పగలు ఉద్యోగం... సాయంత్రం ఇంజినీరింగ్‌!

‘చదువుకోవాలని ఉన్నా... పరిస్థితులు సహకరించలేదు!’ ఇలాంటి మాటలే మనం చాలాచోట్ల వింటూ ఉంటాం.. కానీ కొందరే ఆ పరిస్థితులకి ఎదురెళతారు. పేదరికాన్నీ, ప్రతికూల పరిస్థితులనీ ధిక్కరించి తలరాతలు మార్చుకుంటారు.

Updated : 05 Jul 2024 13:28 IST

‘చదువుకోవాలని ఉన్నా... పరిస్థితులు సహకరించలేదు!’ ఇలాంటి మాటలే మనం చాలాచోట్ల వింటూ ఉంటాం.. కానీ కొందరే ఆ పరిస్థితులకి ఎదురెళతారు. పేదరికాన్నీ, ప్రతికూల పరిస్థితులనీ ధిక్కరించి తలరాతలు మార్చుకుంటారు. కల్యాణి తుమ్మల ఈ కోవకే చెందుతారు. అమెరికాలోని ప్రఖ్యాత అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైజెస్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తోన్న ఆమె తన స్ఫూర్తి కథని వసుంధరతో పంచుకున్నారిలా... 

మేం ముగ్గురాడపిల్లలం. అక్క తరవాత నేను. ‘అయ్యో ఆడపిల్లలు.. త్వరగా పెళ్లిళ్లు చేసేయాలి’ అనే వాతావరణంలోనే చిన్నతనమంతా గడిచింది. మాది విజయవాడలోని నందిగామ దగ్గరున్న ముప్పాళ్ల గ్రామం. నాన్న విజయపార్థసారధి. అమ్మ నిర్మల. రైతు కుటుంబం. ఏడాదంతా ఇంటిల్ల్లిపాదీ కష్టపడ్డా చివరికి అప్పులే మిగిలేవి. నాకు ఊహ తెలిసినప్పట్నుంచీ చదువుకుంటూ, వ్యవసాయ పనులు చేసేదాన్ని. అప్పులు, కష్టాల మధ్య నా చదువు దినదినగండంగా సాగేది. ఎప్పుడైనా చదువు ఆగిపోవచ్చు అన్నట్టు ఉండేది మా ఆర్థిక పరిస్థితి. 

అలా కాకూడదని ప్రవేక్షపరీక్ష రాస్తే నిమ్మకూరు ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్లో సీటొచ్చింది. పదో తరగతి వరకూ అక్కడే చదువుకున్నా. టెన్త్‌లో మంచి ర్యాంకు వచ్చింది. మనసులో డాక్టర్‌ అవ్వాలని ఉన్నా, అది మా స్థోమతకి సరిపోదని అటువైపు ఆలోచించలేదు. ఓ సంస్థ ఉచితంగా కోచింగ్‌ ఇస్తే పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ రాసి, ఫ్రీ సీటు తెచ్చుకున్నా. అలా హైదరాబాద్‌ వచ్చా. పాలిటెక్నిక్‌లో టాపర్‌ని. దాంతో బీడీఎల్‌లో అప్రెంటిస్‌షిప్‌ వచ్చింది. కానీ ఖర్చులకి రూ.1200 ఇచ్చేవారు. ఆ డబ్బులు ఎటూ సరిపోని పరిస్థితి. దాంతో ఇంజినీరింగ్‌ కోసమని కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ రాశా. 11వ ర్యాంకు వచ్చింది. మంచి కాలేజీలో సీటొచ్చినా జేఎన్‌టీయూలో ఈవెనింగ్‌ కాలేజీలో చేరా. ఇలా అయితే నాన్నపై ఆధారపడకుండా పగలు ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని ఆశ. రోజంతా కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పాఠాలు చెబుతూ.. సాయంత్రం కాలేజీకి వెళ్లేదాన్ని. చదువవ్వగానే అదే జేఎన్‌టీయూలో లెక్చరర్‌గా చేరి ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా. బెంగళూరు ఐబీఎమ్‌లో ఉద్యోగం వచ్చింది. మంచి ప్యాకేజీ. కానీ నాకు ఇంకా చదవాలని ఉండేది. దాంతో ఉద్యోగం చేస్తూనే గేట్‌ రాశా. ఆల్‌ఇండియా 143వ ర్యాంకు. ఆ స్కోర్‌కి బార్క్‌(బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌) నుంచీ ఆహ్వానం అందింది. వాళ్లు గ్రేడ్‌ సి సైంటిస్ట్‌గా ఉద్యోగం ఇచ్చి, ఐఐటీ చదువుకి స్పాన్సర్‌ చేస్తామని అన్నారు. కాకపోతే మూడేళ్లు ఆ సంస్థకోసం పనిచేయాలి. కానీ నాకు ఐటీ ఉద్యోగం అంటే ఇష్టం. అందుకే ఎంటెక్‌ కోసం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చేరిపోయా. ఆ సమయంలో రూ.5వేలు స్టైపెండ్‌ వచ్చేది. ఆ డబ్బుతో చెల్లిని చదివించా. చదువు అయిపోగానే ఏడులక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది.

అమెరికా వెళ్లి..

ఇంట్లో పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి. ఏ పెళ్లి సంబంధం వచ్చినా... కట్నం ప్రస్తావన తప్పేది కాదు. కుటుంబానికి భారం కాకూడదని కట్నం లేకుండా, నాకు నచ్చిన వ్యక్తినే వివాహం చేసుకున్నా. ఆయన మిక్‌ ఎలక్ట్రానిక్స్‌లో పనిచేసేవారు. తరవాత వ్యాపారం ప్రారంభించారు. మాకో పాప. అంతాబాగుందని అనుకుంటే ఆర్థికమాంద్యం కారణంగా నష్టాలు పలకరించాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు. పాప పుట్టాక మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టా. ఆ సమయంలో చాలా డిప్రెషన్‌కి గురయ్యా. దాన్నుంచి బయటపడి, ఆర్థికంగా స్థిరపడాలన్న పట్టుదలతో అమెరికా వెళ్లిపోయాం. అక్కడ ఏడాదికి రూ.రెండు కోట్ల ప్యాకేజీతో ఉద్యోగంలో చేరా. సర్క్యూట్‌ డిజైన్‌లో పేటెంట్‌నీ అందుకున్నా. ఇప్పుడు మా పాప పదో తరగతి. మా అమ్మానాన్నలకి ఇల్లు కట్టి ఇచ్చాను. నేనున్నా లేకున్నా ఆ అద్దెలపై వాళ్లు ఆధారపడతారని. డిప్రెషన్‌ నుంచి బయటపడటానికి నాకు యోగా బాగా సహకరించింది. అందుకే అమెరికాలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ తరఫున చాలామందికి యోగా నేర్పిస్తున్నా. వాలంటీర్‌ ఫర్‌ బెటర్‌ ఇండియా, అక్షయపాత్ర, తెలుగుబడి వంటి సంస్థల్లో వాలంటీర్‌గా పనిచేస్తున్నా. నా వీకెండ్స్‌ సేవకోసమే కేటాయిస్తున్నా. సామాజిక కార్యక్రమాలకి విరాళాలు ఇస్తుంటా. మన ధర్మం నిలబడాలని హిందూ దేవాలయాలకీ విరాళాలు ఇస్తున్నా. నాలా ఎవరూ ఇబ్బంది పడకూడదని తెలిసిన ఆడ పిల్లలని చదివిస్తున్నా. అమెరికాలో పిల్లలకి తెలుగు పాఠాలు నేర్పిస్తున్నా. చివరిగా నాలాంటి అమ్మాయిలకు నేను చెప్పేది ఒకటే... ఎక్కడా ఆగిపోవద్దని!  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్