Influencers: వీళ్లకి అగ్రతారలూ ఫిదా!
అభిమానులంటే సినీతారలకే అన్నది నిన్నటి మాట. చిట్టి, పొట్టి వీడియోలతోనే కోట్లమంది మనసులను కొల్లగొట్టేస్తున్నారీ అమ్మాయిలు. అంతేనా.. అగ్ర తారలు కూడా సినిమా ప్రచారాలకు వీళ్ల సాయం తీసుకునేలా చేస్తున్నారు.
అభిమానులంటే సినీతారలకే అన్నది నిన్నటి మాట. చిట్టి, పొట్టి వీడియోలతోనే కోట్లమంది మనసులను కొల్లగొట్టేస్తున్నారీ అమ్మాయిలు. అంతేనా.. అగ్ర తారలు కూడా సినిమా ప్రచారాలకు వీళ్ల సాయం తీసుకునేలా చేస్తున్నారు. అతి సాధారణ నేపథ్యాల నుంచి వచ్చినా... ఆసక్తి, ప్రతిభ, సృజనాత్మకత ఉంటే ఎలా దూసుకుపోవచ్చన్నది ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లను చూస్తే అర్థం అవుతుంది.
టిక్‌టాక్ నుంచి..
హీరో నాని ‘దసరా’ తమిళ వెర్షన్ ప్రచారంలో ‘మైనారు వెట్టికట్టి’ పాటకి పాదం కదిపిందో అమ్మాయి. నెట్‌లో ఆ వీడియో చూసి తను ఎవరా అని నెటిజన్లు ఆన్‌లైన్‌లో తెగ వెదికారు. రమ్య రంగనాథన్.. చెన్నై అమ్మాయి. ఆడిటింగ్ ప్రొఫెషనల్. మంచి డ్యాన్సర్, మోడల్, నృత్యదర్శకురాలు. తన డ్యాన్స్ వీడియోలను టిక్‌టాక్‌లో పంచుకొని లక్షల అభిమానుల్ని సంపాదించుకుంది. ‘ఆర్ స్క్వేర్డ్’ పేరుతో 2021లో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల్లో అడుగుపెట్టింది. ‘వన్ మినిట్ మ్యూజిక్’ పేరుతో సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌తో చేసిన డ్యాన్స్ వీడియో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చింది. అలా సినీతారలతో పనిచేసే అవకాశాలొచ్చాయి. నయనతార, నాని, చాలా మంది తమిళ నటీనటులతోపాటు తాజాగా పీఎస్2కీ పనిచేసింది. ఈమె డ్యాన్స్ వీడియోలకు లక్షల్లో వీక్షణలు.
అనుసరిస్తున్నవారు
యూట్యూబ్, ఇన్‌స్టాలో ...3.5 లక్షలు
ఉద్యోగాన్ని వదులుకొని..
ఎత్తు తక్కువన్న కారణంతో ఎన్నో సినిమా అవకాశాలు పోగొట్టుకొంది అలేఖ్య హారిక. బీబీఏ చదివిన ఈ హైదరాబాదీ అమెజాన్‌లో ఉద్యోగాన్నీ సంపాదించింది. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ పిచ్చి. దీంతో కొరియోగ్రాఫర్ అవ్వాలని ఉద్యోగాన్నీ వదులుకొంది. నటన ఆలోచనే లేదు. అయితే ఓ స్నేహితురాలి వల్ల అనుకోకుండా వెబ్‌సిరీస్ అవకాశమొచ్చింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదిక. ‘దేత్తడి’, ‘ఫ్రస్టేటెడ్ తెలంగాణ పిల్ల’తో మాంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో యూట్యూబ్‌లో ‘దేత్తడి’ ఛానెల్ ప్రారంభించి తన విశేషాలతోపాటు షార్ట్‌ఫిల్మ్స్‌నీ పంచుకుంటోంది. మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా. తన వీడియోలకు లక్షల్లో వీక్షణలు. ఈ ఆదరణ చూసే సినిమా ప్రచార అవకాశాలూ వచ్చాయి. బ్రహ్మాస్త్ర కోసం రణ్‌బీర్‌తో కలిసి షార్ట్ వీడియో చేసిన తను సమంత, తాప్సి వంటి వారితోనూ పనిచేసింది.
అనుసరిస్తున్నవారు
యూట్యూబ్‌లో...19 లక్షలు, ఇన్‌స్టాలో ...16 లక్షలు
స్టైలిస్ట్ కావాలనుకొని..
బక్కమ్మాయి, ఎత్తు పళ్లు.. చిన్నప్పటి నుంచీ డాలీ సింగ్‌ని ఇలానే వెక్కిరించేవారు. ఇవే తనకు ఫ్యాషన్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టేలా చేశాయి. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ తనది. పేద కుటుంబం. కొద్ది దుస్తులతోనే రకరకాల ప్రయోగాలు చేసేది. వాటిని తన ఫ్యాషన్ బ్లాగులో పంచుకునేది. డిగ్రీలో పొలిటికల్ సైన్స్ చదివినా నిఫ్ట్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌లో పీజీ చేసింది. 2015లో యూట్యూబ్‌లోకీ వచ్చింది. గుర్తింపు మాత్రం ‘ఐదివా’లో ఇంటర్న్‌షిప్‌తో వచ్చింది. దానిలో ‘రాజు కీ మమ్మీ’ పేరుతో సామాజిక అంశాలపై కామెడీ స్కిట్‌లు రాసి, నటించేది. అవి విపరీతంగా ఆకట్టుకోవడంతో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిపోయింది. తనకి స్టైలిస్ట్ కావాలన్నది కల. తన ఫ్యాషన్ చిట్కాలకీ అభిమానులెక్కువ. తారల ఇంటర్వ్యూలు, కామెడీ షోల్లో మెప్పించి, సినిమా ప్రమోషన్ల స్థాయికి వెళ్లింది. బాలీవుడ్‌లో అగ్ర తారలందరితో పనిచేసిన తను ఫోర్బ్స్ జాబితాలోకీ ఎక్కింది. రాడ్ లివింగ్ పేరుతో క్యాండిళ్ల వ్యాపారాన్ని ప్రారంభించిన డాలీ.. వెబ్‌సిరీస్‌లు, సినిమాల్లోనూ నటిస్తోంది.
అనుసరిస్తున్నవారు
యూట్యూబ్‌లో ... 7 లక్షలు, ఇన్‌స్టాలో ...16 లక్షలు
సరదాగా మొదలుపెట్టి..
యష్, మహేష్‌బాబు, షాహిద్ కపూర్, దుల్కర్ సల్మాన్, ఆమిర్ ఖాన్, విజయ్ దేవరకొండ.. తక్కువ వ్యవధిలోనే ఇంకా ఎందరో అగ్ర హీరోలతో పనిచేసింది నిహారిక ఎన్.ఎం.. మన చుట్టూ జరిగే సంఘటనలకే వ్యంగ్యాన్ని జోడించి తను చేసే వీడియోలకు లక్షల్లో వీక్షణలు. వాటితోనే 5 భాషల సినీ ప్రముఖులను ఆకర్షించేసింది. బెంగళూరులో పెరిగిన తెలుగమ్మాయి. ఇంటరయ్యాక వ్యాపకంగా యూట్యూబ్‌లోకి వచ్చింది. ఇంజినీరింగ్ చేసి ఎంబీఏ కోసం అమెరికా వెళ్లింది. లాక్‌డౌన్‌లో సరదాగా ఇన్‌స్టా రీల్స్ ప్రారంభించింది. ఇంగ్లిష్‌కి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ యాస జోడించి కామెడీ, వ్యంగ్యంతో కూడిన చిన్న వీడియోలు చేస్తుంది. వాటికి ఆదరణ పెరిగి ప్రొడక్ట్స్‌తోపాటు సినిమా ప్రచార అవకాశాలూ దక్కించుకుంది.
అనుసరిస్తున్నవారు
యూట్యూబ్‌లో ... 23 లక్షలు, ఇన్‌స్టాలో ...32 లక్షలు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.