Sridevi: ఒంటరివాళ్ల కోసం ఉద్యోగం వదులుకున్నా

పిల్లలు స్థిరపడే వరకూ కన్నవాళ్లు కంటికి రెప్పలా కాచుకుంటారు. వారి భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అలాంటి వారికి చివరి దశలో తోడుగా ఉండగలిగే వారెంతమంది? ఈ ఆలోచన డాక్టర్‌ శ్రీదేవిని కలచివేసింది.

Published : 01 May 2023 00:18 IST

పిల్లలు స్థిరపడే వరకూ కన్నవాళ్లు కంటికి రెప్పలా కాచుకుంటారు. వారి భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అలాంటి వారికి చివరి దశలో తోడుగా ఉండగలిగే వారెంతమంది? ఈ ఆలోచన డాక్టర్‌ శ్రీదేవిని కలచివేసింది. తన సంస్థ ‘అర్గల’ ద్వారా పరిష్కారాన్నీ చూపుతున్నారామె. ఆ సేవలు ఆమె మాటల్లోనే...

కొన్ని ఘటనలు జీవితంలో అనుకోని మార్పులు తెస్తాయి. 2019లో నాకూ అలాంటి పరిస్థితే ఎదురైంది. మా ఆత్మీయులొకరు సమయానికి వైద్యం అందక చనిపోయారు. ఆయన పరిస్థితిని గమనించి ఎవరైనా అంబులెన్స్‌కి ఫోన్‌ చేసుంటే ఆయనకు ముప్పు తప్పి ఉండేది. ‘ఒక్క క్లిక్‌తో కోరుకున్నవన్నీ ఇంటికే వస్తోన్న రోజులివి. వైద్యాన్నీ అలా అందివ్వగలిగితే’ అన్న ఆలోచన వచ్చింది. నిజానికి ఇది ఎప్పట్నుంచో ఉన్న విధానమే! అయితే సాంకేతిక పరిజ్ఞానం లేనివారు ఉపయోగించుకోలేరు కదా అన్న ఆలోచనే ‘అర్గల’ ప్రారంభానికి కారణమైంది. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌. హెల్త్‌కేర్‌, కమ్యూనికేషన్స్‌లో పీహెచ్‌డీ చేసి ముప్పై ఏళ్లు వివిధ ఆసుపత్రుల్లో పనిచేశా. మారుమూల గ్రామాలకీ వైద్యం అందేలా తీసుకోవాల్సిన చర్యలు, అక్కడున్న పరిస్థితులు, ప్రజలపై అవగాహన వంటివి అనుభవపూర్వకంగా తెలుసుకున్నా.

కరోనా మార్చింది...

ఆర్థికంగా ఏ లోటు లేదు, లక్షల్లో జీతం. ఇంతకన్నా జీవితంలో ఏం కావాలనిపించేది. ఈ ఆలోచనని కరోనా మార్చింది. ఎటు చూసినా శ్మశాన నిశ్శబ్దం. పలకరింపులు లేవు. వృద్ధుల పరిస్థితి మరీ దారుణం. అయినవారు దగ్గర లేక, వ్యాధి భయంతో తల్లడిల్లిన ఎంతో మందిని చూశా. పిల్లల భవిష్యత్తు కోసమంటూ చెమటోడ్చి సంపాదించిందంతా పెట్టి, విదేశాలకు పంపుతున్నారు. వాళ్లక్కడ స్థిరపడుతోంటే సంతోషిస్తున్నారు. కానీ వాళ్లు మాత్రం ఇక్కడ ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇలాంటి వాళ్ల కోసం ఏమైనా చేయాలనుకున్నా. ‘అర్గలా హోమ్‌ హెల్త్‌ కేర్‌ సర్వీస్‌’ ప్రారంభించా. దీని ద్వారా ఒక్క ఫోన్‌ కాల్‌తో వృద్ధులకు కావాల్సిన సేవలన్నీ ఇంటికే వస్తాయి. 24 గంటలు ప్రత్యక్ష సేవలు అందిస్తున్నాం. దీని కోసం ఒక అత్యవసర వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాల్‌ రాగానే వారికి అస్వస్థతను బట్టి, సంబంధిత స్పెషలిస్ట్‌ని పంపిస్తాం. సీనియర్‌ వైద్యులు నిత్యం పర్యవేక్షిస్తుంటారు. పేరెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌, శస్త్రచికిత్సల అనంతర వైద్యంతోపాటు వీడియో కాల్‌ ద్వారానూ సేవలను అందిస్తున్నాం. ఆర్థో, న్యూరో, కార్డియాక్‌ విభాగాల్లో వైద్య సాయం చేస్తున్నాం.


గవర్నర్‌ మెప్పు

నా ఆలోచనను ఆచరణలో పెట్టడానికి రెండేళ్లు పట్టింది. దీనికోసం ఎంతో పరిశోధించా. ఉద్యోగాన్నీ వదులుకున్నా. శభాష్‌ అని కొందరంటే.. ‘ఎందుకు మీకివన్నీ చక్కగా ఉద్యోగం చేసుకోక’ అన్న సలహా ఇచ్చిన వారు మరికొందరు. నా కుటుంబ సభ్యులు మాత్రం వెన్నంటి ప్రోత్సహించారు. నా సేవలకు గుర్తింపుగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ నుంచి పురస్కారం అందుకున్నా. ఇప్పటివరకూ 500కుపైగా కుటుంబాలకు తోడ్పడ్డాం. ఈ సేవలకు మేం తీసుకునేదీ నామమాత్రపు ఫీజే! వైద్యం కోసం ఎదురు చూస్తూ ఎవరూ నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోకూడదన్నదే నా లక్ష్యం.

- దాసరి భాస్కర్‌, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని