నా పని అయిపోయిందనుకున్నా!

భూమికి 19 వేల అడుగుల ఎత్తులో ఉమ్లింగ్‌లా పాస్‌పై బండి నడపాలన్నది ఎంతోమంది బైకర్ల కల. ప్రపంచంలోనే ఎత్తైన మోటారబుల్‌ రోడ్‌ ఇది. తాజాగా ఆ కలని నిజం చేసుకుందీ తెలుగమ్మాయి. బైకర్‌గానే కాదు సేవలోనూ దూసుకెళ్తున్న హారిక ‘వసుంధర’తో ఆ ముచ్చట్లు పంచుకుంది.

Updated : 25 Jun 2024 07:22 IST

భూమికి 19 వేల అడుగుల ఎత్తులో ఉమ్లింగ్‌లా పాస్‌పై బండి నడపాలన్నది ఎంతోమంది బైకర్ల కల. ప్రపంచంలోనే ఎత్తైన మోటారబుల్‌ రోడ్‌ ఇది. తాజాగా ఆ కలని నిజం చేసుకుందీ తెలుగమ్మాయి. బైకర్‌గానే కాదు సేవలోనూ దూసుకెళ్తున్న హారిక ‘వసుంధర’తో ఆ ముచ్చట్లు పంచుకుంది...

నువ్వే రంగాన్ని ఎంచుకున్నా పర్వాలేదు... కానీ ప్రతి రంగంలోనూ సవాళ్లుంటాయి గుర్తుపెట్టుకో అనేవారు మా అమ్మానాన్నలు. అందుకే స్టీరియోటైప్‌గా ఆలోచించడం నాకు నచ్చదు. ఇంజినీరింగ్‌ చదివి సేవా రంగాన్ని ఎంచుకోవడానికి కారణం అదే. మానాన్న మోహన్‌ సివిల్‌ ఇంజినీర్‌. స్వస్థలం నెల్లూరే అయినా, నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్, బెంగళూరులోనే ఎక్కువగా ఉన్నాం. హైదరాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయలో చదువయ్యాక... బెంగళూరులో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేశా. ఆ సమయంలో రోటరీ సంస్థ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. ముఖ్యంగా పిల్లలతో కలిసి పనిచేయడం నాకు నచ్చేది. వాళ్లతో గడపాలంటే మనకి శక్తీ, సహనం ఉండాలి. అవి రెండూ నాకున్నాయి. బెంగళూరులోని జనాగ్రహ స్వచ్ఛంద సంస్థలోని బాల జనాగ్రహలోనూ, నిర్మాణ్‌ సంస్థలోనూ ఏడేళ్లు పనిచేశా. ఇక్కడ పిల్లల హక్కులపై అవగాహన కల్పించేదాన్ని. అలాగే దిల్లీలోని ఇండియా సెంటర్‌ ఫౌండేషన్‌లోనూ పనిచేశా. సరైన సదుపాయాలు, వనరులు లేని ప్రభుత్వ స్కూళ్లకు ఆయా సదుపాయాలు కల్పించేవాళ్లం. ఇలా స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నా. ఆ క్రమంలోనే చెన్నైని వరదలు ముంచెత్తినప్పుడు నటుడు సిద్ధార్థ్‌ ప్రారంభించిన మైక్రో సహాయ కార్యక్రమంలో వాలంటీర్‌గా పనిచేశా. ఆ వరదల్లో ఎక్కడ కొట్టుకుపోతానోనని అమ్మవాళ్లు చాలా భయపడ్డారు. నాకు మాత్రం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సమయంలో ఎలా నిబ్బరంగా ఉండాలో అర్థమయ్యింది. అది కొవిడ్‌ సమయంలో ఉపయోగపడింది. కర్ణాటకలో కెప్టెన్‌ మణివణ్ణన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొంతమంది మాస్టర్‌ వాలంటీర్లని ఎంపిక చేసుకుంది. అందులో నేనొకదాన్ని. మేమంతా కలిసి ప్రజలకి ఇబ్బంది రాకుండా చూసుకున్నాం. ఆ సేవని ఆక్స్‌ఫర్డ్‌ ఒక కేస్‌స్టడీగా కూడా తీసుకుంది. మా అమ్మకి మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉండేవి. ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గలేదు. చివరికి ఆక్యుపంక్చర్‌తో తగ్గింది. దాంతో నేనూ ఆసక్తికొద్దీ ఆక్యుపంక్చర్‌ చదివా. తీరిక ఉన్నప్పుడు బెంగళూరులో ప్రాక్టిస్‌ చేస్తుంటా.

కళ్లు మూసుకున్నా...

కొవిడ్‌ సేవా కార్యక్రమాల్లో అబ్బాయిలే ఎక్కువగా ఉండేవారు. ఆ సమయంలో అనుకోకుండా వాళ్లు నడిపే బైక్స్‌ని నేనూ సరదాగా నడుపుతూ ఉండేదాన్ని. అలా రకరకాల బైక్స్‌ని నడిపినా వ్యక్తిగతంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ అంటే చాలా ఇష్టం. సౌకర్యవంతంగా ఉంటుంది. ఒంటరిగా, నా ఫ్రెండ్‌ రమ్యతో కలిసి చాలా రైడ్స్‌కి వెళ్లేదాన్ని. మా బైకర్స్‌ బృందానికి చెందిన ఓ ఫ్రెండ్‌ మాటల్లో ఉమ్లింగ్‌లా పాస్‌ గురించి విన్నా. అప్పట్నుంచీ అది నా బకెట్‌ లిస్ట్‌లో ఓ లక్ష్యంగా చేరిపోయింది. రమ్య, నేనూ ఇద్దరం శ్రీనగర్‌ వెళ్లి అక్కడ నుంచి ఉమ్లింగ్‌లా వెళ్లాలనుకున్నాం. తను హెచ్‌ఆర్‌ కావడంతో ఉద్యోగ పనులతో వెనుతిరగాల్సి వచ్చింది. నేను కొనసాగించా. లేహ్‌ నుంచి బైక్‌పై నా యాత్ర మొదలయ్యింది. ఉమ్లింగ్‌లా వెళ్లాలంటే హాన్లే గ్రామం దాటుకుని వెళ్లాలి. అక్కడ నాసా వాళ్లు ఏర్పాటు చేసిన టెలిస్కోప్‌ ఉంటుంది. అక్కడ లైట్‌ పొల్యుషన్‌ ఉండదు కాబట్టి... చాలామంది నక్షత్రాలు చూడటానికి వస్తారు. అంత వరకూ సందడిగా ఉన్నా అక్కడి నుంచి నాది ఒంటరి ప్రయాణం. హాన్లేలో స్థానికులే ఆతిథ్యం ఇస్తారు. నూనెలేని తేలికపాటి తుప్కావంటి వంటకాలు పెడతారు. అవి తిని బయలుదేరా. 19 వేల అడుగుల ఎత్తులో కదా... అక్కడ ఆక్సిజన్‌ ఉండదు. కాస్త శరీరం అలవాటు కావాలి. లేకపోతే ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోతాం. ఇరుకు రోడ్లు ఉంటాయి. తరచూ ఇసుక తుపాన్లూ వస్తుంటాయి. ఏమాత్రం అదుపు తప్పినా లోయలో పడిపోతాం. అలా ఒక ఇసుక దుమారం నన్నూ పలకరించింది. ఇసుక దెబ్బకి బైక్‌తో జారిపడ్డా. ఇక నా పని అయిపోయింది అనుకుని కళ్లు మూసుకున్నా. రోడ్‌ అంచులవరకూ వెళ్లి ఆగింది బైక్‌. అక్కడ నుంచి జాగ్రత్తగా ఒంటరిగా ప్రయాణం సాగించా. ఉమ్లింగ్‌లా బోర్డు చూడగానే కళ్లలోంచి నీళ్లు వచ్చాయి. ఇంతలో నా ఎడమ అరచేయి మొద్దుబారింది. అదోపక్క బాధ. ఎక్కేటప్పుడు రెండో గేర్‌ కన్నా వేయలేం కాబట్టి నిదానంగా వెళతాం... కానీ దిగేటప్పుడు అలా కాదు బ్రేక్స్‌ పట్టుకొనే ఉండాలి. ఈ ప్రాంతపు బౌద్దారామాలు ఎంతో బాగుంటాయి, ప్రశాంతంగా. అలాగే లద్దాఖ్‌ వంటి చోట్ల ఇంటిల్లిపాదికీ పెరట్లో సాగు చేసుకుంటారు. ఫార్మ్‌టు ప్లేట్‌ తరహాలో పెరట్లో పండించుకుని తాజాగా తింటారు. భార్యాభర్తలిద్దరూ సమానంగా కష్టపడతారు. ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలని గుండెలనిండా పదిలపరుచుకుని వెనుతిరిగా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్