Updated : 02/02/2023 00:09 IST

బాబూ...ఓటేస్తున్నారా?

వయసు 74.. కానీ యువతరంతో పోటీపడుతున్నారామె! ‘వయసు ఒక సంఖ్యే’ అంటూ మారథానుల్లో పాల్గొంటున్నారు. తాజాగా ‘రేస్‌ ఫర్‌ న్యూస్‌’ మారథాన్‌లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు.. తన పరుగుకో సందేశాన్నీ జోడించారు క్మోయిన్‌ వాహ్లాంగ్‌. ఆవిడ కథే ఇది.

‘ఏదైనా సాధించడానికి వయసు, పేదరికంతో సంబంధమేముంది’ అంటారు క్మోయిన్‌. మేఘాలయలోని చిన్న గ్రామానికి చెందిన ఈమెది నిరుపేద కుటుంబం. 12మంది సంతానం, 48మంది మనవళ్లు, మనవరాళ్లు. తన జీవితమంతా కుటుంబాన్ని చూసుకోవడంలోనే గడిచిపోయింది. 12వ సంతానాన్ని ప్రసవించాక తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారామె. ఎంతమంది వైద్యులకు చూపించినా తగ్గడం కష్టమన్నారు. శరీరాన్ని మరమ్మతు చేసుకుంటే చాలు అనారోగ్యాలు వాటంతట అవే తగ్గుతాయని నమ్మేవారామె. ఇంటి పనులతో తలమునకలయ్యే ఆవిడ తన కోసం సమయం కేటాయించుకోవడం మొదలుపెట్టారు. నడకను అలవాటుగా చేసుకున్నారు. అదికాస్తా పరుగైంది. ఈ క్రమంలో ఆవిడకు ‘రన్‌ మేఘాలయ’ అనే ఎన్‌జీఓ గురించి తెలిసింది. యాభై ఏళ్ల వయసులో అందులో చేరి అందరినీ ఆశ్చపరిచారు.

‘వర్షం వస్తే ఇల్లు మొత్తం కురుస్తుంది. వానాకాలం చినుకులు పడని మూల వెతుక్కొని కూర్చోవాలి. ఇంట్లో వాళ్లంతా రోజు కూలీలే. ఆరోజు పని దొరికితే ఇల్లు గడుస్తుంది లేదంటే పస్తులే. చిన్నతనం నుంచీ ఆటలంటే ప్రాణం నాకు. ఆ ఆసక్తి ఇల్లు గడవడానికీ తోడ్పడుతుందని తెలిశాక ఎవరేం అనుకున్నా ఫర్లేదు అనుకొన్నా. అలా పరుగు కొనసాగిస్తూ వచ్చా. పోటీలో గెలిచినపుడు బహుమతిగా వచ్చిన మొత్తాన్నీ ఇంటి కోసమే వినియోగిస్తా’ననే క్మోయిన్‌.. 2019 లో ‘టాటా ముంబయి మారథాన్‌’ పూర్తిచేసి, అందరి చూపూ తనవైపు తిప్పుకొన్నారు.

తన రాష్ట్రం తరఫున 20కిపైగా మారథాన్‌ల్లో పాల్గొన్న ఆవిడ.. ఈసారి తన పరుగుకి ఓ సందేశాన్నీ జోడించారు. ‘వోట్‌ ఫర్‌ ష్యూర్‌’ పేరిట మేఘాలయ ప్రధాన ఎన్నికల అధికారి ఓ మారథాన్‌ను నిర్వహించారు. ఔత్సాహిక విభాగంలో పాల్గొన్నావిడ 4.33గంటల 55 సెకన్లలో పరుగు పూర్తి చేశారు. ‘డబ్బు వ్యామోహంలో పడి ప్రజలు ఎవరికి ఎందుకు ఓటు వేస్తున్నారో కూడా గమనించుకోవడం లేదు. ఈ చర్య వారిని వారే సమస్యల ఊబిలోకి నెట్టేసుకోవడంతో సమానమే. ఇప్పటికైనా వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి, సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. ఓటు వేయకపోవడమూ పరిష్కారం కాదు. దీనిపై అవగాహన కల్పించాలనుకున్నా’నంటున్నారు క్మోయిన్‌. ఈ వయసులో యువతకు స్ఫూర్తినిచ్చే ఆమె మాటలు విన్నవారంతా రాబోయే ఎన్నికల్లో పోటీచేయమని సలహానిస్తున్నారు. ఆవిడ మాత్రం ‘నా దయనీయ స్థితిని చూసి కనీస సాయం కూడా చేయరు. ఇక ఓటా’ అని చమత్కరించారీ మరథాన్‌ రన్నర్‌. అది ఆమె దీనస్థితికి నిదర్శనమే అయినా దాన్ని పట్టించుకోకుండా ఆవిడ సాగుతున్న తీరు మాత్రం ఆదర్శనీయం.. కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని