Har Raj Kour: సూడాన్‌లో మనవాళ్లకు అండగా!

బోయింగ్‌ సి-17 గ్లోబ్‌ మాస్టర్‌.. పేరుకు తగ్గట్టే 2లక్షల టన్నుల బరువు ఉంటుంది. దీన్ని నడపాలంటే దమ్ముండాలి. ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ హర్‌రాజ్‌ కౌర్‌ బొపరాయ్‌కి అది కావాల్సినంత ఉంది.

Updated : 29 Apr 2023 04:42 IST

బోయింగ్‌ సి-17 గ్లోబ్‌ మాస్టర్‌.. పేరుకు తగ్గట్టే 2లక్షల టన్నుల బరువు ఉంటుంది. దీన్ని నడపాలంటే దమ్ముండాలి. ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ హర్‌రాజ్‌ కౌర్‌ బొపరాయ్‌కి అది కావాల్సినంత ఉంది. అందుకే ఆపరేషన్‌ కావేరీలో దాన్ని చాకచక్యంగా నడిపి సూడాన్‌లో చిక్కుకున్న మనవాళ్లని స్వదేశానికి తీసుకొచ్చింది. ఇంతకీ ఎవరీమె...

ప్రపంచ దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు సంభవించినప్పుడు క్షతగాత్రులకు అత్యవసర సాయం అందిస్తారీమె. యుద్ధప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను మాతృదేశానికి తరలించే  బాధ్యత తీసుకుంటారు. అలా సూడాన్‌ అంతర్యుద్ధంలో బాంబు దాడుల్లో చిక్కుకొని.. ఎందరో భారతీయులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్‌ కావేరి’లో భాగంగా వారిని స్వదేశానికి తరలించిన భారతవాయుసేనలోని ఏకైక తొలి మహిళా పైలట్‌గా తాజాగా వార్తల్లోకెక్కారు. 

సవాళ్లను దాటి..

హర్‌రాజ్‌కౌర్‌ హిండన్‌ ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో భారతీయులను స్వదేశానికి చేర్చడం సవాళ్లతో కూడిన బాధ్యత అంటారీమె. ‘ఆపరేషన్‌ కావేరీలో భాగంగా సూడాన్‌లోని ఖర్టోమ్‌ చుట్టుపక్కల యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతాల నుంచి ప్రజలను అతికష్టంపై అక్కడి పోర్టుకు తీసుకొస్తున్నారు. దాదాపు 18 గంటలపాటు 850 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు వాహనాల్లో ప్రయాసకోర్చి మరీ చేరుకుంటున్న భారతీయులందరినీ పోర్టు నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి దశలవారీగా దాదాపు 600మందిని భారతదేశానికి తరలించాం. వీరిలో కొందరు గాయాలతో ఉన్నారు. ప్రాణాలు గుప్పెట పెట్టుకొన్న వీరిని మాతృదేశానికి తీసుకురావడం నాకు సంతోషంగా ఉంది. ఉక్రెయిన్‌ యుద్ధంలో భారతీయులను అక్కడి నుంచి మాతృదేశానికి తరలించిన ఆపరేషన్‌ గంగ, తుర్కియేలో భూకంపం వచ్చినప్పుడు అక్కడ చిక్కుకున్న మనవారికి అత్యవసర సాయం అందించేలా చేసిన ఆపరేషన్‌ తుర్కియే వంటి పలు రెస్క్యూ ఆపరేషన్స్‌లో సేవలందించా. ఇటువంటి అవకాశాలు రావడం సవాల్‌గా తీసుకుంటా. తుర్కియే భూకంపంలో వేలాదిమంది చనిపోగా, ప్రాణాలతో బయటపడినవారికి అత్యవసర సాయం అందించాం. ఈ మిషన్‌కు కేంద్రం సి-17 విమానాన్ని కేటాయించడంతో అతి తక్కువ సమయంలోనే ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకొని బయలుదేరాం. తీరా అక్కడ ల్యాండ్‌ అవడానికి రన్‌వే పరిస్థితి ఎలా ఉందో తెలియలేదు. ఆ సమయంలో భూకంపంలో దెబ్బతినని ప్రాంతాలపై మీడియా, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం ద్వారా అందిన సమాచారం మాకు ఉపయోగపడింది. సురక్షితంగా ల్యాండ్‌ అవగలిగాం. రక్షణ, సేవాదళాలు సహా వైద్య పరికరాలు, సామాన్లు, మందులను అక్కడి ప్రమాద ప్రాంతాలకు తరలించాం. ఆహారం అందక, చికిత్సకు నోచుకోక అల్లాడుతున్న బాధితులు, క్షతగాత్రులకు సాయం అందించడం మనసుకు తృప్తినిస్తుంది. ఈ అత్యంత భారీ విమానాన్ని మొదటిసారి నడిపేటప్పుడు కలిగిన అనుభూతిని మాత్రం మరవలేను. విధుల్లో భాగంగా అతి పెద్ద సాహసం చేయడానికి పూనుకుంటేనే మనం కన్న కలలను నిజం చేసుకున్నట్లు అనిపిస్తుందంటా’రు హర్‌రాజ్‌ కౌర్‌ బొపరాయ్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని