Leela-Devi: గృహిణుల శక్తికి చిహ్నమీ.. రసోయి!

‘మా ఆయన కిరాణా దుకాణంలో పని చేస్తాడు. నాకేమో వంట తప్ప మరో ప్రపంచం తెలీదు. ముగ్గురు పిల్లలు.. పోషణే కష్టం. ఇక చదువులేం చదివిస్తామన్న బెంగ ఉండేది. ఇప్పుడు నా పిల్లలు కాన్వెంట్‌లో చదువుతున్నారు’ అని ఆనందంగా చెబుతోంది లీల.

Published : 30 May 2023 00:01 IST

‘మా ఆయన కిరాణా దుకాణంలో పని చేస్తాడు. నాకేమో వంట తప్ప మరో ప్రపంచం తెలీదు. ముగ్గురు పిల్లలు.. పోషణే కష్టం. ఇక చదువులేం చదివిస్తామన్న బెంగ ఉండేది. ఇప్పుడు నా పిల్లలు కాన్వెంట్‌లో చదువుతున్నారు’ అని ఆనందంగా చెబుతోంది లీల.

‘రూపాయి కావాలన్నా మా ఆయన ముందు నిల్చోవాల్సిందే. నాకంటూ ఓ గుర్తింపే ఎరుగను. ఎప్పుడైనా బయటికి వెళ్లినా కొందరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక ముడుచుకుపోయేదాన్ని. అలాంటి నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎవరి ఆధారమూ లేకపోయినా బతకగలనన్న ధైర్యం వచ్చింది. కొంత ఇంగ్లిష్‌ కూడా నేర్చుకున్నా’నంటోంది దేవి.

వీళ్లిద్దరే కాదు.. బిహార్‌లో గడపదాటి కాలు బయటపెట్టని ఎంతోమంది గృహిణులు సంపాదిస్తున్నారు. ఉమ్మడిగా చేరి వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడటమే కాదు.. రూ.55 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. వాళ్ల కథేంటో చదివేయండి.

దీదీ కీ రసోయి.. 2018లో పైలట్‌ ప్రాజెక్టు కింద బిహార్‌లోని వైశాలీ జిల్లాలో ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంత మహిళల అభివృద్ధి కోసమని అక్కడి ప్రభుత్వం ‘జీవిక’ అనే కార్యక్రమం ద్వారా దీన్ని ఆరంభించింది. కేరళలోని ‘కుడుంబశ్రీ కేఫ్‌’ దీనికి ఆదర్శం. ఇదో విమెన్‌ నెట్‌వర్క్‌. చిన్న రెస్టారెంట్లు, హోటళ్లు మహిళలే నిర్వహించుకుంటూ ఉపాధి పొందుతున్నారు. వీళ్లను అనుసరించే బిహార్‌లో ‘దీదీ కీ రసోయి’ ప్రారంభమైంది. ప్రపంచ బ్యాంకూ దీనికి సాయమందించింది. ఆసక్తి ఉన్న మహిళలను జీవిక బృందం ఎంపిక చేస్తుంది. వారికి శుభ్రత నుంచి కస్టమర్‌ సర్వీస్‌, వంట గది నిర్వహణ, కస్టమర్లతో ప్రవర్తించే తీరు మొదలైన వివిధ అంశాల్లో శిక్షణనిస్తారు. ఆపై పెట్టుబడి దగ్గర్నుంచి, ఎక్కడ ప్రారంభిస్తే లాభాలొస్తాయనేదీ ఆ బృందమే పరిశీలిస్తుంది. సరకులు, కావల్సిన సామగ్రి సహా అందిస్తారు. అంతేకాదు.. ఆరోగ్యం సహా వివిధ ప్రభుత్వ విభాగాలు వీరికి అండగా ఉంటాయి. వీళ్లు చేయాల్సిందల్లా ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండి, అందివ్వడం.

మొదట ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొదలైన ఈ గృహిణుల సేవలు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎస్‌బీఐ, ఆర్‌బీఐ ఆఫీసులు, రెసిడెన్షియల్‌ స్కూళ్లకు విస్తరించాయి. రాష్ట్రవ్యాప్తంగా 97 కిచెన్లు ఏర్పాటు అయ్యాయి. నిర్వహణ అంతా మహిళలదే. హెడ్‌ కుక్‌, కౌంటర్‌ స్టాఫ్‌.. ఇలా హోదాలూ ఉంటాయి. విధులను బట్టి ఒక్కొక్కరికీ నెలకు రూ.8 వేల నుంచి 10 వేల వరకూ జీతాలొస్తున్నాయి. పోషకాలతో కూడిన ఆహారమే వీళ్ల మెనూలో దొరుకుతుంది. ఏరోజుకారోజు మహిళలే నిర్ణయించుకొని వంటకాలు సిద్ధం చేస్తారు. ఆసుపత్రుల్లో ఆరోగ్యకరమైన ఆహారం అందివ్వడంతోపాటు మహిళలకు ఉపాధి కల్పించినట్లు అవుతుందన్న ప్రభుత్వ ఆలోచన రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. వీధి కన్నెరుగని గృహిణులను తమ కాళ్లమీద తాము నిలబడేలా చేస్తోంది. ఏర్పాటు చేసిన ప్రతిచోటా లాభాల బాట పట్టడమే కాదు.. ఆన్‌లైన్‌ సేవలూ అందిస్తున్నారు. ప్రస్తుతం దీదీ కా రసోయి రూ.55 కోట్ల టర్నోవర్‌నీ అందుకుంటోంది. అందుకే ఇతర ప్రాంతాలకీ విస్తరించే ఆలోచనలో ఉంది బిహార్‌ ప్రభుత్వం. మహిళల ఉమ్మడి శక్తికి ఈ రసోయీ చిహ్నంలా ఉంది కదూ?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్