Komaragiri Samrajyam: వాళ్లకోసం.. నగలు, భూమి అమ్మేశా!

తనకు అమ్మలేని లోటుని పూడ్చుకోవడం కోసం ఎంతోమంది అనాథ తల్లులని చేరదీశారామె! వాళ్లకోసం నగలు కుదువపెట్టారు... అవి చాలక ఆస్తుల్నీ అమ్మేశారు..  బంధానికి మించిన అందం లేదని నమ్మి కౌన్సెలింగ్‌ ద్వారా  భార్యాభర్తల మధ్య దూరాలనీ తగ్గిస్తున్నారు. ఆవిడే కొమరగిరి సామ్రాజ్యం..

Published : 31 May 2023 00:53 IST

తనకు అమ్మలేని లోటుని పూడ్చుకోవడం కోసం ఎంతోమంది అనాథ తల్లులని చేరదీశారామె! వాళ్లకోసం నగలు కుదువపెట్టారు... అవి చాలక ఆస్తుల్నీ అమ్మేశారు..  బంధానికి మించిన అందం లేదని నమ్మి కౌన్సెలింగ్‌ ద్వారా  భార్యాభర్తల మధ్య దూరాలనీ తగ్గిస్తున్నారు. ఆవిడే కొమరగిరి సామ్రాజ్యం..

ల్లిదండ్రులిచ్చే ఆస్తులు కావాలి కానీ.. వాళ్లకి ఒక ముద్ద అన్నం పెట్టడం భారం అని భావించే వాళ్లెంతో మంది. వయసు మీదపడిన వారిని.. సొంత వాళ్లే చీదరించుకోవడం చూస్తున్నాం. అలాంటిది ఏ ఆధారమూ లేని పెద్దవాళ్లని అక్కున చేర్చుకుని, సొంత పిల్లలకంటే ఎక్కువగా ప్రేమను పంచేవాళ్లని చూస్తే మెచ్చుకోకుండా ఎలా ఉంటాం!

తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా మంగపేటకి చెందిన సామ్రాజ్యం ఐదేళ్ల వయసులో తల్లిని కోల్పోయారు. అక్కాచెల్లెళ్లు ఎంతగా ప్రేమని పంచినా తల్లిలేని లోటుని మాత్రం పూడ్చలేకపోయారు. ‘అందుకే కాస్త పెద్దవాళ్లని చూస్తే వాళ్లకి ఏదైనా సాయం చేయాలనిపించేది. పేదవాళ్లైతే బియ్యం, వడ్లు, దుస్తులు ఇచ్చేదాన్ని. ఐదో తరగతితోనే నా చదువు ఆగిపోయింది. 13 ఏళ్లకే కొమరగిరి కేశవరావుతో పెళ్లయ్యింది. మాకు ఐదుగురు పిల్లలు. మావారికి ఊళ్లోనే దుస్తుల వ్యాపారం. పిల్లలను పెంచుకుంటూనే దూరవిద్యలో పదోతరగతి చదువుకున్నా. ఆయన ప్రోత్సాహంతో పేదలకు తోచిన సాయం చేస్తూ వచ్చా. పిల్లలు పెద్దయ్యాక ఒక ఎన్‌జీవో ప్రారంభించి పేదలకు సేవ చేస్తానంటే మా వారు వెన్నుతట్టా’రంటారు సామ్రాజ్యం.

పదెకరాలు అమ్మి..

సాయం చేయడానికి పిల్లలు.. పెద్దలు ఏంటి అని భావించిన సామ్రాజ్యం ముందుగా ‘మారి’ సంస్థతో కలిసి స్థానిక గొత్తికోయ పిల్లలకు చదువు చెప్పారు. ఇందుకు బోరు నర్సాపురంలోని తన ఇంటినే పాఠశాలగా మార్చారు. మంగపేట, ఏటూరు నాగారం మండలాల్లో ఐదు పాఠశాలలు నిర్వహించి దాదాపు 250 మంది చిన్నారులకు ఐదేళ్ల పాటు చదువు చెప్పించారు. ఇప్పుడా పిల్లల్లో ఎంతోమంది ఉద్యోగాలు సాధించారు. ‘మా ఇంట్లోనే పాఠశాలతో పాటు వృద్ధాశ్రమాన్నీ ఏర్పాటు చేశా. మొదట్లో ఐదుగురు చేరారు. ఆ తర్వాత మంగపేటలోని మా ఇంటి ఆవరణలోకి ఈ వృద్ధాశ్రమాన్ని తరలించా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఇతర ప్రాంతాల వృద్ధులను చేరదీసి సేవలు చేస్తున్నా. ప్రస్తుతం 34 మంది ఉన్నారు. వారికి మూడుపూటలా నేనే స్వయంగా వంట చేసి పెడతాను. కొంత మంది వాళ్ల పెళ్లిరోజు, పుట్టినరోజు వేడుకలు మా ఆశ్రమంలో చేసుకుని.. భోజనాలు పెడతారు. అప్పుడు తప్ప మిగతా రోజుల్లో నేనే వండుతాను. వీళ్లలో కొందరు మధుమేహం, పక్షవాతం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వారికి చికిత్సలు చేయిస్తున్నా. వయోభారం కారణంగా కొంతమంది ఇక్కడే ప్రాణాలు విడిచారు. బంధువులు రాని వాళ్లకు నేనే అంత్యక్రియలు చేస్తా. ఈ నిర్వహణకు నెలకు రూ.లక్ష ఖర్చవుతుంది. ఆ డబ్బుని మా వారు, పిల్లలే సర్దుతున్నారు. అయినా కొన్ని సందర్భాల్లో నా నగలు, మాకున్న 10 ఎకరాల పొలం కూడా అమ్మాల్సి వచ్చింద’ని చెబుతారు సామ్రాజ్యం.

వాళ్లు విడిపోకూడదని..

ఆశ్రమంతోపాటే మహిళామండలినీ ప్రారంభించారు సామ్రాజ్యం. భార్యభర్తల మధ్య సఖ్యత లేనప్పుడు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి రాజీ కుదురుస్తారు. ఇంతవరకూ వెయ్యికి పైగా కౌన్సెలింగ్‌లు ఇచ్చారు. పేద జంటలకు పెళ్లిళ్లూ చేస్తారు. ‘మాది ఏజెన్సీ ఏరియా కావడంతో చుట్టుపక్కల ఏ ఆపద వచ్చినా మా మహిళా మండలికే వస్తారు. అధికారులు, నాయకులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరిస్తా. ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉంటాను. ప్రభుత్వ సాయమూ తోడైతే బాగుంటుంది. మరింత మందికి సేవ చేసేలా అన్ని వసతులతో ఆశ్రమాన్ని విస్తరించాలన్నది నా కల’ అంటున్నారు సామ్రాజ్యం.

- సోగాల స్వామి, జయశంకర్‌ భూపాలపల్లి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్