‌ఫోలియోలు తయారుచేసుకునేది. జిమ్‌కి వచ్చే పలువురికి దుస్తుల విషయంలో సలహాలు, సూచనలిచ్చేది. ఆ తర్వాత బ్యాంకు రుణం తీసుకొని ‘వైశాలి ఎస్‌’ పేరిట ఓ బొతిక్‌ని ప్రారంభించింది. ఇంతింతై అన్నట్లుగా ఎదిగి ఇప్పుడు దేశంలోనే ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఘనత సాధించింది వైశాలి. 2011లో ‘విల్స్‌ ఇండియా లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్‌ వీక్‌’తో సక్సెస్‌ సాధించిన ఆమె.. లాక్మే వంటి దేశీయ ఫ్యాషన్‌ షోల్లోనే కాదు.. న్యూయార్క్‌, ప్యారిస్‌.. వంటి ఫ్యాషన్‌ వేదికల పైనా తన నైపుణ్యాలను ప్రదర్శించింది. ఇక తాజాగా మిలాన్‌లో పాల్గొని.. తద్వారా ఈ ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ పరేడ్‌లో పాల్గొన్న తొలి భారతీయ మహిళా ఫ్యాషనర్గా కీర్తి గడించింది వైశాలి. దుస్తుల తయారీకి ఎక్కువగా నేత వస్త్రాలనే ఉపయోగించే ఆమె.. మన చేనేత గొప్పతనాన్ని, అందాల్ని ప్రపంచానికి సగర్వంగా చూపించడమే తన లక్ష్యమంటోంది. ప్రదీప్‌ షడంగులేని పెళ్లి చేసుకున్న వైశాలికి ఒక పాప ఉంది.


కల నిజమైన వేళ..!

డిజైనర్లే కాదు.. మోడల్స్‌ కూడా మిలాన్‌ వంటి ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వీక్‌లో పాలుపంచుకోవాలని ఆరాటపడుతుంటారు. ‘భారతీయ ఫ్యాషన్‌ ముఖచిత్రం’గా పేరు గాంచిన మసూమ్‌ మినావాలాకు అలాంటి అరుదైన అవకాశమే దక్కింది. ఇటీవలే ముగిసిన మిలాన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్న ఆమె.. ఇందులో ర్యాంప్‌ వాక్‌ చేసిన తొలి భారతీయ కంటెంట్‌ క్రియేటర్‌గా/బ్లాగర్‌గా నిలిచింది. వైశాలీ షడంగులే రూపొందించిన ఆకుపచ్చ సిల్హౌట్‌ డ్రస్‌ ధరించి ఆమెతో కలిసి ర్యాంప్‌పై హొయలు పోయింది. ‘నేను అభిమానించే ఫ్యాషన్‌ డిజైనర్లలో వైశాలి ఒకరు. ఆమె రూపొందించిన దుస్తుల్లో మిలాన్‌ వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై నడవడం ఓ గొప్ప అనుభూతి. నా కల నిజమైంది..’ అంటోంది మసూమ్.

వ్యాపకాన్నే కెరీర్‌గా మార్చుకుంది!

ఎదిగే క్రమంలో ఫ్యాషన్‌పై మక్కువ పెంచుకున్న మసూమ్.. వ్యాపకంగా 2010లో ‘Miss Style Fiesta’ పేరుతో ఫ్యాషన్‌ బ్లాగ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఫ్యాషన్‌, బ్యూటీ, లైఫ్‌స్టైల్‌, ట్రావెల్‌.. వంటి అంశాలకు సంబంధించిన సరికొత్త ట్రెండ్స్‌, చిట్కాలతో పాటు తాను అనుసరించే టిప్స్‌ని సైతం పంచుకుంటుంది. మరోవైపు Empowher పేరుతో ఓ సోషల్‌ మీడియా వేదికను రూపొందించి.. ఆర్థిక సలహాలు, బిజినెస్‌ టిప్స్‌ పంచుకుంటోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రముఖ ఫ్యాషన్‌/లైఫ్‌స్టైల్‌ బ్రాండ్లతో కలిసి పనిచేస్తోన్న ఆమె.. గతేడాది ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లోనూ తొలిసారి మెరిసింది. ఇలా తన ఫ్యాషన్‌ జర్నీని, ప్యారిస్‌-మిలాన్‌లలో తనకెదురైన అనుభవాలను రంగరించి ఇటీవలే ఓ వెబ్‌సిరీస్‌ని కూడా రూపొందించింది మసూమ్‌. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఆమెకు 1.2 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు.


‘తొలి’ మోడల్‌గా!

ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేదికల పైన ర్యాంప్‌ వాక్‌ చేయడమే కాదు.. అంతర్జాతీయంగా పేరుమోసిన బ్రాండ్ల దుస్తులు ధరించి ఆయా వేదికలపై నడవడమూ గొప్ప ఘనతగా భావిస్తుంటారు మోడల్స్‌. భారతీయ మోడల్‌ అవంతి నగ్రాత్‌కు మిలాన్‌ ఫ్యాషన్‌ వీక్‌ ద్వారా అలాంటి అరుదైన ఘనతే దక్కింది. ఈ ఫ్యాషన్‌ పరేడ్‌లో భాగంగా.. వెర్సేస్‌ షో (ఇటలీకి చెందిన మేటి ఫ్యాషన్‌ బ్రాండ్‌ వెర్సేస్‌ రూపొందించిన దుస్తుల్ని ప్రదర్శించడం)ను ప్రారంభించిన తొలి భారతీయ మోడల్‌గా కీర్తి గడించింది అవంతి. పైగా గిగి హడిడ్‌, బెల్లా హడిడ్‌, ఎమిలీ.. వంటి మేటి మోడల్స్‌ సైతం పాల్గొన్న ఈ షోకు ఆమె లీడ్‌గా వ్యవహరించడం విశేషం. ఇక ఈ షోలో నలుపు రంగు ఓవర్‌సైజ్‌డ్‌ సూట్‌ను ధరించి అందరి చూపుల్నీ తన వైపుకి తిప్పుకుంది. అలాగే మిలాన్‌లో తొలిసారి పాల్గొన్న ఆమె.. ఇది తనకు దక్కిన గొప్ప అవకాశమంటూ మురిసిపోతోంది.

అలా అంతర్జాతీయ స్థాయికి..!

దిల్లీలో పుట్టిపెరిగిన అవంతి.. టీనేజ్‌ వయసులోనే మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించింది. 2019లో దిల్లీలో జరిగిన ‘FDCI కోఆర్డినేటెడ్‌ ఫ్యాషన్‌ వీక్‌’లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది. తన మోడలింగ్‌ నైపుణ్యాలతో అనతికాలంలోనే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్లను ఆకట్టుకుంది. తరుణ్‌ తహ్లియానీ, రాహుల్‌ మిశ్రా.. వంటి మేటి డిజైనర్ల దుస్తులు ధరించి లాక్మేతో పాటు ఇతర ఫ్యాషన్‌ షోల్లో పాల్గొన్న అవంతి.. అంతర్జాతీయంగా వెర్సేస్‌తో పాటు Bottega Veneta అనే ఇటలీ లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌కూ ప్రాతినిథ్యం వహించింది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని