Anisa Bilal: అరవైల్లో.. వ్యాపారవేత్తయ్యింది!

అరవయ్యేళ్లు వచ్చాయంటే ఇంకేముందిలే జీవితం అయిపోయింది అనుకుంటారు చాలా మంది. కానీ 67 ఏళ్ల వయసులో ఉత్సాహానికి చిరునామాగా ఉన్నారామె. మూడు దశాబ్దాలకు పైగా టీచర్‌గా చేసి రిటైరైన అనిసా బిలాల్‌ కృష్ణా రామా అంటూ కాలక్షేపం చేద్దామనుకోలేదు.

Published : 02 Jun 2023 00:17 IST

అరవయ్యేళ్లు వచ్చాయంటే ఇంకేముందిలే జీవితం అయిపోయింది అనుకుంటారు చాలా మంది. కానీ 67 ఏళ్ల వయసులో ఉత్సాహానికి చిరునామాగా ఉన్నారామె. మూడు దశాబ్దాలకు పైగా టీచర్‌గా చేసి రిటైరైన అనిసా బిలాల్‌ కృష్ణా రామా అంటూ కాలక్షేపం చేద్దామనుకోలేదు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో పెద్ద వ్యాపారమే ఆరంభించి, విజయవంతంగా దూసుకుపోతున్నారు. ఆ స్ఫూర్తి ప్రయాణం ఆవిడ మాటల్లోనే...

ప్రభుత్వ పాఠశాలలో 32 ఏళ్లు టీచరుగా చేసి రిటైరయ్యా. ఖాళీగా ఉండటం నచ్చక ఏదైనా చేయాలి.. అది నాకు, ఇతరులకూ కూడా మేలు చేసేదై ఉండాలి అనుకున్నప్పుడు.. కశ్మీరీ ఆహార ఉత్పత్తుల ఆలోచన వచ్చిందావిడకు. రిటైర్మెంట్‌ సొమ్మును, దాచుకున్న ధనాన్ని పెట్టుబడిగా పెట్టి బాదం, వాల్‌నట్స్‌, తేనె, కుంకుమ పువ్వు, జీడిపప్పులతో 2021లో వ్యాపారం ఆరంభించారు. ‘‘వాటి నాణ్యత కనిపెట్టే కనీస జ్ఞానం కూడా అప్పట్లో లేదు. నా తపన, అంకితభావాలే అన్నీ నేర్పించాయి. ‘వైల్డ్‌ వ్యాలీ ఫుడ్స్‌’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ  ప్రారంభించాను. రెండేళ్లు కష్టపడితే 7.5 వేల మంది ఫాలోయర్లు వచ్చారు. ఆ కొండా కోనల్లో రైతులను కలుస్తూ రసాయనాల వాడకంపై అవగాహన కల్పించే దాన్ని. కుంకుమ పూలు, పుల్వామా, జీలకర్ర కోసం కార్గిల్‌, నేరేడుపండ్లకు లద్దాఖ్‌, పుట్ట గొడుగుల కోసం కశ్మీర్‌- ఇలా అత్యుత్తమమైనవి ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్లేదాన్ని. ఎక్కువ ఆర్డర్లు ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తర్వాత వాట్సప్‌, ఫేస్‌బుక్‌ల నుంచి వస్తున్నాయి.
కశ్మీరు వాతావరణం గురించి చెప్పేదేముంది? ఈ లోయల్లో తేనె, కుంకుమ పువ్వు, అడవి పుట్టగొడుగులు, ఎండు కూరగాయలు, తాజాపండ్లు, సోయాబీన్స్‌, అలసందలు లాంటివన్నీ సేంద్రియ ఎరువులతో పండిస్తారు. వీటికి ఎరువులు వాడకపోవడమే కాదు. సూర్య రశ్మిలోనే ఎండబెడతాం. అందుకే ఆ రుచీ, పరిమళం వేరేవాటికి రాదు. ఇక్కడి ‘గుచ్చి’ మష్రూమ్స్‌ మహా అరుదైనవి. అవి కుళ్లిపోతున్న కలపపై పెరుగుతాయి. వాటిల్లో ఐరన్‌, కాపర్‌, డి-విటమిన్‌ ఉంటాయి. వీటి ధర వంద గ్రాములే రూ.2.5వేలు ఉంటుంది. ఇవి ఒక్కో రైతు వద్ద కిలో, కిలోన్నర కంటే దొరకవు. ఇక్కడి పర్వతవెల్లుల్లి సాధారణ వాటి కంటే ఏడింతలు మెరుగైంది. కొండవాలులోని కొన్ని పంటలకు పరికరాలు ఉపకరించవు. చేతులే సాధనాలు. ఇంత క్లిష్టం కనుక ఖరీదూ ఎక్కువే. కశ్మీరీ ఎర్రబియ్యం పాకిస్థాన్‌ సరిహద్దులోని భారతదేశపు చివరి ఊరుగా పిలుచుకునే తంగ్ధర్‌లో పండుతాయి. రుచీ, ఆరోగ్యం కూడా.

తేనెలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌, ఎండిన గులాబిరేకలు, ఎండు సీమదానిమ్మ, బీన్స్‌ రకాలు, ఎండు ద్రాక్ష, మబ్రూమ్‌ ఖర్జూర, బెర్రీపళ్లు, బాదం నూనె, నేరేడు నూనె, మిర్చి రకాలు, ఎండబెట్టిన కూరగాయలు కూడా సరఫరా చేస్తున్నా. ముందు అనుకున్నదానికంటే వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతోంది. రైతుల సహకారం వల్లే ఇదంతా సాధ్యమైంది. ప్రతి దశలోనూ పరిశుభ్రత పాటిస్తాం. స్టీలు, గాజు జార్లలో భద్రపరుస్తాం.

కానుకగా ఇచ్చేవారి కోసం అందమైన గిఫ్ట్‌ బాక్సులు, బాస్కెట్లను కశ్మీరీ కళాకారుల వద్ద కొంటాను. సంచుల్లాంటివన్నీ పర్యావరణ హితమైనవే ఉపయోగిస్తా. కాశ్మీర్‌లో దొరికే మరెన్నో కూరగాయలను, ఇక్కడి మసాలాల ఘుమఘుమలనూ ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నా. కాలం వృథా చేయడం కంటే నలుగురికి మేలుచేసే పనిలో ఆనందం ఉంటుంది కదా! నా వల్ల స్థానికులకు ఉపాధి దొరకడం, కొనుగోలుదారులు సంతృప్తి వ్యక్తం చేయడం సంతోషాన్ని కలిగిస్తుంది’ అంటున్న అనిసా బిలాల్‌.. ఆశయాలను నెరవేర్చు కోవడానికి వయసు ఎన్నడూ అడ్డంకి కాదని చాటిచెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్