Published : 05/10/2021 16:19 IST

‘మహిళ జిమ్‌ నడపడం ఏంటి..’ అన్నారు!

(Photo: Instagram)

జమ్మూ కశ్మీర్‌... మంచుతో కప్పబడి సహజ అందాలకు నెలవైన ఈ రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక రూపంలో అల్లర్లు జరుగుతుంటూనే ఉంటాయి. అంతేకాదు.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడి మహిళలపై ఆంక్షలు కూడా అధికంగానే ఉంటాయి. అయినప్పటికీ వాటిని బద్దలుకొట్టుకుని ముందుకొస్తున్నారు కొంతమంది మహిళలు. కట్టుబాట్లు అనే అడ్డుగోడలను అధిగమించి తమను తాము నిరూపించుకుంటున్నారు. ఈ కోవకే చెందుతుంది శ్రీనగర్‌కు చెందిన 33 ఏళ్ల ఆలియా ఫరూఖ్.

20 వేల మందికి ఫిట్‌నెస్‌ పాఠాలు!

మూస ధోరణులకు భిన్నంగా ఫిట్‌నెస్‌ను కెరీర్‌ ఆప్షన్‌గా ఎంచుకుంది ఆలియా. కశ్మీర్‌ లోయలోనే మొదటి సర్టిఫైడ్‌ మహిళా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే తన భర్త చేతుల మీదుగా ప్రారంభమై, నిర్వహణ లోపంతో నష్టాల్లో కూరుకుపోయిన జిమ్‌ బాధ్యతలు తీసుకుంది. జిమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా గత 8 ఏళ్లలో 20 వేలమందికి పైగా మహిళలకు ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పింది.

మా శారీరక సమస్యలు మగవారికెలా అర్థమవుతాయి?

శ్రీనగర్‌లోని ఖన్యార్‌లో పుట్టి పెరిగింది ఆలియా. అక్కడే పదో తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత శ్రీనగర్‌లోని మహిళా కళాశాలలో 12వ తరగతి, డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం దాంపత్య బంధంలోకి అడుగుపెట్టి ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. అయితే హార్మోన్ల అసమతుల్యత కారణంగా అమ్మయ్యాక భారీగా బరువు పెరిగింది ఆలియా. దీనికి తోడు డిప్రెషన్‌ ఆమెను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.

‘నా పరిస్థితిని చూసి మా ఆయన నన్ను స్థానికంగా ఉండే ఓ జిమ్‌లో చేరమన్నారు. కానీ అక్కడ పురుషులే ట్రైనర్లుగా ఉన్నారు. మన శారీరక, మానసిక సమస్యలను మగవారెలా అర్థం చేసుకుంటారు? అందుకే అమ్మను తీసుకుని దిల్లీకి వెళ్లిపోయాను. అక్కడి వైద్యులను కలిసి నా సమస్యలను వివరించాను. వారు కూడా జిమ్‌లో చేరి బరువు తగ్గించుకోవాలన్నారు. దీంతో పాటు పెళ్లై, పిల్లలుండి తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకున్న కొంతమంది మహిళలను ఉదాహరణగా చూపిస్తూ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దిల్లీ మహిళలను చూసి నేను ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను. అక్కడే ఓ జిమ్‌లో చేరి నాలుగు నెలల్లో 28 కేజీలు తగ్గాను..’

జిమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా బాధ్యతలు తీసుకొని!

‘అంతకు ముందే ఖన్యార్‌లోనే మా ఆయన ‘ఫిట్‌నెస్‌ సొల్యూషన్‌’ పేరిట ఓ జిమ్‌ను ఏర్పాటుచేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల దానిని సరిగా నిర్వహించలేకపోయాడు. పైగా అందులో ట్రైనర్‌గా ఓ పురుషుడే ఉండడంతో మహిళలెవరూ జిమ్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో- నేను దిల్లీ నుంచి తిరిగొచ్చాక హైదరాబాద్‌లో జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌గా శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌ బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌లో చేరి ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌లో మరిన్ని మెలకువలు తీసుకున్నాను. ఆ తర్వాత మావారు ప్రారంభించిన జిమ్ బాధ్యతలను పూర్తిగా నా చేతుల్లోకి తీసుకున్నాను. ఫిట్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్‌గా మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను..’

‘మహిళ... జిమ్‌ నడపడం ఏంటి?’

‘ఒక మహిళ శారీరక, మానసిక సమస్యలను మరో మహిళే బాగా అర్ధం చేసుకోగలదు. ఈ క్రమంలో జిమ్‌లో కూడా వారికి మహిళా ట్రైనర్లే ఉండడం మంచిది. నేను జిమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో మా జిమ్‌కు వచ్చే మహిళల సంఖ్య క్రమంగా పెరిగిపోయింది. ఎందుకంటే అప్పటివరకు కశ్మీర్‌లో మహిళా ట్రైనర్‌ ఉన్న జిమ్‌ లేదు కాబట్టి. ఇక జిమ్‌ ప్రారంభ సమయంలో నాకు కొన్ని సవాళ్లు, సమస్యలు ఎదురయ్యాయి. ‘ఒక మహిళ జిమ్‌ నడపడం ఏంటి?’ అని చాలామంది నన్ను వెనక్కులాగే ప్రయత్నం చేశారు. కానీ నేను ఆ మాటలను సీరియస్‌గా తీసుకోలేదు. నా భర్త, అత్తమామల సహకారంతో ధైర్యంగా ముందుకెళ్లాను..’

జిల్లాకో జిమ్‌ను ఏర్పాటుచేయాలనుకుంటున్నా!

‘మహిళలందరూ తమ జీవనశైలిలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి. ముఖ్యంగా హై బీపీ, డయాబెటిస్‌, సంతానోత్పత్తి సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా ప్రతిరోజూ కొన్ని రకాల ఎక్సర్‌సైజులు చేయాలి. గత 8 ఏళ్లలో 20 వేలమందికి పైగా మహిళలు నా వద్ద ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకున్నారు. ఇప్పుడు కూడా ఎంతోమంది మహిళలు జిమ్‌కు వచ్చి ఫిట్‌గా మారి తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుంటున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రతి జిల్లాలోనూ ఇలాంటి జిమ్‌లు ఏర్పాటుచేయాలనుకుంటున్నాను’ అని అంటోందీ ఫిట్‌నెస్‌ ట్రైనర్.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని