Updated : 13/09/2021 18:32 IST

కష్టాల్ని ఎదిరించి సమాజసేవలో భాగమైంది..!

కడదాకా కష్టసుఖాలు పంచుకుంటానని బాస చేసిన భర్త మధ్యలోనే వదిలేశాడు. దాంతో అప్పటిదాకా ఇంటి పనులు తప్ప... బయటి ప్రపంచం గురించి పెద్దగా తెలియని ఆమె కుటుంబ బాధ్యతలను భుజానకెత్తుకుంది. కొద్ది రోజులు చిన్నాచితకా పనులు చేసి ఇద్దరు పిల్లలను పోషించింది. అయితే ఆ అరకొర ఆదాయం ఎటూ చాలకపోగా ఓ తల్లిగా పిల్లలకు సమయం కేటాయించలేకపోయింది. అందుకే సొంతకాళ్లపై నిలబడాలనుకొని ఆటో డ్రైవర్‌గా మారింది. ఇప్పుడు సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలన్న తలంపుతో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటోంది.

ఆటో డ్రైవర్‌గా మారి!

అసోంలోని గువహటికి చెందిన ధన్మోణి బోరా కొన్నేళ్ల క్రితం భర్తతో విడిపోయింది. కానీ న్యాయపరంగా విడాకులు తీసుకోలేదు. ఎందుకంటే కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసేంత ఆర్థిక స్థోమత కూడా ఆమె దగ్గర లేదు. ఈ నేపథ్యంలో భర్తతో విడిపోయిన బోరా తన ఇద్దరు పిల్లలను పోషించడానికి కొన్ని నెలలు సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన ఓ పరిశ్రమలో ఉద్యోగానికి చేరింది. దీంతో పాటు ఇంటి సమీపంలో టైలరింగ్‌ పనికి కూడా వెళ్లింది. అయితే ఎంత కష్టపడినా అరకొర ఆదాయమే చేతికందేది. దీనికి తోడు తన ఇద్దరు పిల్లలకు అసలు సమయం కేటాయించలేకపోయింది.

అందుకే ఈ-రిక్షా కొన్నా!

ఈ క్రమంలోనే సుమారు రూ.55వేల లోన్‌ తీసుకుని ఓ ఎలక్ర్టిక్ రిక్షాను కొనుగోలు చేసింది బోరా. ‘నేను వేరొకరి ఆజమాయిషీలో పనిచేయడం వల్ల నా పిల్లలను సరిగ్గా చూసుకోలేకపోయాను. అందుకే నా సొంత కాళ్లపై నిలబడాలనుకున్నాను. పిల్లలను పోషిస్తూ నాకు కుదిరిన సమయంలోనే పనిచేయాలనుకున్నాను. అందుకే లోన్‌ తీసుకుని ఎలక్ర్టిక్‌ రిక్షాను కొనుగోలు చేశాను’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందామె.

మొదటి మహిళా డ్రైవర్‌గా!

2019 మార్చిలో మొదటిసారిగా ఆటో స్టీరింగ్‌ పట్టుకుంది బోరా. ఈ క్రమంలోనే అసోంలో మొదటి మహిళా ఈ-రిక్షా డ్రైవర్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఇలా రెండేళ్ల నుంచి ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తోన్న ఆమె ఇప్పుడు తన దృష్టిని కాస్తా సామాజిక సేవ వైపు మళ్లించింది. ఇందులో భాగంగానే ఓ ఎన్‌జీవో సహకారంతో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో ఉత్సాహంగా పాల్గొంటోంది. రోజూ ఉదయాన్నే తన ఆటోను డిస్పెన్సరీకి తీసుకెళ్లడం, టీకాలకు సంబంధించిన సామగ్రిని అందులో నింపుకోవడం, ఆ తర్వాత పెద్ద లౌడ్ స్పీకర్‌ పెట్టుకుని కరోనా టీకా గురించి అవగాహన కల్పిస్తూ గువహటి వీధుల్లో తిరగడం, అవసరమైన వారికి టీకాలు వేయడం... ఇదే ప్రస్తుతం బోరా దినచర్య.

2500మందికి పైగా!

‘అవగాహన లోపంతో ప్రారంభంలో టీకాలు వేయించుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయితే క్రమంగా మేం ప్రజల్లో అవగాహన పెంచాం. దీంతో ఇప్పుడు రోజూ 200 నుంచి 300 మంది టీకాలు తీసుకుంటున్నారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ ముందు రోజే ఫిక్స్ అవుతుంది. నాతో పాటు కొందరు ఆశా వర్కర్లు, ఎన్‌జీవో సభ్యులు ఈ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. స్థానికంగా ఉండే ఆస్పత్రులు, ఫార్మసీ కేంద్రాల్లో ఈ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నాం. టీకా కేంద్రాలకు రాలేని వారికి ఇదెంతో ఉపయోగకరంగా ఉంటోంది. ఇప్పటివరకు సుమారు 2,500మందికి టీకాలు అందించాం. ఈ బాధ్యాయుత కార్యక్రమంలో నేనూ భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. రోజూ ఉదయం 9.20కి నా డ్యూటీ మొదలవుతుంది. సాయంత్రం 5 తర్వాత ఇంటికొస్తాను’ అని అంటోందీ ఆటో డ్రైవర్‌.

నా కూతురు కంటే నాకేదీ ఎక్కువ కాదు!

కొన్ని కారణాలతో పదో తరగతికే చదువు ఆపేసిన బోరా తన ఇద్దరు పిల్లలను మాత్రం ఉన్నత చదువులు చదివిస్తానంటోంది. ‘ఇప్పుడు నా కూతురికి 12 ఏళ్లు. కొడుక్కి పదేళ్లు. ప్రపంచమంటే ఏంటో ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. వారిని ఉన్నత చదువులు చదివించి మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్నదే నా తాపత్రయం. ముఖ్యంగా నా కూతురికి చదువు ప్రాధాన్యాన్ని, జీవితంలోని కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడమెలాగో నేర్పిస్తున్నాను. ప్రస్తుతం మా ఇంట్లో ఒక్కటే స్మార్ట్‌ ఫోన్‌ ఉంది. నా వ్యాక్సినేషన్‌ విధులతో పాటు నా కూతురు ఆన్‌లైన్ క్లాసులకు ఈ ఫోన్‌ ఒక్కటే ఆధారం. అయితే చాలాసార్లు నా మొబైల్‌ను నా కూతురుకే అప్పగించి వెళ్తున్నాను. ఎందుకంటే నా కూతురు భవిష్యత్తు కంటే నాకేదీ ఎక్కువ కాదు...’ అని అంటోందీ సూపర్‌ మామ్‌.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని