Neeru yadav: హాకీ.. సర్పంచ్‌

నిన్న మొన్నటి దాకా ఝుంఝును ప్రాంతంలో ఆడపిల్లలు ఇంటి నాలుగ్గోడలకే పరిమితమయ్యేవారు. ఆ సంప్రదాయ భావాలను బద్దలుకొడుతూ క్రీడాకారిణులుగా సత్తా చాటుకుంటున్నారిప్పుడు.

Published : 15 Apr 2023 00:20 IST

నిన్న మొన్నటి దాకా ఝుంఝును ప్రాంతంలో ఆడపిల్లలు ఇంటి నాలుగ్గోడలకే పరిమితమయ్యేవారు. ఆ సంప్రదాయ భావాలను బద్దలుకొడుతూ క్రీడాకారిణులుగా సత్తా చాటుకుంటున్నారిప్పుడు. ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరానున్న లాంఘీర్‌లో హాకీని క్రికెట్‌తో సమానంగా చూస్తారు. కనీసం ఇరవైమంది అమ్మాయిలు హాకీ స్టిక్స్‌తో కనిపిస్తుంటారు. ఇది మహిళా సాధికారతకు, స్వేచ్ఛకు సంకేతమనే చెప్పాలి. ఇందులో మెచ్చుకోదగ్గ సంగతేమంటే వీళ్లెవరూ సంపన్నులు కాదు. రైతు కుటుంబాలకు చెందినవారే. ఇంతకీ ఈ మార్పెలా సాధ్యమైందంటే.. ఆ ఘనత లాంఘీర్‌ సర్పంచ్‌ నీరూ యాదవ్‌దే.

ఇక్కడ ఆడ పిల్లలను స్వేచ్ఛగా తిరగనివ్వరు. చిన్నతనంలోనే పెళ్లి చేసేస్తారు. అమ్మాయిలకు ఆడుకునే అర్హత కూడా లేదన్నట్టు బయటకు రానివ్వరు. మూడేళ్ల క్రితం ఈ గ్రామానికి సర్పంచ్‌ అయిన నీరూ ఈ సంప్రదాయాన్ని మార్చాలనుకుంది. ‘చక్‌ దే ఇండియా’ చిత్రమే అందుకు ప్రేరణ. గతేడాది రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో రూరల్‌ ఒలింపిక్స్‌ జరగబోతున్నప్పుడు కొందరు ఆడపిల్లలు నీరూని కలిశారు. ‘హాకీ జాతీయ క్రీడ అంటారుగా! అది నేర్చుకోవాలనుంది. అబ్బాయిలేనా, మేమెందుకు ఆడకూడదు?’ అనడిగారు. నీరూకి తన బాల్యం కళ్లముందు మెదిలింది. ఆమె తండ్రి ప్రధానోపాధ్యాయుడు. తల్లి టీచర్‌. అయినా తనకు నచ్చిన ఆటలు ఆడలేకపోయింది. ఇప్పటికైనా మార్పు రావాలనుకుంది. వెంటనే హాకీ క్రీడకు ప్రణాళిక రచించింది. కానీ హాకీ కిట్లు, స్టిక్స్‌ లేవు.

అనుకున్నది సాధించేందుకు సర్పంచ్‌గా తన రెండేళ్ల జీతాన్ని వినియోగించింది. కిట్లు, కర్రలు, డ్రెస్సులు కొనుగోలు చేసింది. ఊళ్లో ఆటస్థలం లేనందున 8 కిలోమీటర్ల దూరానున్న సింఘానియా విశ్వ విద్యాలయానికి పిల్లల్ని స్వయంగా తీసుకెళ్లి ఆడే ఏర్పాటు చేసింది. వాళ్ల సంరక్షణ అంతా ఆమెదే. అంతేకాదు, హాకీ నేర్పడానికి కోచ్‌కి జీతం కూడా ఆమే చెల్లించింది. ఆ ప్రయత్నం వృథా పోలేదు, సత్ఫలితాలొచ్చాయి. గత ఏడాది రూరల్‌ ఒలింపిక్స్‌లోనూ జిల్లా స్థాయి గుర్తింపు వచ్చింది. కానీ ఇదంతా తేలిగ్గా సాధ్యమైన వ్యవహారమేం కాదు.

నీరూ అమ్మాయిలను ప్రోత్సహించడంతో బాటు కొన్నిసార్లు వారితో కలిసి హాకీ ఆడుతుంది. వారి తల్లిదండ్రులను ఆటస్థలానికి రప్పిస్తుంది. మొదట్లో చాలామంది ఆడపిల్లలకు హాకీ అవసరమా అనేవారు. ఝుంఝును జిల్లా బాలికలు చదువులో ముందున్నట్లు క్రీడల్లోనూ ఉండాలనుకుంది. వాళ్లు హాకీలో రాణిస్తారంటూ తల్లిదండ్రులను ఒప్పించేది. నీరూ పట్టుదలతో అమ్మాయిలు నిర్బంధాలు లేకుండా, స్వేచ్ఛగా హాకీ ఆడగలిగారు. ‘నా ప్రయత్నంతో చాలామంది అమ్మాయిలు మైదానానికి వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. కొత్తపిల్లలు దెబ్బలు తగులుతాయని భయపడుతుంటే తల్లిదండ్రులే ప్రోత్సహించేంతగా మార్పొచ్చింది. బాగా ఆడుతున్నవారిని ఆదర్శంగా చూపిస్తూ ధైర్యం చెబుతూ ప్రేరేపిస్తున్నారు. ‘నా భర్త ఇంజినీరు, మాజీ ఆర్మీ ఆఫీసరు. ఆయన మద్దతు ఉండబట్టే నేనిదంతా చేయగలుగుతున్నాను. పిల్లల ఆటతీరును మెరుగుపరచడమే కాకుండా ఊళ్లో పెద్ద హాకీ టోర్నమెంట్‌ను నిర్వహించే పనిలో నిమగ్నమయ్యాను. దీనివల్ల చాలామంది అమ్మాయిలు జాతీయ స్థాయికి చేరే అవకాశముంది. క్రీడలను కెరియర్‌గా చేసుకోగలుగుతారు. దృఢసంకల్పం ఉంటే విజయం తథ్యం’ అంటారు నీరూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్