వేసవిలో పాపాయి సంరక్షణ ఇలా!

మండే ఎండలకు పెద్దవాళ్లే తట్టుకోలేకపోతున్నారు. ఇక పసిపిల్లల సంగతి చెప్పనవసరం లేదు. ఎండ వేడికి, వడగాలులకు చిన్న పిల్లలు తాళలేరు. పైగా ఈ కాలంలో వీటితో పాటు వడదెబ్బ, చెమటకాయలు, విరేచనాలు, వాంతులు.. ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు....

Published : 13 May 2023 19:02 IST

మండే ఎండలకు పెద్దవాళ్లే తట్టుకోలేకపోతున్నారు. ఇక పసిపిల్లల సంగతి చెప్పనవసరం లేదు. ఎండ వేడికి, వడగాలులకు చిన్న పిల్లలు తాళలేరు. పైగా ఈ కాలంలో వీటితో పాటు వడదెబ్బ, చెమటకాయలు, విరేచనాలు, వాంతులు.. ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా చిన్నారుల్ని వేధిస్తుంటాయి. వీటన్నింటి నుంచి పసిపిల్లల్ని సంరక్షించడం తల్లులకు కత్తి మీద సాము వంటిదే. అయితే ఎండాకాలంలో ఎదురయ్యే ఈ వేడి తీవ్రత నుంచి బుజ్జాయిల్ని కాపాడుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి...

చెమట నుంచి..

ఈ కాలంలో వేధించే ఆరోగ్య సమస్యల్లో అతి ప్రధానమైంది చెమట. దీనివల్ల పిల్లల్లో చెమటకాయలు, దద్దుర్లు.. వంటి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెడ, చంకల కింది భాగంలో చెమట పేరుకుపోవడం వల్ల ఆ ప్రాంతాల్లో ఈ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్నానం చేయించే క్రమంలో ఆయా భాగాల్లో మరింత శుభ్రంగా కడగడం ముఖ్యం. ఆ తర్వాత మెత్తని కాటన్ వస్త్రంతో పొడిగా తుడవడం మర్చిపోకూడదు. లేదంటే ఆ భాగాల్లో తడి అలాగే ఉండిపోయి, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లకు దారి తీయచ్చు.

ఈ నూనెలు..

వేసవి కాలంలో పిల్లలకు రోజూ ఉదయం, సాయంత్రం.. రెండుసార్లు స్నానం చేయించడం తప్పనిసరి. అలాగే స్నానానికి ఉపయోగించే గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల వేప నూనె లేదా నీలగిరి తైలం.. వేయడం మంచిది. ఈ సహజసిద్ధమైన నూనెలు పాపాయి చర్మంపై ఉండే క్రిములను నాశనం చేయడంతో పాటు చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడతాయి.

వదులుగా..

బుజ్జాయిలకు ఎండాకాలంలో వదులుగా ఉండే మెత్తని కాటన్ దుస్తులు వేయడం మంచిది. ఎందుకంటే ఇవి చర్మం నుంచి వెలువడే చెమటను సులభంగా పీల్చుకోవడంతో పాటు చర్మానికి గాలి తగిలేలా చేస్తాయి. తద్వారా చెమటకాయలు రాకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే పాపాయిని బయటికి తీసుకెళ్లినప్పుడు తలకి టోపీ, చేతులు, కాళ్లు కవరయ్యేలా ఉండే పొడవాటి కాటన్ దుస్తుల్ని వేయడం తప్పనిసరి.

నిర్ణీత సమయాల్లో..

వేసవిలో ఎన్ని నీళ్లు తాగినా దాహమేస్తుంటుంది. పిల్లలకు కూడా అంతే. ఆర్నెళ్ల లోపు వయసున్న పిల్లలు తల్లిపాలపై ఆధారపడతారు కాబట్టి ప్రత్యేకంగా నీళ్లు తాగించాల్సిన పనిలేదు. అయితే పిల్లలకు సరిపడినన్ని పాలు పట్టడం మాత్రం మర్చిపోవద్దు. నిర్ణీత సమయానికి అనుగుణంగా పాపాయికి పాలివ్వాలి.

చల్లటి ప్రదేశంలో..

పిల్లల్ని ఉంచే ప్రదేశం మరీ వేడిగా కాకుండా.. మరీ చల్లగా కాకుండా ఉండేలా చూసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ రెండిట్లో దేనికీ పిల్లలు తట్టుకోలేరు. కాబట్టి ఇంట్లోని వేడి గాలి బయటికి పోయేలా సాయంత్రం పూట కాసేపు కిటికీలు, తలుపులు తెరచి ఉంచడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్