KL University: .. 20 పెళ్లిళ్లు ఆపాం!

చిన్న వివాదాలే చినికి చినికి గాలివానవుతాయి.. మాటపట్టింపులే కోర్టుల వరకూ వెళతాయి. అదే.. ఆవేశం స్థానంలో అవగాహన ఉన్నా.. హక్కులపై ఆలోచన ఉన్నా ఇలా జరగదంటారు ఈ న్యాయ విద్యార్థినులు.

Updated : 02 May 2023 07:46 IST

చిన్న వివాదాలే చినికి చినికి గాలివానవుతాయి.. మాటపట్టింపులే కోర్టుల వరకూ వెళతాయి. అదే.. ఆవేశం స్థానంలో అవగాహన ఉన్నా.. హక్కులపై ఆలోచన ఉన్నా ఇలా జరగదంటారు ఈ న్యాయ విద్యార్థినులు. అనడమే కాదు... గ్రామీణుల్లో హక్కులు, చట్టాలపై అవగాహన తీసుకొస్తూ, ఎన్నో విషయాల్లో అండగా నిలుస్తున్నారు...

‘పక్కింటి నీళ్లు మన గుమ్మంవైపు వస్తే గొడవ, పొలంగట్ల తగాదాలు ప్రాణాలమీదకే తెస్తాయి. చిన్నమాట పట్టింపు విడాకులదాకా వెళ్తుంది. ఇలాంటి వివాదాల్లో ఉభయులను కూర్చోబెట్టి.. స్టేషన్లు, కోర్టులకు వెళ్తే కలిగే నష్టం, కోల్పోయే సమయం గురించి చెబితే కొందరిలోనైనా మార్పు వచ్చి సామరస్యంగా పరిష్కరించుకుంటారనేది మా ఆలోచన’... అంటోంది న్యాయ విద్యార్థిని వైష్ణవి. ఆమే కాదు గుంటూరులోని వడ్డేశ్వరంలో ఉన్న కేఎల్‌ వర్సిటీలో బీబీఏ-ఎల్‌ఎల్‌బీ విద్యార్థినులు 70 మందిదీ ఇదేమాట. కాలేజీ యాజమాన్యం సాయంతో చుట్టుపక్కల వడ్డేశ్వరం, కుంచనపల్లి, కొలనుకొండ, ఇప్పటం, ఉండవల్లి, చిర్రావూరు, తాడేపల్లి, మంగళగిరి గ్రామాలకు వెళ్లి లీగల్‌ ఎయిడ్‌, అవగాహన పేరుతో ప్రజలు సమస్యలు పరిష్కరించుకోవడానికి అండగా ఉంటున్నారు. ‘రాజకీయ, సామాజిక, వ్యక్తిగత కక్షలుండే గ్రామాల్లో తరచూ పర్యటిస్తాం. ప్రజల్లో న్యాయపరమైన అవగాహన పెంచుతాం. బృందాలుగా ఒక్కో ఊరూ తిరుగుతాం. అక్కడి వారితో మాట్లాడతాం. మా దృష్టికొచ్చే సమస్యల తక్షణ పరిష్కారానికి చొరవ తీసుకుంటాం. అవసరమైతే ప్రజల తరపున మేమే అధికారులతో మాట్లాడతాం. కోర్టు, స్టేషన్‌ గుమ్మం తొక్కకుండా చూస్తాం. ఇలా రెండేళ్ల నుంచీ ఎన్నో సమస్యలకు దారి చూపించాం’ అంటోంది మరో విద్యార్థిని ఓజోవతి.

ఇరుకిల్లని...

‘కొలనుకొండలో... కొన్ని కుటుంబాల్లో పిల్లలకు 13 ఏళ్లకే పెళ్లిళ్లు చేయడం గమనించాం. వారితో మాట్లాడితే ‘మా ఇళ్లు చిన్నవి. పైగా ఆడపిల్లల్ని ఒంటరిగా ఇంట్లో ఉంచలేక పెళ్లి చేసేస్తున్నాం అన్నారు. ఇలా చేయటం నేరం, ఆడపిల్లలు అనారోగ్యాల పాలవుతారని, పిల్లలను బాగా చదివించాలని అవగాహన కల్పించాం. వారికి ఇళ్ల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేయించాం. అలా 20 పెళ్లిళ్లని ఆపగలిగాం. అలాగే సీతారాంపురం తండా అభివృద్ధికి దూరంగా ఉంది. ముఖ్యంగా మరుగుదొడ్లు లేక మహిళలు చాలా ఇబ్బంది పడేవారు. పంచాయతీకి వచ్చిన నిధులు ఈ తండాకి అందేవి కాదు. అక్కడి సర్పంచ్‌తో మాట్లాడి ఆరులక్షల రూపాయల్ని తండాకి కేటాయించేలా చేసి, వాటితో రోడ్డు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయించా’మని చెబుతోంది ఈ విద్యార్థుల్లో ఒకరైన స్వరూప.

ఆ డబ్బు వెనక్కి రప్పించారు..

మంగళగిరిలో ఓ వ్యక్తి నెలకు రూ.400-500 చొప్పున డిపాజిట్‌ చేస్తే నాలుగేళ్ల తర్వాత ఉంగరం, గొలుసు ఇస్తానని జనాల నుంచి డబ్బులు సేకరించటం వీరి దృష్టికి వచ్చింది. ‘అతను దివాలా తీసినా, అప్పులపాలైనా మీ డబ్బులకు గ్యారెంటీ ఏంటి?’ అని గ్రామస్థుల్లో అవగాహన కల్పించారు. అతని నుంచి నాలుగు లక్షల రూపాయలు వెనక్కి తీసుకుని తపాలా పొదుపు పథకాల్లో డిపాజిట్లు చేయించారు. ‘గ్రామీణుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలనుకుంటారు వ్యాపారులు. ఓ పెద్దావిడ గడువు దాటిన మందులు వేసుకోవడం చూశాం. అవి అమ్మిన పచారీ దుకాణదారుణ్ని అడిగితే తప్పించుకోవాలని చూశాడు. ఆ షాపులో ఉన్న గడువు ముగిసిన మందులను పారేయించాం. ఊరివారిని సమావేశపరిచి అలాంటి మందులపై అవగాహన కల్పించాం. వస్తువులు కొన్నప్పుడు బిల్లులు తీసుకోవడం, సేవల్లో లోపాలుంటే వినియోగదారుల కోర్టును ఆశ్రయించడం ఎలానో తెలియజేశాం. ఇవే కాదు... వరకట్న వేధింపులపైనా అవగాహన కల్పించి, యువతులకు భరోసా కల్పించాం. మరోపక్క పెద్దల్ని పట్టించుకోని పిల్లలపైనా కేసులు నమోదు అవుతాయని నచ్చచెప్పి చాలా మంది పెద్దలకు ఆదరవు దొరికేలా చూశాం. ఇద్దరి మధ్య పొలం సరిహద్దు వివాదం 4 క్రిమినల్‌, 4 సివిల్‌ కేసులకు దారి తీసింది. అవి పైకోర్టుల వరకూ వెళ్లకుండా లోక్‌అదాలత్‌ ద్వారా ముగింపు పలకబోతున్నాం’ అంటున్నారీ విద్యార్థినుల బృందం. మా కృషి ఫలించి ఈ ఊళ్లలో చైతన్యం పెరిగిందని సంతోష పడుతున్నారీ అమ్మాయిలు.

కాకర్ల వాసుదేవరావు, గుంటూరు


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని