Dongri vistarubaayi: అమ్మ గెలిచింది...
పేదరికం... నిరక్షరాస్యత, ఇరవై ఏళ్లకే భర్తను కోల్పోవడం, ముగ్గురు పిల్లల బాధ్యతను ఒంటరిగా మోయాల్సి రావడం... ఇవి చాలవా దిగులుతో కుంగిపోవడానికి! కానీ, కుమురం భీం జిల్లా తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రి విస్తారుబాయి పరిస్థితులతో పోరాడింది.
పేదరికం... నిరక్షరాస్యత, ఇరవై ఏళ్లకే భర్తను కోల్పోవడం, ముగ్గురు పిల్లల బాధ్యతను ఒంటరిగా మోయాల్సి రావడం... ఇవి చాలవా దిగులుతో కుంగిపోవడానికి! కానీ, కుమురం భీం జిల్లా తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రి విస్తారుబాయి పరిస్థితులతో పోరాడింది. బిడ్డల్ని ఉన్నతస్థాయిలో చూడాలనే లక్ష్య్ణంతో పాచి పనులు చేసింది. వంట మనిషిగా మారింది. ఆ కష్టమే... తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఆమె పెద్ద కొడుకు రేవయ్య 410 ర్యాంకు సాధించేలా చేసింది...
విస్తారు బాయిది మారుమూల గిరిజన గ్రామం. కూలీనాలీ చేసుకుని బతికే మల్లయ్య నానాబాయిల ఐదుగురు సంతానంలో ఆమె ఒకరు. ఇల్లు గడవాలంటే.... ఇంటిల్లిపాదీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి కావడంతో అక్షరం ముక్క నేర్వలేదు. పదహారేళ్లు నిండకుండానే ఆమెకు తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రి మనోహర్‌తో పెళ్లి చేశారు. ఐదేళ్లలో ముగ్గురు పిల్లలకు తల్లయ్యింది. వారిని పెద్ద చదువులు చదివిద్దామంటూ భర్త దగ్గర నుంచి మాట తీసుకుంది. కానీ, జీవితం ఎప్పుడూ ఊహించినట్లుగా ఉండదు కదా! ఆపై కొద్దిరోజులకే భర్త అనారోగ్యంతో మరణించాడు. ‘మావారు చనిపోయే నాటికి నా వయసు 21 ఏళ్లు. బిడ్డల్ని ఎలా సాకాలో తెలియక నిద్రలేని రాత్రుళ్లెన్నో గడిపా. నిలువ నీడ కూడా లేకపోవడంతో అన్నయ్య సాయంతో ఓ చిన్న గుడిసె వేసుకున్నా. ఇళ్లల్లో పాచిపనులు చేసి పిల్లల కడుపు నింపేదాన్ని. తినీ తినకా రూపాయి రూపాయి పొదుపు చేసి మహిళా సంఘంలో చేరా. అప్పుడే స్థానిక పాఠశాలలో వంటచేసే అవకాశమూ దక్కింది. నెలకు రూ.1000 ఇచ్చి అన్నం పెడతామన్న మాట విని నా ప్రాణం లేచొచ్చింది’ అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది.
అన్నం తిననివ్వలేదు... ఈ ప్రయాణంలో ఒంటరి మహిళగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. వితంతువంటూ కొందరు హేళన చేసేవారు. తక్కువ కులమని ఆమె చేసిన వంటను తిననిచ్చేవారు కాదు ఇంకొందరు. వాటన్నింటినీ దిగమింగుకుని ఆ మాతృమూర్తి తన బిడ్డలకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వాలని భావించింది. అందుకు చదువే దారి చూపిస్తుందని నమ్మింది. తాను పడ్డకష్టాలేవీ పిల్లలకు తెలియనివ్వలేదు. వారి చదువులకు ఆటంకం కలగనివ్వలేదు. పిల్లలు అమ్మ కన్నీటి కష్టాలు తీర్చడానికి రాత్రీ పగలూ జాగారం చేసి మరీ పుస్తకాలతో కుస్తీపట్టారు. ముగ్గురూ ఉన్నత స్థాయిలో నిలబడ్డారు.
దాతల సాయంతో... పెద్ద కొడుకు రేవయ్య మద్రాసు ఐఐటీకి ఎంపికైనప్పుడు... చేతిలో బస్సు ఛార్జీలకు సైతం డబ్బుల్లేని పరిస్థితిపై ‘ఈనాడు’లో కథనాలు ప్రచురితమయ్యాయి. దాతలు స్పందించడంతో చదువు పూర్తయ్యింది. కూతురు స్వప్న నాగ్‌పుర్ ఐఐటీకి ఎంపికైనప్పుడూ ‘ఈనాడు’ ద్వారా ఆర్థిక సాయమందింది. ప్రస్తుతం స్వప్న అక్కడే కెమికల్ ఇంజినీరింగ్ చివరి ఏడాది చదువుతోంది. మరో కొడుకు తిర్యాణిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. చదువయ్యాక రేవయ్య ఓఎన్‌జీసీలో నెలకు రూ.2 లక్షల వేతనంతో ఉద్యోగం అందుకున్నాడు. ఐదేళ్లు చేశాక... తనలాంటి మరెందరికో చేయూతనివ్వాలనే లక్ష్యంతో సివిల్స్‌కి సన్నద్ధమయ్యాడు. రెండో ప్రయత్నంలో 410 ర్యాంకుతో ఐఏఎస్ సాధించాడు. అమ్మ బతుకుపోరుకి విలువ కల్పించాడు.
- చొక్కాల రమేశ్, ఆసిఫాబాద్,
జగడం సత్యనారాయణ, రెబ్బెన
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.