Veena: లక్ష వడ్ల తోరణాలల్లారు

లోగిళ్ల వాకిళ్లకు అలంకరించే వడ్ల తోరణాలు సంపదను తెస్తాయనే సంప్రదాయం ఆ మహిళలకందరికీ ఉపాధి మార్గమైంది. సామాజిక మాధ్యమాలు వేదికగా లక్ష తోరణాలను విక్రయించి ఆర్థిక స్వావలంబన సాధించారు. తమలాంటివారికెందరికో స్ఫూర్తిగానూ నిలుస్తున్నారు.

Updated : 27 Feb 2024 15:02 IST

లోగిళ్ల వాకిళ్లకు అలంకరించే వడ్ల తోరణాలు సంపదను తెస్తాయనే సంప్రదాయం ఆ మహిళలకందరికీ ఉపాధి మార్గమైంది. సామాజిక మాధ్యమాలు వేదికగా లక్ష తోరణాలను విక్రయించి ఆర్థిక స్వావలంబన సాధించారు. తమలాంటివారికెందరికో స్ఫూర్తిగానూ నిలుస్తున్నారు.

క్కడ వర్షాలు, వరదలొస్తే నీట మునిగిన పొలాల్లోంచి వరికంకులను వేరుచేసి మాలలు, చాపలుగా కట్టి ఆరబెడతారు. అలాగే పండగల్లో, కొత్త పంట ఇంటికొచ్చిన సందర్భంలోనూ వరి కంకుల తోరణాలను తయారుచేసి గుమ్మాలని అలంకరిస్తారు. వీటిని వీధి గుమ్మానికి వేలాడదీస్తే అవి తినడం కోసం వచ్చే పిచ్చుకల కిలకిలరావాలు ఇంటిని సందడిగా మారుస్తాయి. మనసుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. గుమ్మం ముందు వడ్లు వేలాడితే ఆ ఇంట మహాలక్ష్మి అడుగుపెడుతుందని అక్కడంతా నమ్ముతారు. దీంతో ఆ గ్రామ మహిళలకు వడ్ల తోరణాలను తయారుచేసే నైపుణ్యం వంశపారంపర్యంగా వస్తుంది. ఈ కళను అక్కడి స్థానిక మహిళలకు ఉపాధిగా మార్చాలనే ఆలోచన వచ్చింది వీణకు. కర్నాటకలోని కుమ్తా గ్రామానికి చెందినవారీమె. 2019లో ఈ ప్రాంతంలో వచ్చిన వరదలతో పంటపొలాలన్నీ నీటమునిగినప్పుడు అక్కడివారంతా తడిసిన వడ్ల కంకులను ఆరబెట్టడానికి తోరణాలు, చాపల్లా అల్లి వేలాడదీయడం చూశారీమె. కంటికింపుగా ఉండే ఆ తోరణాల తయారీని ఉపాధిగా ఎందుకు మార్చకూడదని ఆలోచించారామె. కళాత్మకంగా తీర్చిదిద్దే ఆ తోరణాలను విక్రయించే బాధ్యత తన చేతిలోకి తీసుకున్నారు. దీనికోసం చేస్తోన్న టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. రైతు కుటుంబాల మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కల్పించాలంటే వారికి చేయూతగా ఉండాలని అనుకున్నారు వీణ.

లక్ష తోరణాలు..

కుమ్తా గ్రామంలోని హలక్కి గౌడాస్‌ కుటుంబాలకు చెందిన 19 మంది మహిళలతో మొదట తోరణాలను తయారు చేయించడం మొదలుపెట్టా అంటారు వీణ. ‘వీరంతా కలిసి రోజుకి 50 తోరణాలను అల్లగలరు. వీటి గురించి అందరికీ తెలియడానికి సామాజిక మాధ్యమాలను వేదికగా చేశా. అల్లికలో కనిపించే సృజనాత్మకతను వివరించి, వీటి వెనుక ఉన్న గ్రామీణ మహిళల గురించి చెప్పేదాన్ని. దీంతో వినియోగదారులు కొనడానికి ముందుకు రావడం మొదలుపెట్టారు. ఏడాది తిరిగేసరికల్లా ఆర్డర్లు పెరిగాయి. ఆసక్తి ఉన్న మరికొందరికి శిక్షణ ఇప్పిస్తున్నాం. వినియోగదారుల ఆర్డరు, అభిరుచి మేరకు రెండడుగుల నుంచి 20 అడుగుల పొడవు తోరణాలు తయారు చేయగలరు. అడుగు రూ.100 ధర ఉంటుంది. ప్రత్యేకంగా వీటికి ఒక సీజనంటూ ఏమీ లేదు. ఏడాదంతా అల్లుతుంటారు. వివాహాది శుభకార్యాలకు, పండగలకు ఎక్కువగా వీటికి గిరాకీ ఉంటుంది. గుమ్మానికి వేలాడదీసిన తర్వాత దాదాపు నాలుగేళ్లపాటు ఉంటాయి. ఇప్పటివరకు లక్షకు పైగా తోరణాలు విక్రయమయ్యాయి. స్థానికంగానే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు రావడంతో ఈ మహిళా బృందమంతా  ఆర్థిక స్వావలంబన పొందడం సంతోషంగా ఉంద’ని చెబుతున్న వీణ ప్రస్తుతం జిల్లా పంచాయతీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహిళలు అందరికీ వడ్లతో మరిన్ని రకాల ఉత్పత్తులను తయారుచేసేలా శిక్షణిప్పించి ఉపాధిని పెంచుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్