Kalyani Dwibhashyam: ఆ కీర్తన వేలసార్లు పాడా!
‘పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు..’ అంటూ ఆమె మైమరిచి పాడుతుంటే కళ్లెదుట శ్రీనివాస కల్యాణ వైభవం సాక్షాత్కరించాల్సిందే! పాట ప్రతి ఒక్కరికీ అని నమ్మి 30 ఏళ్లుగా సంగీత సేవ చేస్తూ.. దేశదేశాల్లో ‘అన్నమయ్య పాట... అందరి నోటా’ పలకాలని కృషి చేస్తున్నారు కల్యాణి ద్విభాష్యం.
‘పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు..’ అంటూ ఆమె మైమరిచి పాడుతుంటే కళ్లెదుట శ్రీనివాస కల్యాణ వైభవం సాక్షాత్కరించాల్సిందే! పాట ప్రతి ఒక్కరికీ అని నమ్మి 30 ఏళ్లుగా సంగీత సేవ చేస్తూ.. దేశదేశాల్లో ‘అన్నమయ్య పాట... అందరి నోటా’ పలకాలని కృషి చేస్తున్నారు కల్యాణి ద్విభాష్యం. అన్నమయ్య జయంతి సందర్భంగా నేటి తరానికి పాట ప్రాధాన్యం గురించి పంచుకున్నారు...
మా పూర్వీకుల నుంచి అందుకున్న అమూల్య సంగీత సంపదనే.. నా తర్వాతి తరాలకీ కానుకగా ఇవ్వాలనుకుంటున్నా. తూర్పుగోదావరిలోని పిఠాపురం దగ్గర శ్రీరాంపురం మా తాతగారిది. సంగీతం, గణితంలో అష్టావధానం చేసిన దుడ్డు సీతారామయ్యగారు మా ముత్తాత. ఆయన ప్రతిభకు మెచ్చి రాజులు 200 ఎకరాలని బహుమతిగా ఇచ్చారట. అమ్మ ద్విభాష్యం సూర్యప్రభ ఆయన పేరుతో సంగీత అకాడమీని స్థాపించి వందల మందికి వీణ, సంగీతం వంటివి నేర్పించారు. ఆమే నా తొలి గురువు. నాన్న పాండురంగారావు బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా చేశారు. ఆయన ప్రభావంతోనే తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మే ఇంగ్లిష్ చదివా. నన్ను లెక్చరర్‌గా చూడాలన్నది నాన్న కల. కానీ తిరుపతిలో అడుగుపెట్టిన తొలిరోజే నా జీవితం మరో మలుపు తిరిగింది. మా గురువు పారుపల్లి రంగనాథ్‌గారిని కలిసింది అక్కడే. ఆయన శిష్యరికంలోనే అన్నమయ్య కీర్తనలు నేర్చుకుని, భక్తి సంగీతంవైపు అడుగులు వేశా. చిన్నప్పటి నుంచీ నాకు అన్నమయ్య కీర్తనలంటే ఇష్టమున్నా.. తిరుపతి వెళ్లాక అది మరింత బలపడింది. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి పాటలు వింటూ పెరిగాన్నేను. చిన్నప్పుడు నేను ‘దేవ దేవం భజే...’ పాడితే స్కూల్లో పిల్లలంతా ఒక చోటికి చేరి వినేవారు. లెక్చరర్ అయితే గొంతు పాడవుతుందేమో అన్న భయంతో ఆ వైపు వెళ్లలేదు. చదువయ్యాక పెళ్లి. మావారు కాకరపర్తి శ్రీనివాసరావు. వ్యాపారవేత్త. నా గానాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పాప కడుపున పడింది. కడుపులోని బిడ్డకూ సంగీతం అందాలని రోజూ తరగతులకి వెళ్లి రెండుగంటలు సాధన చేసేదాన్ని. తర్వాత హైదరాబాద్ వచ్చి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎమ్మే మ్యూజిక్‌లో చేరా. ఓ పక్కన నేర్చుకుంటూనే అమ్మ పేరుతో సంగీత అకాడమీని ప్రారంభించి మూడు దశాబ్దాలుగా ఆ సేవ కొనసాగిస్తున్నా.
పిల్లలకీ సంగీతం..
మా పాప లక్ష్మీభావజ కడుపులో ఉండగా సాధన చేశా అన్నా కదా! తను ఐదేళ్ల నుంచే గాయనిగా రాణించి ఎన్నో షోల్లో పాల్గొంది. ప్రస్తుతం సైకాలజిస్టుగా స్థిరపడింది. నిజానికి పిల్లలందరికీ సంగీత జ్ఞానాన్ని నేర్పించాలి. దీని వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సరైన భాష, ఉచ్చారణ వస్తాయి. అందుకే అకాడమీకి వచ్చిన వారికే కాదు రాలేని వారికి కూడా ఆ జ్ఞానాన్ని పంచాలనుకున్నా. పదేళ్లపాటు యూసఫ్‌గూడలోని స్టేట్‌హోమ్‌కి వెళ్లి ఉచితంగా పాఠాలు నేర్పాను. అన్నమయ్య సంకీర్తనలూ నేర్పి.. రవీంద్రభారతిలో ప్రదర్శనలు ఇప్పించా. వేసవిలో ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంటాను. అకాడమీని నడుపుతూనే 1200 పైచిలుకు కచేరీలు చేశా. వాటిలో అన్నమయ్య కీర్తనలదే ప్రధాన పాత్ర. వీటిల్లో నాకిష్టమైంది.. ‘ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లత’. ఈ కీర్తనని వేలసార్లు పాడి ఉంటాను. అన్నమయ్య కీర్తనల కోసం నేను చేస్తున్న కృషిని గుర్తించిన టీటీడీ వారు ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టులో అవకాశం ఇవ్వడంతో పది కీర్తనలు స్వరపరిచా. ఇప్పుడు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇవికాక విడిగా మరికొన్ని కీర్తనలు స్వరపరిచాను. ముఖ్యంగా శ్రీనివాస కల్యాణాల్లో పాడిన పాటలు నాకు ఎక్కువగా పేరుతెచ్చాయి. దాంతో తానా, నాటా, ఆటా, టీఎఫ్‌ఏఎస్ వంటి సంస్థల ఆధ్వర్యంలో అమెరికాలోనూ, దక్షిణాఫ్రికాలోనూ కచేరీలు ఇచ్చా. నెలల తరబడి ఇంటికి దూరంగా విదేశాల్లో ఉండాల్సి వస్తే మా వారు, కుటుంబసభ్యులే అండగా ఉండేవారు. స్కాట్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్‌లలో ఉండే పిల్లలకు ఆన్‌లైన్లో నేర్పిస్తున్నా. ఇక్కడ ఆసక్తి ఉన్న పేదపిల్లలకు ఉచితంగా నేర్పిస్తున్నా.
అవన్నీ దాచిపెడుతున్నా...
చిన్నప్పుడు వేసవి సెలవులకి అన్నవరంలోని మా అమ్మమ్మ పాలంకి కామేశ్వరిగారి ఇంటికి వెళ్లేదాన్ని. ఆమె వెనుకే తిరుగుతూ ఎన్నో పాటలు నేర్చుకున్నా. సందర్భానికి తగినవిధంగా ఉండే ఆ పాటలు, సాహిత్యం ఇప్పుడు అందుబాటులో లేవు. అవన్నీ నేను పాడి యూట్యూబ్, ఇన్‌స్టాలో దాచిపెడుతున్నా. నేను చెప్పేదొకటే... ఏది నేర్చుకోవడానికీ వయసు అడ్డంకి కాదు. సంగీతానికైతే అసలు కాదు. నా శిష్యుల్లో 78 ఏళ్ల వయసున్న వారు కూడా ఉన్నారు. ఈ వయసులో సరిగమలు నేర్చుకుని వీణ వాయిస్తున్నారు ఒకావిడ. కావాల్సింది మనసుపెట్టడమే.
ఆహ్వానం
వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911 కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.